information and boradcasting ministry
-
హాస్యం పేరిట నీచపు వ్యాఖ్యలు.. కేంద్రం నోటీసులతో స్పందించిన యూట్యూబ్
న్యూఢిల్లీ: ఓ కామెడీ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని శివసేన ఉద్దవ్ వర్గం భావిస్తోంది. అయితే ఈలోపు.. కేంద్ర నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది.ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) ఓ పాపులర్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగ పరచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో మరికొందరు రాజకీయ నేతలు కూడా నీచపు వ్యాఖ్యలు చేశాడంటూ అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. పాడ్‌కాస్ట్‌లపై నిషేధం విధించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మరోవైపు.. అతనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్రం నోటీసులు పంపింది.కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే యూట్యూబ్ ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని అతనికి అవార్డు ఇచ్చారుమరోవైపు.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని యూబీటీ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెబుతున్నారు. హాస్యం పేరిట అనుచిత వ్యాఖ్యలతో హద్దులు దాటడం.. ఏ భాషలోనైనా సహించేది లేదు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పానెల్ వద్ద చర్చిస్తాం. ప్రధాని మోదీ అతనికి(రణవీర్ అల్హాబాదియా) అవార్డుఇచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారామె.సమయ్ రైనా నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్ను ఉద్దేశించి.. ‘‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.సారీ చెప్పినా.. ‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు.. హాస్యమైనవీ కాదు.. హాస్యం నా బలం కాదు.. నేనిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే’’ అని ఎక్స్‌లో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం చల్లారడం లేదు. రణవీర్‌తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలపైనా కేసులు నమోదు అయ్యాయి. రణవీర్ అల్హాబాదియా ఎవరంటే.. 31 ఏళ్ల వయసున్న రణవీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేఆం కాదు. ఇతనొక ప్రముఖ యూట్యూబర్. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి ఒక కోటి ఐదు లక్షల మంది దాకా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అతను సహ వ్యవస్థాపకుడిగా నడిపిస్తున్నాడు. అంతేకాలు.. పలువురు పొలిటికల్ లీడర్ల మీద అతను పేల్చిన జోకులు విమర్శలు సైతం దారి తీశాయి.ఏమిటీ షో ఉద్దేశం ఇండియాస్ గాట్ లాటెంట్ అనేది ఒక కామెడీ షో. తమలోని హాస్యకోణాన్ని కొత్తగా ప్రదర్శించుకోవాలనుకునేవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఏర్పాటు చేసిన వేదిక ఇది. కేవలం హాస్యం మాత్రమే కాదు.. పాటలు పాడడం, డ్యాన్సులు.. ఇలా ఎన్నో టాలెంట్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. అయితే ఇది రెగ్యులర్ తరహాలో ఉండదు. అందుకే అంతటి ఆదరణను చురగొంది. అదే సమయంలో అక్కడి కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు, జడ్జిల కామెంట్లు అభ్యంతరకంగా ఉండడంతో పలు వివాదాల్లోనూ ఈ షో చిచ్కుకుంది. -
కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ వార్తా సంస్థ టీవీ, యాప్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్ర ప్రభుత్వం కేంద్రం కొరడా ఝుళిపించింది. సదరు వార్తా సంస్థకు చెందిన వెబ్సైట్, యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిఘా వర్గాల సమాచారం మేరకు Sikhs For Justice (SFJ)తో ఆ వార్తా సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈ ఛానెల్ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి వార్తా సంస్థపై నిషేధం విధించినట్టు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. Ministry of Information & Broadcasting has ordered blocking of apps, website, and social media accounts of foreign-based “Punjab Politics TV” having close links with Sikhs For Justice — ANI (@ANI) February 22, 2022 -
Twitter: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాక్
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతా బుధవారం హ్యాక్ అయ్యింది. పైగా హ్యకర్లు ఖాతా పేరును ఎలెన్ మస్క్ అని పేరు మార్చారు. అంతేకాదు ప్రోఫైల్‌లో చేప ఫోటో పెట్టారు. అదే సమయంలో కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అయితే కొద్ది సమయంలోనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆ ఖాతాను రికవరి చేసిందని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఆ ట్విట్టర్ ఖాతా యథావిధిగా పనిచేస్తోంది. ఆ ట్వీట్లు కూడా తొలగించారు. అయితే హ్యాకర్లు గతంలో ప్రధాని మోదీ ఖాతాను హ్యాక్ చేసిన వారే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఖాతాను కూడా హ్యాక్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే అప్పుడూ మోదీ ఖాతా హ్యాక్ అయినప్పుడు ఏం కంటెంట్ ఉందో అదే కంటెంట్ ఈ ఖాతాలో కూడా ఉంది. ఇటీవల చాలామంది ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. (చదవండి: ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేం.. బూస్టర్‌తో ప్రయోజనం ఉండకపోవచ్చు! అయినా ఆందోళనవద్దు!: డాక్టర్ జైప్రకాష్) -
జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల(34 ఖాళీలు) భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ లేదా జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్లో డిప్లోమా లేదా పీజీ డిప్లోమా ఉన్న వారిని అర్హులుగా ప్రకటించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేసుకోవడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ లో చూడవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు, వయసు తదితర అంశాలను తెలుసుకోవాలి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు- 34 తెలుగు- 5 హిందీ- 9 ఇంగ్లీష్- 3 పంజాబీ- 3 ఒడియా- 3 బెంగాలీ- 1 మరాఠీ- 5 గుజరాతీ- 1 అస్సామీ- 2 మణిపూరి- 2 పోస్టులు: సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంఖ్య: 34 దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2021 విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనుభవం: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్పేపర్లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు: 30 ఏళ్ల లోపు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. వేతనం: ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. -
టీవీ ఛానెల్స్‌కు మంచి రోజులు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయివేటు టీవీ ఛానళ్లకు తీపి కబురు చెప్పింది. మొన్న వార్తాపత్రికలకు ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ టీవీ ఛానళ్లకు ఇచ్చే ప్రకటన రేట్లను పెంచింది. ప్రయివేటు టీవీ చానెళ్లకు అందించే ప్రకటనల రేట్ల సవరణకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంగీకరించిందని బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్(బీవోసీ) ప్రకటించింది. 11శాతం పెంచుతూ శుక్రవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. దేశీయంగా వారి ప్రదర్శన, రేటింగ్స్ ఆధారంగా న్యూస్, నాన్-న్యూస్ ఛానళ్లకు వైవిధ్యమైన రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ జనవరి 1, 2019న అందించిన నివేదిక ఆధారంగా ఈ రేట్లను సవరించినట్టు పేర్కొంది. కాగా ఇటీవల వార్తాపత్రికల కిచ్చే ప్రకటన రేట్లను 25శాతం పెంచుతూ బీవోసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సెన్సార్ బోర్డు సంస్కరణకు శ్యామ్ బెనగళ్ కమిటీ
- సీబీఎఫ్సీ నిబంధనల మార్పు, మెరుగైన సూచనల కోసం కమిటీ ఏర్పాటుచేసిన కేంద్రం న్యూఢిల్లీ: కనీసం సినిమా రూపకర్తల వివరణ కోరకుండా ఏకపక్షంగా కట్ చెప్పడాలు, సినిమాలకు సర్టిఫికేషన్ల జారీలో భారీ అవకతవకలు, సభ్యుల మధ్య ఏకాభిప్రాయలేమి తదితర వివాదాలతో గందరగోళంగామారి ఇటు సినీరంగం అటు ప్రభుత్వానికి తలనొప్పిగామారిన నెన్సార్ బోర్డు ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేందుకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సమాయత్తమయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ) లేదా సెన్సార్ బోర్డు ప్రక్షాళనకు ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగళ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. సృజనాత్మక రంగంగా భావించే సినీరంగంలో సినీమా రూపకర్తలు, సెన్సార్ బోర్డుకు మధ్య సుహ్రుద్భావ వాతావరణం నెలకొల్పాటంటే ఏం చెయ్యాలి? ఫిలిం సర్టిఫికేషన్ జారీలో ఇప్పుడున్నవాటికంటే ఎలాంటి మెరుగైన విధానాలు రూపొందించాలి? తదితర కీలక అంశాలపై బెనగళ్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. ఇందుకోసం వివిధ దేశాల్లో అమలవుతున్న ఫిలం సర్టిఫికేషన్ల విధానాన్ని కూడా పరిశీలించనుంది. ఈ కమిటీలో సభ్యులుగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, పియూష్ పాండే, భావన సోమయ్య, నైనా లాథ్ గుప్తాలు నియమితులయ్యారు. జనవరి 2 నుంచి రెండు నెలల లోగా కమిటీ తన పనిని పూర్తిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై శ్యామ్ బెనగళ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం మేరకు కేంద్రం.. నెన్సార్ బోర్డు నిబంధనలను పునారచన చేయాలనుకుంటున్నదని, తమకు అప్పగించిన బాధ్యతను సకాలంలో నిర్వర్తిస్తామని చెప్పారు. బోర్డులో వివాదాలు ముదరటంతో 2014లో నాటి సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శ్యాంసన్ సహా 13 మంది సభ్యుల రాజీనామాలు చేశారు. గత ఏడాది ప్రారంభంలో పహలాజ్ నిహలానీ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి బోర్డు తీరు మరింత వివాదాస్పదంగా మారింది. పలువురు సినీ రూపకర్తలు బాహాటంగా సెన్సార్ బోర్డుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సీబీఎఫ్ సీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది.