
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి11) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్నా అని కేకలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు తీరని అన్యాయం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్‌ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యాయని లక్ష్మి గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.ఏపీలో మహిళలు భయంభయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అన్యాయాలపై కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? ఆడపిల్లకు అన్యాయం చేస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు చిలుక పలుకులు పలికారు. తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్ హయాంలో ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేవారు.
ఈరోజు నేరస్తులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. లక్ష్మిని జైపూర్ పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారని మూడు రోజుల ముందే కిరణ్‌రాయల్ ఎలా చెప్పాడు? అసలు ఆ పోలీసులను పిలిపించింది ఎవరు? బాధితులనే అరెస్టు చేయడం ఒక్క ఏపీలోనే జరుగుతోంది. ప్రశ్నించే గొంతులను నులిమేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.
అణచి వేయాలని చూస్తే అంతకుఅంతగా ఎదుగుతారని గుర్తుంచుకోండి.పవన్ కళ్యాణ్ సిద్దాంతం ప్రకారం..కిరణ్ రాయల్‌ను తొక్కిపట్టి నార ఎందుకు తీయలేదు? అదేమంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ప్రజలకు పోలీసులు ఏమాత్రం రక్షణ కల్పించలేక పోతున్నారు. ఆడపిల్లల కన్నీటి చుక్కలకు కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
సినిమా ఫంక్షన్‌లలో కొందరు అనవసర వాగుడు వాగుతున్నారు. వారి వలన సినిమా చచ్చిపోతుంది.సినిమా బతకాలి,దాని ద్వారా వందల కుటుంబాలు బతుకుతున్నాయి.నేను చాలా ఈవెంట్లకు హోస్ట్ చేశాను. కానీ ఎప్పుడూ 23 అనే మాట మాట్లాడలేదు’అని శ్యామల గుర్తుచేశారు.