
హిరోషిమా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆ నగరం మాదిరే పోరాటానికి చిహ్నం తెలంగాణ అని వెల్లడి
అక్కడి పీస్ మెమోరియల్ పార్క్ వద్ద నివాళి
ముగిసిన సీఎం బృందం జపాన్ పర్యటన.. నేడు హైదరాబాద్‌కు రాక
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలు సమష్టిగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని ప్రపంచానికి చూపించిన నగరం హిరోషిమా. హిరోషిమా మాదిరిగానే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ. దూరదృష్టితో విజయం సాధించిన రాష్ట్రం తెలంగాణ. హిరోషిమా నగరానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిరోషిమా అసెంబ్లీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో చివరి రోజైన మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో కూడిన తెలంగాణ రైజింగ్ బృందం బిజీబిజీగా గడిపింది.
రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945 ఆగస్టు 6న అమెరికా జరిపిన అణు బాంబు దాడిలో నామరూపాల్లేకుండా ధ్వంసమైన హిరోషిమా నగరంలో సీఎం రేవంత్ బృందం పర్యటించింది. వివిధ ప్రాంతాలను సందర్శించడంతోపాటు పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తొలుత హిరోషిమా ప్రిఫెక్చురల్ (రాష్ట్ర ప్రభుత్వం) అసెంబ్లీకి రేవంత్ బృందం విచ్చేయగా వారికి స్పీకర్ తకాషి నకమోటో, శాసనసభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘శాంతి, స్థిరత్వం, సమృద్ధి లాంటి విలువలను పంచుకుందాం.
పెట్టుబడులకు పరస్పర సహకారం, భాగస్వామ్యం గురించి మాట్లాడటానికి వచ్చాం. కలసికట్టుగా మెరుగైన, పచ్చని, సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం’అని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 50కిపైగా జపాన్ కంపెనీలు తెలంగాణలో పనిచేస్తున్నాయని.. మరిన్ని కంపెనీలను ఏర్పాటు చేయాలని అక్కడి పారిశ్రామికవేత్తలను కోరారు. తెలంగాణను సందర్శించి రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
అలాగే హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత హిరోషిమా చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నివాళులర్పించారు. ఆపై అక్కడి గాంధీ మెమోరియల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. జపాన్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ బుధవారం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
పెట్టుబడులు రూ. 12,062 కోట్లు.. 30,500 ఉద్యోగాలు
జపాన్ పర్యటనలో రూ. 12,062 కోట్ల పెట్టుబడులు, 30,500 ఉద్యోగాల సృష్టికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో అత్యధికంగా ఎన్‌టీటీ డేటా–నెయిసా నెట్‌వర్క్స్ హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని పేర్కొంది. అలాగే మారుబెని కంపెనీ రూ. వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడి ద్వారా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్సŠట్ జనరేషన్ ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుందని.. మొత్తంగా రూ. 5,000 కోట్ల పెట్టుబడుల అంచనాతో 30 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది.
తోషిబా అనుబంధ కంపెనీ టీటీడీఐ హైదరాబాద్ శివార్లలో మూడో విద్యుత్ పరికరాల ప్లాంట్ ఏర్పాటు కోసం రూ. 562 కోట్ల పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకుందని వివరించింది. టామ్‌కాతో కుదిరిన ఒప్పందం ద్వారా 500 ఉద్యోగాలకు ఒప్పందం కుదర్చుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది.