
బల్దియా పాలన గందరగోళం
కమిషనర్‌తో పాటు కొందరు ఏసీలు, జడ్‌సీలూ కొత్తవారే
పది నెలల వ్యవధిలో మారిన నలుగురు కమిషనర్లు
సమస్యల్ని సృష్టిస్తోన్న ఈ తరహా వ్యవహారం
రాజకీయ పరంగానూ విమర్శలకు తావు
సాక్షి, సిటీబ్యూరో: కోటి మందికిపైగా ప్రజలకు వివిధ సేవలు, నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సిన జీహెచ్‌ఎంసీకి పది నెలల్లో నలుగురు కమిషనర్లుగా రావడంతో పరిస్థితి అయోమయంగా మారింది. పాలన గందరగోళంగా తయారైంది. పది నెలల వ్యవధిలో రోనాల్డ్‌రాస్, ఆమ్రపాలి, ఇలంబర్తి తర్వాత ప్రస్తుతం కర్ణన్ కమిషనర్‌గా వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను తరచూ మారుస్తుండటం రాజకీయంగా విమర్శలతో పాటు పాలన పరంగా సమస్యలు సృష్టిస్తోంది.
ఒక కమిషనర్ తనదైన శైలిలో కార్యక్రమాలను పట్టాలెక్కించే లోపునే మారిపోతుండటంతో పరిస్థితి ఎప్పటికప్పుడు మొదటికి వస్తోంది. రోనాల్డ్‌రాస్ తర్వాత ఆమ్రపాలిని కమిషనర్‌గా నియమించినప్పుడు ఉన్నవారిలో సీనియర్ అయినందున నియమించినట్లు సీఎం అప్పట్లో విలేకరులతో ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం సీనియాటికీ సైతం తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోనాల్డ్‌రాస్, ఆమ్రపాలి మారడానికి కారణాలున్నాయి కానీ ఇలంబర్తిని మార్చడానికి కారణాలంటూ కనిపించడం లేదు. పైపెచ్చు ఇప్పుడిప్పుడే తగిన చర్యలతో జీహెచ్‌ఎంసీలో క్రమశిక్షణతోపాటు, అవినీతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్న తరుణంలో ఉన్నట్లుండి మార్చడంతో ఎందుకిలా చేస్తున్నారో తెలియడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన వస్తారో.. రారో..
» తనకంటే జూనియర్‌ను కమిషనర్‌గా నియమించడంతో ఆయన వద్ద అడిషనల్ కమిషనర్‌గా పని చేయలేననే తలంపుతో కిల్లు శివకుమార్ నాయుడు సెలవుపై వెళ్లినట్లు జీహెచ్‌ఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన జీహెచ్‌ఎంసీకి వస్తారో.. రారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ తిరిగి విధుల్లో చేరారు. ఆమెకు ఇంకా బాధ్యతలు కేటాయించలేదు. ఆమె సెలవులో వెళ్లడంతో ఆమె బాధ్యతల్ని ఇతరులకు అప్పగించారు. వారు తమదైన ప్రణాళిక, లక్ష్యాలతో పనులు చేస్తున్నారు. తిరిగి వారికా విధులు తప్పిస్తే మళ్లీ గందరగోళమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
» ఒకవేళ.. శివకుమార్ నాయుడు జీహెచ్‌ఎంసీకి ఇక రాని పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన పరిధిలో ఉన్న విద్యుత్, చెరువులు, ఎస్‌ఎన్‌డీపీ, భూసేకరణ విభాగాలను స్నేహశబరీష్కు అప్పగించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆమె వివిధ విభాగాలను సమర్థంగా నిర్వహించడంతో వీటిని ఆమెకు అప్పగిస్తారని భావిస్తున్నారు. లేని పక్షంలో మళ్లీ కొత్త గందరగోళాలు తలెత్తుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ నాయుడు వద్ద ఉన్న హౌసింగ్ విభాగాన్ని ఇప్పటికే నళినీ పద్మావతికి అప్పగించారు. బదిలీపై జీహెచ్‌ఎంసీకి తిరిగి వచి్చన భోర్ఖడే హేమంత్ సహదేవ్ రావు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అభివృద్ధి, సంస్కరణలు జరుగుతున్నా..
మరోవైపు.. జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ని సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. రెగ్యులర్ సీపీఆర్‌ఓ లేకపోవడంతో మొక్కుబడి ప్రకటనలు తప్ప జీహెచ్‌ఎంసీలో ఎన్నో సంస్కరణలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టినా తెలియడం లేదు. పైపెచ్చు తరచూ తప్పుడు సమాచారం అందుతోందనే ఆరోపణలున్నాయి. గతంలో సీపీఆర్‌ఓ కార్యాలయం సమర్థంగా పనిచేసేది. ప్రస్తుతం ఆ విభాగాన్ని గాలికి వదిలేశారని చెబుతున్నారు.
మిస్ వరల్డ్ పోటీలపై పై ప్రత్యేక శ్రద్ధ
‘మిస్ వరల్డ్ –2025’ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడంతో అందరి చూపూ నగరంపై పడింది. ఈ నేపథ్యంలో వివిధ మార్గాల్ని, ఆయా ప్రాంతాల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిడంపై ప్రస్తుతం దృష్టి సారించారు. పోటీల్లో పాల్గొనే వారు చార్మినార్, లాడ్‌బజార్, చౌమహల్లా ప్యాలెస్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, శిల్పారామం, ఫలక్‌నుమా ప్రాంతాలను సందర్శించనుండటంతో ఆయా ప్రాంతా ల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.