ఏడాది పాలన, భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
సీఎం నివాసంలో 4 గంటలకుపైగా ముఖాముఖి భేటీ
ప్రజలేమనుకుంటున్నారు?, విజయోత్సవాలు తదితర
అంశాలపై చర్చ... ఏడాది పాలనపై ప్రజలు
సానుకూల భావనతోనే ఉన్నారనే అభిప్రాయం
విజయోత్సవాలు ఆశించిన ఫలితాన్నిచ్చాయనే భావన
ఆరు గ్యారంటీల అమలుపై మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయం... నిరుపేదల సంక్షేమమే ఎజెండాగా పథకాలకు రూపకల్పన చేసే యోచన
నేడు జైపూర్‌కు సీఎం.. అక్కడి నుంచి ఢిల్లీకి..
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో ఏం చేశాం..భవిష్యత్తులో ఏం చేద్దాం. ఆరు గ్యారంటీల అమల్లో ముందుకెళ్లేదెలా? ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? విజయోత్సవాలు ఆశించిన ఫలితాన్నిచ్చాయా? వచ్చే ఏడాది కాలంలో ఏయే అంశాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపించాలి? అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. గత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించడంతో పాటు ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు..భవిష్యత్తులో చేయాల్సిందేమిటి? తదితర అంశాలపై కూడా సమాలోచనలు జరిపినట్టు తెలిసింది.
ఆరు గ్యారంటీలకు తోడు మరోమూడు అంశాలు!
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సానుకూల భావనతోనే ఉన్నారనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్టు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు వరకు పలు అంశాల విషయంలో ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆరు గ్యారంటీల అమలు విషయంలో మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
ఆరు గ్యారంటీలకు తోడు మూడు అంశాల ప్రాతిపదికన వచ్చే ఏడాది రోడ్‌మ్యాప్ ఖరారు చేసుకున్నారని సమాచారం. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో భూమి లేని నిరుపేదల సంక్షేమమే ఎజెండాగా పథకాలకు రూపకల్పన చేయాలని, ఉద్యోగాల కల్పన విషయంలో తొలి ఏడాది తరహాలోనే ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పాలనలో ప్రభుత్వ శాఖల వారీగా జరిగిన పురోగతిని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని కూడా వారు నిర్ణయించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
బీఆర్‌ఎస్, బీజేపీలపై ఇక దూకుడుగానే..!
ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలు జరిగిన తీరుపై కూడా నేతలు సమీక్షించారు. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు ఘనంగా జరిగాయని, సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించగలిగామని రేవంత్, భట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శిస్తోన్న బీఆర్‌ఎస్, ఉనికి కోసం అప్పుడప్పుడూ బీజేపీ చేస్తున్న రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టడంలో కొంతమేర దూకుడుగా వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సందర్భంగా బీఆర్‌ఎస్ చేసిన గొడవ, సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయం, ప్రభుత్వ ఉద్దేశం ప్రజల్లోకి వెళ్లిన తీరుపై వారు సమీక్షించారు. రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, ఈనెల 11, 12 తేదీల్లో కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించనున్న శిక్షణా తరగతులపై కూడా చర్చించారు.
అసెంబ్లీ ఎజెండా ఏంటి?
ఈనెల 16వ తేదీన మళ్లీ ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, మూసీ ప్రక్షాళన, హైడ్రా కూలి్చవేతలు తదితర అంశాలపై ఇవ్వాల్సిన వివరణలు, ఆర్‌వోఆర్ కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గల అనుకూలత, రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక, కులగణన రిపోర్టు విషయంలో అసెంబ్లీలో వెల్లడించాల్సిన అంశాలపై కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవని, ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు ఈ సభా వేదికగానే తగిన జవాబు చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం.
మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేదా?
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం రాజస్తాన్‌లోని జైపూర్ వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోనే రెండురోజులు ఉంటారన్న వార్తల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా హస్తిన పెద్దలతో భేటీ అయితేనే విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
కానీ ఇప్పటివరకు రేవంత్ మినహా మిగతా నేతల ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉంటుందా లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. ఇలావుండగా రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్‌మెంట్ లభించే అవకాశాన్ని బట్టి డిప్యూటీ సీఎం భట్టి కూడా హస్తిన పయనమవుతారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment