రాజకీయ పరిణామాలు, పాలనా అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్ సుదీర్ఘ భేటీ
9 గంటలకు పైగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పలు కీలకాంశాలపై సమీక్ష
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీల వర్గీకరణపై చర్చ
ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల భేటీపై కూడా..
సోషల్‌మీడియాలో అనుసరించాల్సిన వైఖరి గురించి ప్రత్యేక చర్చ
అధికారులు, సిబ్బందిని దూరంగా ఉంచి మనసు విప్పి చర్చించుకున్న మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పలు పాలనా అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రులందరితో సమావేశమ య్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలు శనివారం ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7:45 నిమిషాల వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు 9గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అధికారులు, సిబ్బందిని దూరంగా ఉంచిన మంత్రులు అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడుకున్నట్టు సమాచారం.
ఈ నెల5న అసెంబ్లీ భేటీ...?
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన గురించి సీఎం, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.
⇒ బీసీ రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేలా ముందుకెళ్లాలని, ఇటీవల చేపట్టిన కులగణన రిపోర్టును కోర్టు ముందుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి అడ్డంకి లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 5వ తేదీన అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని తీర్మానం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
⇒ ఎస్సీల వర్గీకరణ అంశంపై కూడా మంత్రులతో సీఎం చర్చించారని, రాజకీయంగా విమర్శలు రాకుండా వీలున్నంత త్వరగా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణను అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిశాక ఈ విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా మరోమారు
⇒ త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా మంత్రులు చర్చించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి గెలుపొందే ప్రణాళికలు రూపొందించే బాధ్యతలు మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లకు అప్పగించారు.
⇒ తాజాగా వివాదాస్పదమైన పార్టీ ఎమ్మెల్యే డిన్నర్ అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలగకుండా మంత్రులు వ్యవహరించాల్సిన తీరు గురించి సీఎం దిశానిర్దేశం చేశారని, మంత్రులంతా సమష్టిగా పనిచేయాలని, ఒక్కటే మాట.. ఒక్కటే పంథా రీతిలో ఇక ముందు పనిచేయాలనే చర్చ కూడా వచ్చినట్టు సమాచారం.
అధిష్టానం జోక్యం?
ఇటీవల సోషల్‌మీడియా వేదికగా జరిగిన ఓ వ్యవహారంపై సీఎం, మంత్రులు ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఫలితం రావడం, ఈ హ్యాండిల్ స్క్రీన్‌షాట్‌కు బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించిన నేపథ్యంలో సోషల్ మీడియా విషయంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యవహారంపై మంత్రులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
అయితే, ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందని, మరోమారు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర పార్టీని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా, కాంగ్రెస్ వ్యతిరేక సోషల్‌మీడియాలు చేస్తున్న దు్రష్పచారాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాను తయారు చేయాలని, ప్రతి చిన్న అంశంపై చేస్తున్న రాద్ధాంతాన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.
మీడియాతో మంత్రులు ఏం చెప్పారంటే..
సమావేశానంతరం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మీడియాతో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని దామోదర రాజనర్సింహ చెప్పారు.
కేబినెట్ సబ్‌కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్‌ను నియమించామని, ఈ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇస్తుందని, ఆ రిపోర్ట్‌పై కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడుతామని వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణన కార్యరూపం దాల్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు చర్చించామన్నారు. ఈనెల 5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని, తర్వాత సభలో చర్చకు పెట్టడం ద్వారా ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment