ఒంటరిగా ఎలా ఉంటున్నావు? | Woman files complaint against CI Ramaiah | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఎలా ఉంటున్నావు?

Published Sun, Feb 9 2025 4:05 AM | Last Updated on Sun, Feb 9 2025 4:05 AM

Woman files complaint against CI Ramaiah

మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన సీఐ!

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేసిన మహిళ

సీఐ రామయ్యపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి

సీఐపై విచారణకు ఆదేశించిన ఎస్పీ

పుట్టపర్తి టౌన్‌: బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లి­న తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్య­కరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకో­వాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మడకశిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయిత్రి శనివారం ఎస్పీ రత్నను కలిసి పోలీసు స్టేషన్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీని ఆదేశించారు.

అనంతరం పోలీస్‌ కార్యాలయం ఎదుట బాధితురాలు గాయత్రి మీడియాతో గోడు వెళ్ల­బోసుకొంది. టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిందని చెప్పింది. వారికి సర్ది చెప్పాలని తాము కూడా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లామంది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వచ్చి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు చెప్పింది.

అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్‌లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్‌ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్‌ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశా­రని వివరించింది. 

వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్‌ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింది. విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయ­బ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకో­వా­లని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement