
వర్గీకరణ నివేదికతో మంత్రులు దామోదర, ఉత్తమ్, పొన్నం. చిత్రంలో శ్రీధర్, జస్టిస్ షమీమ్ అక్తర్
క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఆ ప్రక్రియ పూర్తి చేసింది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపసంఘం కో చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యింది.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసేందుకు అవసరమైన సిఫారసులతో కూడిన నివేదికను జస్టిస్ షమీమ్ అక్తర్ కేబినెట్ సబ్ కమిటీకి సమరి్పంచారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసులు చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
2011 జనగణన ఆధారంగా..
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. 2011 జనగణన ఆధారంగా పరిశీలన చేపట్టాని, అరవై రోజుల్లోగా అధ్యయనం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బూర్గుల రామకృష్ణారావు భవన్ మొదటి అంతస్తు బి బ్లాక్‌లో కార్యాలయాన్ని కేటాయించింది. కమిషన్‌కు సహకరించేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు ఉమాదేవి, శ్రీధర్‌లను ప్రభుత్వ నియమించింది. నవంబర్ 11న కమిషన్ బాధ్యతలు స్వీకరించింది. అనంతరం క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలుపెట్టింది.
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ కార్యక్రమాలు చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలన, కులసంఘాలు, ప్రజా సంఘాలతో సమావేశాలు, వినతులు, విజ్ఞాపనల స్వీకరణ తదితరాలు కొనసాగించింది. దీంతో పాటు ఆన్‌లైన్ పద్ధతిలో వినతులు, సలహాలు, సూచనలు, అభ్యంతరాలను కూడా స్వీకరించింది. అన్ని కోణాల్లో పరిశీలన, సమాచార సేకరణతో పాటు ఆన్‌లైన్‌లో వచి్చన వినతులు, ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి నివేదిక తయారు చేసింది.