
గతంలోనే సస్పెండ్ చేసిన ఆర్‌పీఓ
ఇటీవల రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసిన ఇంటర్‌పోల్
దీని ఆధారంగా రద్దుకు సిఫార్సు చేసిన హైదరాబాద్ పోలీసులు
సానుకూలంగా నిర్ణయం తీసుకున్న పాస్‌పోర్టు అధికారులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయ్యింది. ఈయనపై ఇటీవల ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా పాస్‌పోర్టు రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి (ఆర్‌పీఓ) లేఖ రాశారు. దీంతో ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది మార్చిలో పరారీ...
టి.ప్రభాకర్‌రావు 2023 డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్‌ట్యాపింగ్ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన గత ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు.
తనపై అరెస్టు వారెంట్ జారీ చేయొద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో ప్రభాకర్‌రావు తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం 2024 జూన్ 26న తిరిగి వస్తానంటూ వివరణ ఇచ్చారు. ఆపై జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారి రాసిన లేఖలో తన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు.
అప్పుడు ఇంపౌండ్...ఇప్పుడు క్యాన్సిల్
రాష్ట్ర పోలీసులు తొలుత ఆర్‌పీఓ ద్వారా ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై పాస్‌పోర్టు పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ఈ ఫైల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉండగానే, ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు.
ఓ వ్యక్తిపై చార్జిషీట్ దాఖలు కావడం, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం, బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితేనే పాస్‌పోర్టు రద్దుకు ఆస్కారముంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ ఉండటంతోపాటు ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆర్‌పీఓకు మరో లేఖ రాయడం ద్వారా ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు చేయించారు.
రద్దు అయినా.. రప్పించడం ప్రహసనమే
ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయిన సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగితే.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఆపై ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు.
అలా కాకుంటే ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే...ఎల్‌ఓసీ మాదిరిగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. దీంతో పోలీసులు ప్రభాకర్‌రావును అమెరికా డిపోర్టేషన్‌కు (బలవంతంగా తిప్పిపంపడం) సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ద్వారా ఆ దేశ ఏజెన్సీలను సంప్రదించి రెడ్‌కార్నర్ నోటీసుతోపాటు ఇతర వివరాలు అందిస్తున్నారు.