
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయని తెలిపారు. ఇదే సమయంలో గత ఏడాది ఫస్ట్ ఆగస్టు కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు అని కార్లిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (SC classification) అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎస్సీ రిజర్వేషన్లపై ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అమలు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి ఎస్సీ రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పై అందరికీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం.
ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వవద్దు అని అనాడు చెప్పాము. రేపు సబ్ కమిటీ ఉన్నతాధికారులతో నోటిఫికేషన్ ప్రక్రియపై భేటీ అవుతాయి. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయి. 59 ఉప కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ పని చేసింది. 50వేల వినతులను అక్తర్ కమిషన్ పరిశీలన చేసి ఎస్సీ రిజర్వేషన్లు మూడు కేటగిరీలుగా విభజన చేశారు.
గ్రూప్ఏ-1, గ్రూప్‌బీ-9, గ్రూప్‌సీ-5 శాతంతో అసెంబ్లీలో చట్టం చేశాం. గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇందుకు సంబంధించి జీవీ-33 విడుదల చేశాము. యాక్ట్ 15తో మూడు భాషల్లో విడుదల చేశాం. జీవీ-9ను విడుదల చేశాం. రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఎంత పెరిగితే ఆ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వ్యాఖ్యలు చేశారు.