
భూములను చదును చేస్తున్న జేసీబీలు
కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం, హెచ్‌సీయూ మధ్య ప్రకటనల యుద్ధం
ఆ 400 ఎకరాలు మావే అంటున్న సర్కారు
2004లో 534.28 ఎకరాలు ప్రభుత్వానికి హెచ్‌సీయూ స్వాదీనం చేసినట్లుగా ఉన్న డాక్యుమెంట్ రిలీజ్
ప్రత్యామ్నాయంగా తర్వాత 397.16 ఎకరాలు వర్సిటీకి స్వాదీనం చేసినట్లుగా ఉన్న మరో డాక్యుమెంట్ బహిర్గతం
హెచ్‌సీయూ సమ్మతితోనే ఆ 400 ఎకరాలకు హద్దులు నిర్ధారించామంటున్న ప్రభుత్వ వర్గాలు
సర్కారు, టీజీఐఐసీ వాదనల్లో నిజం లేదన్న వర్సిటీ రిజిస్ట్రార్.. రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని వెల్లడి
సదరు భూములు తమవేనంటూ ప్రకటన విడుదల
భూముల చదును కొనసాగుతుండటంతో విద్యార్థుల ఆందోళన ముమ్మరం.. విద్యార్థుల నిరసనలు, విపక్షాల మద్దతుతో రాజుకుంటున్న వేడి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వేర్వేరు వాదనలు వినిపిస్తూ ‘ప్రకటనల యుద్ధానికి’తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్‌గా మారింది.
పూర్వాపరాలు..
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అ ప్పగించింది. అయితే ఆ కంపెనీకి సామర్థ్యం లేద ని, కంపెనీ బోగస్ అని ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. ఈ రద్దుపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. 21 ఏళ్ల పాటు జరిగిన న్యాయపోరాటం త ర్వాత ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం టీజీఐఐసీకు కేటాయించింది. ఆ భూ ములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల ని టీజీఐఐసీ నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ భూములు హెచ్‌సీయూవి అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో వివాదం మొదలైంది.
విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు: సర్కారు
కొందరు స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంటోంది. దీని వెనుక కొన్ని స్థిరాస్తి గుంటనక్కలు ఉన్నా యని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సదరు భూముల తమవేనంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఈ భూములు సర్కారువే నంటూ ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి రెండు డాక్యుమెంట్లు సోమవారం విడుదల చేసింది.
2004 జనవరి 31న కంచె గచ్చిబౌలి సర్వే నంబర్ 25 లోని 534.28 ఎకరాల హెచ్‌సీయూ భూమిని ప్రభుత్వానికి స్వా«దీనం చేసినట్టుగా ఉన్న, అప్పటి రిజిస్ట్రార్ వై.నర్సింహులు, మరో ముగ్గురు సాక్షులు సంతకాలతో కూడిన ఒక డాక్యుమెంట్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 2004 ఫిబ్రవరి 3వ తేదీన అప్పటి యూనివర్సిటీ రిజిస్ట్రార్ నర్సింహులుకు గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 36లో ఉన్న 191.36 ఎకరాలు, సర్వే నంబర్ 37లో ఉన్న 205.20 ఎకరాలు మొత్తం 397.16 ఎకరాల భూమిని ముగ్గురు సాక్షుల సమక్షంలో స్వా«దీనం చేసినట్లుగా ఉన్న మరో డాక్యుమెంటు కూడా బహిర్గతం చేసింది.
హెచ్‌సీయూకు సంబంధం లేదు..
కంచె గచ్చిబౌలిలోని ప్రస్తుత వివాదాస్పద భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని సర్కారు వాదిస్తోంది. 21 ఏళ్ల క్రితం ఐఎంజీ భారత్‌కు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం టీజీఐఐసీ ద్వారా వేలానికి ప్రతిపాదించిన భూమిలో చెరువు లేదని, శిలా సంపదకు జీవ వైవిధ్యానికి ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంటూ సీఎంవో సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘చట్టపరంగా దక్కిన ఈ భూమిపై వివాదాలు సృష్టించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది.
కంచె గచ్చిబౌలి సర్వే నంబరు 25లోని 400 ఎకరాల భూమిని 2004లో ఐఎంజీ అకాడమీకి కేటాయించారు. పనులు ప్రారంభం కాకపోవడంతో రద్దు చేసి 2006 నవంబర్ 21న ఏపీ యువజన, టూరిజం, సాంస్కృతిక శాఖకు కేటాయించారు. దీనిపై ఐఎంజీ కోర్టుకు వెళ్లడంతో 2024లో మార్చిలో హైకోర్టు, అదే ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి’అని పేర్కొంటోంది..
ఐటీ, ఇతర ప్రాజెక్టుల కోసం టీజీఐఐసీకి..
ఈ భూముల్లో ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గత ఏడాది జూన్‌లో టీజీఐఐసీకు బదలాయించారు. ఆక్రమణలకు గురికాకుండా శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి 2024, జులై 1వ తేదీన టీజీఐఐసీకి అప్పగించా రు. ఈ భూమికి సంబందించిన ఉమ్మడి హద్దుల గుర్తింపునకు సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్‌ను కలవడంతో పాటు మెయిల్ కూడా పంపారని, రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జూలై 19న సర్వే చేసి హద్దులు నిర్ధారించారని ప్రభుత్వం వాదిస్తోంది.
వన్య ప్రాణులు లేవు.. చెరువులు లేవు!
‘టీజీఐఐసీ అభివద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో అడవి దున్నలు, నెమళ్లు, చెరువులు లేవు. ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది. టీజీఐఐసీ అభివృద్ధి చేసే లే ఔట్‌లో శిలా సంపద, హరిత స్థలాల పరిరక్షణ కోసం ప్రణాళిక సిద్ధమైంది. మాస్టర్‌ప్లాన్‌లో సుస్థిరాభివద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక (ఈఎంపీ) తయారు చేస్తోంది. ఈ దిశగానే 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సాధ్యమైనంత ఎక్కువ ఉపయోగించుకునేలా టీజీఐఐసీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది..’అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
వర్సిటీ అంగీకరించిందనడం అవాస్తవం: రిజిస్ట్రార్
‘రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ చెప్తున్నట్లుగా 2024 జూలైలో సదరు భూముల్లో రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదు. ఇప్పటివరకు సదరు భూమి రూపు రేఖలను మాత్రమే ప్రాథమికంగా తనిఖీ చేశారు. భూమి హద్దులు నిర్ణయించేందుకు యూనివర్సిటీ అంగీకరించిందని టీజీఐఐసీ చేస్తున్న వాదనలో నిజం లేదు. భూమి హద్దులు నిర్ధారించేందుకు యూనివర్సిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
దేశంలోనే పేరొందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని అందిన వినతులను పరిశీలించాలి. రాష్ట్రపతితో నియమితులైన ఆరుగురు సభ్యులతో కూడిన యూనివర్సిటీ సభ్యుల అనుమతితోనే ఏదైనా భూ బదలాయింపు జరుగుతుంది..’అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సోమవారం నాటి ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇలా రెండు పక్షాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండగా..విద్యార్థులు తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఆందోళనకు సంఘీభావం తెలపాలని కోరారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వం భూముల అమ్మకాలకు పూనుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరతీసింది.