
గురువారం కంచ గచ్చిబౌలి భూములను పరిశీలిస్తున్న కేంద్ర సాధికార కమిటీ
కంచ గచ్చిబౌలి భూముల్లో సాధికార కమిటీ పర్యటన
రాష్ట్ర అధికారులతో కలిసి చెట్ల కూల్చివేత, చదును చేసిన భూమి పరిశీలన
పీకాక్, బఫెల్లో లేక్ వరకు వెళ్లి చూసిన కేంద్ర బృందం
వివిధ శాఖల అధికారులతో వాస్తవ పరిస్థితిపై ఆరా
చెట్లు నరకడానికి అనుమతులు తీసుకున్నారా..? అని ప్రశ్న
ఎంసీహెచ్‌ఆర్‌డీలో విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పర్యావరణవేత్తలతో భేటీ
హోటల్లో ప్రభుత్వాధికారులతో సమావేశం..
బీఆర్‌ఎస్, బీజేపీ నేతల నుంచి వినతిపత్రాల స్వీకరణ
మరోసారి భూములు పరిశీలిస్తామన్న కేంద్ర కమిటీ
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ గురువారం కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద 400 ఎకరాల భూమిని సందర్శించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో టీఎన్‌జీవోల కాలనీకి వెళ్లే రోడ్డు మీదుగా లోపలికి వెళ్లిన కమిటీ..చదును చేసిన భూమి విస్తీర్ణం, చెట్ల కూల్చివేత, వన్యప్రాణులు, జీవ వైవిధ్యానికి జరిగిన నష్టానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులపై ఆయా విభాగాల అధికారులతో ఆరా తీసింది. రెండు గంటల పాటు అక్కడ పర్యటించింది. హెచ్‌సీయూలోని పీకాక్, బఫెల్లో లేక్ వరకు కమిటీ వెళ్లినట్లు సమాచారం.
కాగా ఆ తర్వాత నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పర్యావరణవేత్తలు, పౌరసమాజం నుంచి వినతిపత్రాలు స్వీకరించింది. అనంతరం తాజ్‌కృష్ణ హోటల్‌లో..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యింది. బీఆర్‌ఎస్ నేతలు, బీజేపీ ఎంపీల నుంచి వినతిపత్రాలను స్వీకరించింది. ఈ నెల 16న సుప్రీంకోర్టులో ఈ భూములకు సంబంధించిన కేసు విచారణకు రానున్న నేపథ్యంలో..వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీ రాష్ట్రానికి వచ్చింది.
ఫొటోలు, వీడియోలు తీసిన కమిటీ !
కమిటీ చైర్మన్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారి సిద్ధార్థ దాస్, సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్, సునీల్ లేహమనయ్య, చంద్రదత్‌లు భూములు సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్, సభ్యులు.. చెట్ల నరికివేతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకున్నట్టు తెలిసింది. ఉదయం 11.30 గంటల వరకు కమిటీ అక్కడ ఉంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఐఏఎస్ అధికారి శశాంక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు రాకేష్ కుమార్ డోబ్రియాల్, ఏలూసింగ్ మేరు, ప్రియాంక వర్గీస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్థన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హెచ్‌ఎండబ్ల్యూఎస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు వారి వెంట ఉన్నారు. అక్కడ వారిని హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పౌర సమాజానికి చెందిన వారు కలుసుకునేందుకు పోలీసులు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎంసీహెచ్‌ఆర్‌డీలో విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలతో కమిటీ సమావేశమయ్యింది.
వాదనలు వినిపించిన విద్యార్థులు, ప్రభుత్వం
హెచ్‌సీయూ భూముల్లో చెట్లను నరికేశారని, వన్యప్రాణులకు నష్టం జరుగుతోందని వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, అధ్యాపకులు కమిటీ దృష్టికి తెచ్చారు. కాగా వివాదం నెలకొన్న భూమి హెచ్‌సీయూది కాదని, ప్రభుత్వ భూమి అని, అటవీ ప్రాంతం కాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కమిటీకి పలు డాక్యుమెంట్లను సమర్పించినట్టు తెలిసింది. పీకాక్, బఫెల్లో లేక్‌లు 400 ఎకరాల్లో లేవని చెప్పినట్లు తెలిసింది. గతంలో యూనివర్సిటీ నుంచి భూములు తీసుకుని ఐఎంజీ భారత్‌కు కేటాయించడం, ఆ తరువాత సుదీర్ఘ న్యాయ పోరాటం, న్యాయస్థానాలు ఆ భూమి ప్రభుత్వానిదేనని తీర్పులిచ్చిన విషయాన్ని సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు కమిటీకి వివరించారు.
కాగా చెట్లు నరకడానికి అనుమతులు తీసుకున్నారా? అని కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది. అడవికి సంబంధించిన వివరాలు కచ్చితంగా చూపించకపోవడంపై అటవీ అధికారులను కమిటీ తప్పుపట్టినట్టు సమాచారం. ఇక బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కూడా కమిటీ ముందు వేర్వేరుగా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వాదనలు విని్పంచారు. హెచ్‌సీయూ లోని 400 ఎకరాల భూమిని పరిరక్షించాలని, అక్క డున్న చెట్లు, జీవవైవిధ్యాన్ని కాపాడే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తాము మరోసారి ఈ భూముల పరిశీలనకు వస్తామని, ఇదే చివరిసారి కాదని కమిటీ చెప్పినట్టు విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు.
కమిటీకి ఆ భూముల్లో ఉన్న పక్షులు, జంతువులు చెట్ల వివరాలు ఇచ్చామని హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎ.ఉమేష్ అంబేడ్కర్ తెలిపారు. తాము చెప్పినవి అక్కడ ఉన్నట్టుగా కమిటీ సభ్యులు అంగీకరించారని చెప్పారు. ఈ భూముల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీ కి అందజేశామని ఏబీవీపీ నేత బాలకృష్ణ తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ జయేుశ్ రంజన్, డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజనతో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు కమిటీతో
సమావేశమయ్యారు.