పాలమూరు ప్రజాప్రతినిధులతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సచివాలయంలో పాలమూరు–రంగారెడ్డి, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపై మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్న ం శ్రీనివాస్‌రెడ్డి(మహబూబ్‌నగర్), వాకిటి శ్రీహరి ముదిరాజ్(మక్తల్), జి.మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర), డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట)లతో కలిసి, సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కొడంగల్, నారాయణ పేట, మక్తల్ నియోజవర్గాలకు నీరందించడానికి వీలుగా నారాయణపేట–కొడంగల్ ఎత్తి పోతల పథకం చేపట్టడానికి వీలుగా 2014 మే 28వ తేదీన ఉత్తర్వులుజారీ చేశారని, ఆ ప్రాజె క్టును చేపడితే కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు నీరందేదని, దీనికోసం రూ.133.86 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చినా, ఆ పథకాన్ని చేపట్టలేదని, నివేదించారు. తక్షణమే ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతినివ్వా లని వీరు నివేదించగా... మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రేవంత్‌రెడ్డి పట్టుదలతో 2014 మేనెలలోనే నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం పరిపాలన అనుమతినిస్తే... గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం పథకాన్ని చేపట్టి ఉంటే లక్ష ఎకరాలకు పైగా నీరందేదని గుర్తు చేశారు.కోయిల్‌గర్ ప్రాజెక్టు సామర్థ్యం మరో రెండు టీఎంసీలు పెంచాలని మంత్రి ఉత్తమ్‌ను కోరామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
2014లోపే ఉమ్మడి జిల్లాలో 70 శాతం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, 7 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టును పక్కనపెట్టి, రూ.50 వేల కోట్లతో రీ ఇంజనీరింగ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారని, రూ.30 వేల కోట్లు వెచ్చించినా ఒక్క ఎకరాకు ఈ పథకంతో నీరందలేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే జీఓ నంబరు 69ని గత ప్రభుత్వం పక్కనపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మండిపడ్డారు.
పాలమూరులో వలసలు తగ్గలేదు
మహబూబ్‌నగర్ అంతా పచ్చగా లేదని, ఇంకా నీటి గోసతో అల్లాడుతుందని మహబూబ్ నగర్‌లో ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంత్రిని కలిసిన అనంతరం సచివాలయ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వారు మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు చేసిందని శూన్యమని నిప్పులు చెరిగారు. వలసలు తగ్గలేదని..వలపోత ఆగలేదన్నారు. ముంబై బస్సు రావడం ఆగలేదు...పనుల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకా తప్పలేని పరిస్థితి అని ధ్వజమెత్తారు. ఏదో చేశామని చెబుతున్న బీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఒక్క పిల్ల కాల్వ నుంచి ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్లు, మాటల మీద పని తప్పా...ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment