న్యూఢిల్లీ: ఓ కామెడీ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని శివసేన ఉద్దవ్ వర్గం భావిస్తోంది. అయితే ఈలోపు.. కేంద్ర నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది.
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) ఓ పాపులర్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగ పరచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో మరికొందరు రాజకీయ నేతలు కూడా నీచపు వ్యాఖ్యలు చేశాడంటూ అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. పాడ్‌కాస్ట్‌లపై నిషేధం విధించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మరోవైపు.. అతనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్రం నోటీసులు పంపింది.
కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే యూట్యూబ్ ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు.
ప్రధాని అతనికి అవార్డు ఇచ్చారు
మరోవైపు.. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని యూబీటీ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెబుతున్నారు. హాస్యం పేరిట అనుచిత వ్యాఖ్యలతో హద్దులు దాటడం.. ఏ భాషలోనైనా సహించేది లేదు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పానెల్ వద్ద చర్చిస్తాం. ప్రధాని మోదీ అతనికి(రణవీర్ అల్హాబాదియా) అవార్డుఇచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారామె.
సమయ్ రైనా నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్‌ను ఉద్దేశించి.. ‘‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.
సారీ చెప్పినా..
‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు.. హాస్యమైనవీ కాదు.. హాస్యం నా బలం కాదు.. నేనిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే’’ అని ఎక్స్‌లో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం చల్లారడం లేదు. రణవీర్‌తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలపైనా కేసులు నమోదు అయ్యాయి.
రణవీర్ అల్హాబాదియా ఎవరంటే..
31 ఏళ్ల వయసున్న రణవీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేఆం కాదు. ఇతనొక ప్రముఖ యూట్యూబర్. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి ఒక కోటి ఐదు లక్షల మంది దాకా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అతను సహ వ్యవస్థాపకుడిగా నడిపిస్తున్నాడు. అంతేకాలు.. పలువురు పొలిటికల్ లీడర్ల మీద అతను పేల్చిన జోకులు విమర్శలు సైతం దారి తీశాయి.
ఏమిటీ షో ఉద్దేశం
ఇండియాస్ గాట్ లాటెంట్ అనేది ఒక కామెడీ షో. తమలోని హాస్యకోణాన్ని కొత్తగా ప్రదర్శించుకోవాలనుకునేవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఏర్పాటు చేసిన వేదిక ఇది. కేవలం హాస్యం మాత్రమే కాదు.. పాటలు పాడడం, డ్యాన్సులు.. ఇలా ఎన్నో టాలెంట్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. అయితే ఇది రెగ్యులర్ తరహాలో ఉండదు. అందుకే అంతటి ఆదరణను చురగొంది. అదే సమయంలో అక్కడి కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు, జడ్జిల కామెంట్లు అభ్యంతరకంగా ఉండడంతో పలు వివాదాల్లోనూ ఈ షో చిచ్కుకుంది.
Comments
Please login to add a commentAdd a comment