
ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం
జనాభా లెక్కల తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
వర్గీకరణ హామీ నిలబెట్టుకున్నాం.. ఎస్సీ ఉప కులాలను 3 కేటగిరీలుగా చేశాం
వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి
దశాబ్దాల పోరు తర్వాత ఎస్సీ వర్గీకరణకు కార్యరూపం: మంత్రి ఉత్తమ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ ఎస్సీ వర్గీకరణ చేయాలి: కడియం
ఎస్సీ రిజర్వేషన్లు గ్రూప్ 1, 2, 3కి బదులు ఏ, బీ, సీగా సవరించాలి: పాయల్ శంకర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉప వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అంతకు ముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనగణన తర్వాత ఎస్సీల సంఖ్య ఆధారంగా వారి రిజర్వేషన్లను మరింత పెంచుతామని ప్రకటించారు.
వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపజేయడంలో చూపిన చిత్తశుద్ధిని గుర్తు చేశారు. కాంగ్రెస్ దళితుల పక్షపాతి అని, రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. అనేక మంది దళితులకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు ఇచ్చి పైకి తెచ్చిందని.. దళిత బిడ్డ మల్లిఖార్జున ఖర్గేకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందని పేర్కొన్నారు.
అందరి అభీష్టం మేరకే..
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన మరుక్షణమే తమ ప్రభుత్వం స్పందించిందని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేశాం. వారి సూచన మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ సారథ్యంలో ఏకసభ్య కమిషన్ వేశాం. వర్గీకరణపై కమిషన్ విస్తృతంగా సమాచారం సేకరించింది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. 8,681 విజ్ఞప్తులను కూలంకషంగా పరిశీలించింది.
59 ఎస్సీ ఉప కులాలకు సంబంధించిన స్థితిగతులతో నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులను మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది. 59 ఉపకులాలను మూడు కేటగిరీలు చేశాం. అత్యంత వెనుకబడిన 15 ఉప కులాలకు ఒక్క శాతం, మధ్యస్తంగా వెనుకబడిన 18 ఉప కులాలకు 9శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలకు 5 శాతం మేర విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించాం..’’ అని రేవంత్ తెలిపారు.
ఆ దళిత కుటుంబాలకు సాయం
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని సీఎం తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.4 లక్షల సాయం అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు జనాభా లెక్కలే కీలమని చెప్పారు. 2026లో దేశవ్యాప్తంగా జనగణన చేపట్టే వీలుందని, అది పూర్తయిన తర్వాత రిజర్వేషన్లు మరింత పెంచుతామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్నిపక్షాలకు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది చరిత్రాత్మక దినం: ఉత్తమ్
ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించుకున్న ఈ రోజు ఇది చరిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి శాసనసభ సమావేశంలో, పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ జరగాలని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు గొంతెత్తేవని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఉమ్మడి ఏపీలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చినా చట్టబద్దత రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం రేవంత్ నాయకత్వంలో చిత్తశుద్ధితో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేశామన్నారు.
వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్‌గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 15శాతంగా ఉన్న రిజర్వేషన్లు త్వరలో పెరుగుతాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా దాదాపు 18శాతంగా ఉన్నట్టు వెల్లడైందని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉండాలని కమిషన్ సిఫార్సు చేసిందని.. కానీ వర్గీకరణ ఫలాలు ఎస్సీల్లోని అన్ని కులాలకు దక్కాలన్న ఉద్దేశంతో దానిని మంత్రివర్గం ఆమోదించలేదని ఉత్తమ్ చెప్పారు.
ఎస్సీలను కూరలో కరివేపాకులా వాడుకున్నారు
గత ప్రభుత్వం ఎస్సీలను కూరలో కరివేపాకు మాదిరిగా చూసిందని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. వర్గీకరణపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే మాజీ సీఎం, మాజీ మంత్రులంతా గైర్హాజరు కావడం బాధాకరమన్నారు.
మాలలపై కొంతకాలంగా దుష్ప్రచారం జరుగుతోందని, జనాభా ప్రాతిపదికనే మాలలకు ఫలాలు దక్కాయని ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెప్పారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో ఎక్కువగా మాదిగలకు దక్కాయని, ఆ తర్వాతే మాలలు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న ఎస్సీ జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణను కేంద్రంలో కూడా అమలు చేయాలని, కేంద్ర ఉద్యోగాల్లోనూ వర్గీకరణ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు పార్లమెంటులోనూ చట్టం చేయాలన్నారు.
ఎస్సీ వర్గీకరణను గ్రూప్–1, 2, 3లుగా విభజించారని.. అలాగాకుండా గ్రూప్–ఏ, బీ, సీ కేటగిరీలుగా చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు. చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment