
భారత్ రావడానికి సిద్ధమే
ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు ప్రభాకర్‌రావు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, భారత్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నానని నిందితుడు ప్రభాకర్‌రావు (ఏ–1) హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన పిటిషన్‌లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ముందు మంగళ వారం వాదోపవాదాలు జరిగాయి. తనను అన్యా యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రభాకర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
65 ఏళ్ల సీనియర్ సిటి జన్‌నని, తన వైద్య, ఆరోగ్య పరిస్థితులు, వైద్యం చేయించుకునే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభాకర్‌రావు వారంలో భారత్ రావడానికి సిద్ధంగా ఉన్నారని, పోలీసులు వెంటనే అదుపు లోకి తీసుకునే అవకాశం ఉన్నందున అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సుప్రీంకోర్టు ఏ–6 శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చిందని, అదే ఉత్తర్వులను ప్రభాకర్‌రావుకూ వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రతిని అందజేశారు. నిరంజన్‌రెడ్డి వాదనలను.. ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా తోసిపుచ్చారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయిందని, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని గుర్తు చేశారు.
ఆయన తనంతట తానుగా వారంలో భారత్‌కు వస్తున్నారని చెప్పడం అసత్యమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ప్రభుత్వం తరపున లూద్రాతో పాటు పీపీ పల్లె నాగేశ్వర్‌రావు విచారణకు హాజరయ్యారు.