రైతుల తరహాలో రేవంత్ మాదిగలనూ మోసం చేస్తున్నారు: బీఆర్‌ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉపసంఘం పేరిట కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రైతులను మోసగించిన తరహాలో మాదిగలను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో కలసి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సుంకె రవిశంకర్, పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
ఇతర రాష్ట్రాలకంటే ముందుగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారన్నారు. లోక్‌సభ ఎంపీ టికెట్లు, మంత్రివర్గంలో మాదిగలకు ప్రాతినిథ్యం లేకుండా పోయిందని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాలలకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు.
సుంకె రవిశంకర్ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే డీఎస్సీ తాజా నియామకాల్లో 1,200 ఉద్యోగాలు మాదిగ సామాజికవర్గానికి దక్కేవన్నారు. సీఎం రేవంత్‌కు హైడ్రాపై ఉన్న ప్రేమ మాదిగలపై లేదని, ఆయన మాదిగ ద్రోహిగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో మాదిగలకు మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ నియంతలా వ్యవహరిస్తూ మాదిగలను మోసం చేయాలని భావిస్తున్నారని గువ్వల బాలరాజు విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుంటే జాతీయస్థాయిలో మాదిగ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించకుంటే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను అడ్డుకోవాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment