
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఏర్పాటు
వర్గీకరణ అధ్యయనంపై కాలపరిమితి తప్పనిసరి
2011 జనగణన గణాంకాల ఆధారంగా వర్గీకరణకు చర్యలు
వర్గీకరణ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో జిల్లాలవారీగా పర్యటనలు
మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ ప్రక్రియను అధ్యయనం చేసేందుకు వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) నిర్ణయించింది. చట్ట సంబంధ చిక్కుల్లేకుండా అత్యంత పారదర్శ కంగా కమిషన్ అధ్యయనం చేయాలని కమిటీ తీర్మానించింది.
కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఏర్పాటుకు ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ముసా యిదా సైతం అందింది. ఈ నేపథ్యంలో పలు సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కావడం తెలిసిందే. ఈ కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, పార్లమెంటు సభ్యులు మల్లు రవితోపాటు సీఎస్ శాంతికుమారి, ఏజీ సుదర్శన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
ఆర్థిక శాఖ నుంచి 30%సమాచారం: ఉత్తమ్
రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియను 2011 జనగణన ఆధారంగా చేపట్టాలని కమిటీ దాదాపు నిర్ణయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రంలోని ఉద్యోగ నియామక బోర్డుల నుంచి ఎస్సీ ఉపకులాలవారీగా నియామకాల సమాచారాన్ని స్వీకరించామని, ఆర్థిక శాఖ నుంచి 30 శాతం సమాచారం వచ్చిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. గత నెల 30 నుంచి విజ్ఞాపనల స్వీకరణ ప్రారంభించగా ఇప్పటివరకు 1,082 సూచనలు వచ్చినట్లు చెప్పారు.
ఆ రెండు రాష్ట్రాల్లో వన్‌మెన్ కమిషన్..
ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న పంజాబ్, తమిళనాడులలో అధికారుల బృందం అధ్యయనం చేసిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో హరియాణాలో అధ్యయనం చేయలేదన్నారు. పంజాబ్‌లో ఎస్సీ కేటగిరీలో రెండు గ్రూపులుగా వర్గీకరణ చేశారని, తమిళనాడులో విద్య, ఉపాధిలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఆ రాష్ట్రంలో 76 ఎస్సీ ఉపకులాలు ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు.
ఆ రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రక్రియ చట్టపరమైన చిక్కుల్లేకుండా అమలు చేసేందుకు వన్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వర్గీకరణ అధ్యయనాన్ని సకాలంలో పూర్తి చేయడానికి కమిషన్‌కు కాలపరిమితి విధించాలని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా పర్యటించి ఎస్సీ వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
దీంతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ వర్గీకరణపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఉపసంఘం సభ్యులు త్వరలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. వర్గీకరణ ప్రక్రియలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) వంటి ప్రసిద్ధ ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు.