తాడేపల్లి, సాక్షి: ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
‘‘అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదు. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదు. చీకటికాలంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్తులకు అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?. మహిళల కోసం ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. ప్రత్యర్ధి పార్టీలను వేధించటానికే పోలీసులను వాడుకుంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు కాస్త కూడా బాధ లేదు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పక్క రాష్ట్రం వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టింది. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదు?. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదు? ఆయనకు బాధ్యత లేదా?. తెనాలి యువతిపై అఘాయిత్యం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. ఇన్ని జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక మహిళగా, ఒక తల్లిగా కూడా హోంమంత్రి స్పందించరా?.
..టీడీపీ నేత ఖాదర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగితే హైకోర్టు రూ. ఐదు లక్షలు పరిహారం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. రిషితేశ్వరి ఘటనలో దోషిగా ప్రిన్సిపాల్‌పై కేసు కూడా పెట్టలేదు. వైస్సార్‌సీపీ నేతలు ధర్నాలు చేస్తేగానీ అరెస్టు చేయలేదు. వనజాక్షి విషయంలో కూడా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు.
వైఎస్సార్‌సీపీ హయాంలో దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా ఎందరో మహిళలకు న్యాయం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ చట్టంపరై బురదజల్లారు. దిశా యాప్ ద్వారా 13,600 మంది రక్షణ పొందారు. అలాంటి గొప్ప యాప్‌ని చంద్రబాబు తొలగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆరుగురిని హత్య చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ విజృంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పిల్లలకు మంచి చదువులు దూరం అయ్యాయి. మంచి తిండి దూరం అయింది. చివరికి మంచినీరు కూడా దొరకక డయేరియా వ్యాపించే పరిస్థితి తెచ్చారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment