
ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వుల ప్రతిని సీఎం రేవంత్‌రెడ్డికి అందిస్తున్న జస్టిస్ షమీమ్ అక్తర్. చిత్రంలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు
ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం
శాఖల వారీగా ఖాళీల ఖరారుకు త్వరలో సమావేశం నిర్వహిస్తాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల నియామకాల జాతర మొదలు పెడతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి రాష్ట్రం చరిత్ర సృష్టించిందన్నారు. వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని, వర్గీకరణకు లోబడి త్వరలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు.
సోమవారం సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను.. ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం కోచైర్మన్, మంత్రి దామోదర రాజ నర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, దీనిపై ఏర్పాటైన వన్‌మ్యాన్ జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఇతరఅధికారులతో కలిసి ఉత్తమ్ విడుదల చేశారు. ఉత్తర్వుల తొలి ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ చారిత్రక అంశంమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక, దేశంలోనే వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. వర్గీకరణకు సంబంధించిన గెజిట్ విడుదలతో పాటు నాలుగు జీఓలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో వర్గీకరణ అమల్లోకి రావడంతో అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు.
ఈ సమీక్షలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు ఖరారు చేస్తామని, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామని అన్నారు. మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ.. వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులాల్లోని అన్ని వర్గాల నుంచి దాదాపు 8 వేలకు పైబడి వినతులు స్వీకరించినట్లు చెప్పారు.
వాటిని కూలంకషంగా పరిశీలన చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన వన్‌మెన్ కమిషన్.. అభిప్రాయాలు స్వీకరించి వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించిందని చెప్పారు. మూడు దశాబ్దాలుగా ఉన్న ఎస్సీ ప్రజల కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించి అమల్లోకి తీసుకువచి్చందని అన్నారు.