
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్. చిత్రంలో మంత్రులు సీతక్క, పొన్నం, రాజనర్సింహ, జస్టిస్ షమీమ్ అక్తర్
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
2026లో జనగణన గణాంకాలు అందుబాటులోకొచ్చాక రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల చేయనుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచి్చన హామీకి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలకు తాజాగా ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్‌రెడ్డికి అందించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ షమీమ్ అక్తర్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, న్యాయ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుతో వర్గీకరణ ప్రక్రియ వేగంగా పూర్తయిందన్నారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఉపసంఘం తిరస్కరించిందన్నారు. ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఏ ఉప సమూహాన్ని మినహాయించకుండా సమాన ప్రయోజనాలను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న ఏ ప్రయోజనాలను నీరుగార్చబోమని.. ఎస్సీ వర్గాల హక్కులను కాపాడుతూ న్యాయాన్ని పెంపొందించడానికే వర్గీకరణ రూపొందించామని వివరించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని.. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 17.5 శాతానికి పెరిగిందన్నారు. 2026లో జనగణన గణాంకాలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతామన్నారు.