రామయ్యకి తోడుగా జానకమ్మ | did not say anything to my husband. | Sakshi
Sakshi News home page

రామయ్యకి తోడుగా జానకమ్మ

Published Thu, Feb 9 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

రామయ్యకి తోడుగా జానకమ్మ

రామయ్యకి తోడుగా జానకమ్మ

‘వృక్షో రక్షతి.. రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్‌ సైకిల్‌పై తిరిగే నా భర్తను చూసి.. ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు  ఏమి అన్నా నేను మాత్రం నా భర్తను ఏమీ అనలేదు.

‘అనుకూలవతిౖయెన సుదతి దొరకుట పురుషుడి అదృష్టం’ అంటారు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య. అన్నట్టుగానే ఆయన ఆశయంలో, తలపెట్టిన లక్ష్యంలో తోడు, నీడై నిలిచింది భార్య జానకమ్మ. భర్త తలంచిన కార్యంలో ఆయనతో పాటు అడుగేసింది. రామయ్యకు మొక్కలపై ఉన్న ప్రేమతో ఆమె కూడా మొక్కలు నాటింది. కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్యను ఇటీవలే పద్మశ్రీ అవార్డు వరించిందని తెలిసి  పద్మశ్రీ రావడం తమ బాధ్యతను మరింతగా పెంచిందనీ అందరూ వన ప్రేమికులమై ప్రపంచమంతా మొక్కలు నాటాలన్నదే తమ ధ్యేయం అని అంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ మాటలు...

పులి ఉన్నా మొక్కలే ముఖ్యం
‘నేనే రోజూ గేదెల వెంట పోత. ఒకరోజు చేలల్లో రెడ్డోరి ఆవును పెద్ద పులి తిన్నదని ఊళ్లో అనుకున్నరు. అప్పుడు గేదెల వెంట పోవాలంటే భయపడ్డా. తోడు నువ్వురా అని ఆయనను అడిగా. గేదెల పాలు పోసి వెంటనే వస్తానని ఖమ్మం పోయిండు. ఎప్పుడు వస్తాడోనని భయపడుతూనే గేదెల మేపా. పొద్దుపోయినా రాలేదు. చీకటి పడింది. ఇంట్లో అన్నం వండుతుంటే వచ్చిండు. అప్పుడు ఆయన్ను చూసి కోపం వచ్చింది. ‘నన్ను పెద్దపులి తిన్నా రావా..?’ అని ఏడ్చా. పాలు పోసి మొక్కలు తెచ్చేందుకు వెళ్లా అని చెప్పాడు. ‘నువ్వు గేదెలు కాసేందుకు వెళ్లక ముందే చేలల్లకు పోయి చూసిన. ఎక్కడా పులి గుర్తులు లేవు. నక్కో, తోడేలో వచ్చింది. అంతే. అందరూ పెద్దపులి అని భయపడ్డారు. అంతా చూసే నేను రాలేదు’ అని అన్నాడు. పెద్దపులి ఉంటే నా భార్యకు ఏమవుతుందోనని భయపడి ముందే చేలల్లో చూసి వెళ్లిన ఆయనపై కోపం తగ్గింది. భార్యగా నా మీద, మొక్కల మీద, పిల్లల మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో అప్పుడు ఆర్థమైంది’..

తొమ్మిదో ఏటే పెళ్లైయింది
మా అమ్మనాన్నలు శంకరమ్మ, వెంకట్రామయ్య. మాది తుమ్మలపల్లి గ్రామం కొణిజర్ల మండలం. ఆరుగురు మగవాళ్లం. ఇద్దరం ఆడోళ్లం. చిన్నప్పుడే అమ్మనాన్న చనిపోయిండ్రు. అమ్మమ్మ దగ్గరే పెరిగాం. రామయ్య ఊరు ముత్తగూడెం. నా తొమ్మిదో ఏటే పెళ్లయింది. అప్పుడు రామయ్య వయస్సు 15 ఏళ్లు. అప్పటికే ఆయన ఎక్కడికి పోయినా మొక్కలు నాటేవాడు. ముత్తగూడెం నుంచి రెడ్డిపాలెం వచ్చాం. ఇక్కడ మా పొలాలు ఉండడంతో వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉన్నాం. మాకు మగ్గురు కొడుకులు. ఇద్దరు ఆడపిల్లలు. ఒక కొడుకు అనారోగ్యంతో చనిపోయిండు.

కుండలు చేయకుండా చెట్లబాట పట్టిండు
మేము కుమ్మరోళ్లం. మా మామ లాలయ్య కుండలు చేసేవాడు. మా ఆయనకు కుండలు చేయడం రాదు. దీపాంతలు చేయడం ఒక్కటే తెలుసు. కొన్నాళ్లు మేళం వాయించాడు. కుండలు చేయడం రాకపోతే పిల్లలతో ఎలా బతకాలని బాధపడ్డా. ఉన్న పొలంలో కొంత నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద పోయింది. మొక్కలు, చెట్లు అంటూ తిరిగి ఉన్న 3 ఎకరాలు అమ్మిండు. మళ్లీ కొన్నాళ్లకు పొలం కొన్నాం. గేదెల పాలు తీస్తే పోసి వచ్చేది. వీటితో వచ్చే పైసలతోనే కుటుంబాన్ని గట్టెక్కించా. ఎక్కడ విత్తనాలు కనిపించినా ఏరకవస్తాడు. వేప, సుబాబుల్, గానుగ, చింత గింజలు తెచ్చి నాకిస్తే వాటిని చాటలో చెరిగి పెట్టేదాన్ని. ఇవి తీసుకెళ్లి నర్సరీ పెట్టేవాడు.

వాళ్ల అమ్మ బీర ఇత్తులు నాటిందని..
కుండలు చేయడానికి ఉపయోగించే మట్టి మా మామ తెచ్చిపోస్తే అందులో మా అత్త బీర ఇత్తులు నాటిందట. అవి పెద్దవై కాయలు కాశాయట. మా ఆయన కూడా వాళ్ల అమ్మను చూసి బీర ఇత్తులు పెట్టడంట. మొక్కలు నాటితే వాటి పండ్లు తినవచ్చని, భవిష్యత్‌ తరాలు బాగుంటాయని వాళ్ల అమ్మే చెప్పిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల ఆమ్మ మాటే పట్టుకొని మొక్కలు నాటుతుండు. ఒకసారి పొయ్యి కాడ పొంతకుండ పక్కనే మొక్క వేసిండు. ఇక్కడ వేడి ఉంటుంది ఎందుకు వేశావు అని అడిగాను. ‘పదును ఉంటుంది. బతుకుద్దిలే’ అన్నాడు. రెండు కోట్ల వరకు అయిన వేసిన మొక్కలు ఉన్నాయి. బాట వెంట పోయే వాళ్లందరూ ఇవి రామయ్య వేసిన మొక్కలు అని అంటే మా ఆయన గొప్పతనం నాకు తెలిసేది.

పిచ్చోడు అన్నవారు.. ఆశ్చర్యపోతున్నారు..
‘వృక్షో రక్షతి రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్‌ సైకిల్‌పై తిరిగే నాభర్తను చూసి ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు ఏమి అన్నా నేను నా భర్తను ఏమీ అనలేదు. మొక్కలంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో చూసి మొక్కలు నాటమనే చెప్పా. అప్పుడు ఆయనను చూసి నవ్వినవాళ్లు, పిచ్చోడు అన్నవాళ్లు పద్మశ్రీ అవార్డు రావడం చూసి ఆశ్చర్య పోతుండ్రు. ఇంతకన్నా నాకు సంతోషం ఏం కావాలి..?

తోడుగానే ఉంటా..
ఇప్పుడు ఆయన వయస్సు 77 ఏళ్లు. జీవితాంతం ఆర్థాంగిగా తోడు ఉంది ఆయన్ను బాధపెట్టకుండా మొక్కలు నాటడంలో తోడు ఉండటమే నా పని. ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తే నర్సరీ ఏర్పాటు చేస్తాం. మొక్కలు పెంచి ప్రజలకు ఇవ్వాలన్నది మా తపన. మా పిల్లలు కూడా ఆయనలా మొక్కలు నాటి సమాజంలో పేరు తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. నా భర్తను అందరూ ‘వనజీవి’ రామయ్య అంటారు. ఇప్పుడు ఈ ఆవార్డుతో  ‘పద్మశ్రీ రామయ్య’ అంటున్నారు. మా ఇంటికి వచ్చి కార్లల్లో తీసుకెళ్లి సన్మానం చేస్తున్నారు.

మనవరాళ్ల పేర్లు.. కబంధపుష్పం, హరితలావణ్య
ఆయనకు పిల్లలు, మనవరాళ్లు అంటే ప్రాణం. మనువరాళ్ల పేర్లు ఏమి పెట్టాలని పిల్లలే ఆయన్ను అడిగేవారు. మొక్కల మీద ఉన్న ప్రేమతో మనవరాళ్లకు ‘కబంధపుష్ప, వనశ్రీ, చందనపుష్ప, హరితలావణ్య’ అని పేర్లు పెట్టాడు. ఐదో తరగతి చదువుకున్న ఆయన రోజూ పుస్తకం తీసుకొని అందులో చెట్లు, మొక్కలపై సూక్తులు రాస్తాడు. చెట్లు నాటితే మనషుల లోకం ఎలా ఉంటుందో నాకు చెప్పుతాడు. ఆయనకు తెలిసిన ప్రాంతమంతా మొక్కలే నాటిండు. మా ఇంట్లో, ఊళ్లో, రోడ్ల వెంట ఎక్కడ చూసినా ఆయన నాటిన మొక్కలే.

జానకమ్మ .. నా క్లాస్‌మెంట్‌..
‘ఆడది కారం వేసుకొని తినాలి.. మగాడు కోడిగుడ్డు తినాలి అని ఎనకట పెద్దలు చెప్పేవాళ్లు. ‘ఆడోళ్లు మగాడితో సమానంగా వరి కోస్తరు, మోపులు మోస్తరు. ఎడ్లకు వరిగడ్డి వేస్తరు. పాలిచ్చే గేదెలకు పచ్చిగడ్డి పెడతరు. మగాళ్లకు బాధ తెలియకుండా పిల్లలను పెంచుతరు. వారికి పౌష్టికాహారం పెట్టాలి. మగాడు కారం తినాలి. ఆడది గుడ్డు తినాలి అంటాను నేను. అప్పుడే కుటుంబం ఇల్లు చక్కగా ఉంటుంది.


నేనూ జానకమ్మ స్నేహితుల్లా ఉంటాం. ఆమెపై ఎప్పుడూ పెత్తనం చేయను. మొక్కలు నాటాలని ప్రచారానికి వెళ్లే నాకు సైకిల్‌ మధ్యలో ఎక్కడైనా పంక్చర్‌ అవుతుందేమోనని పదిరూపాయలు తెచ్చి నా జేబులో పెట్టేది. నేనంటే జానకమ్మకు అంతటి ప్రేమ. నేను నమ్మిన సిద్ధాంతానికి నా వెంటే జీవితాంతం తోడై నడుస్తోంది. మా ఇద్దరి ఆశయం ఒక్కటే. దేశంలో గ్రీన్‌ కరెన్సీ రావాలి. ప్రపంచం మన దేశాన్ని ‘పచ్చని భారతదేశం’ అని చెప్పుకోవాలి. – ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత రామయ్య

– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement