జీహెచ్‌ఎంసీ సహా 12 పురపాలికల్లో పూర్తికావొచ్చిన 66 ప్రాజెక్టులు
రూ. 1,663 కోట్లతో తాగునీరు, సీవరేజీ, పార్కుల అభివృద్ధి పనులు
ఇప్పటికే రూ. 832 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. రూ. 806 కోట్లను వెచ్చించిన రాష్ట్రం
అమృత్ 2.0లో హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ చేర్చాలన్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ (ది అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్) కింద రాష్ట్రంలోని 12 పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని ఎంపిక చేసిన పట్టణాల్లో తాగునీటి సరఫరాతోపాటు సీవరేజీ పైప్‌లైన్ల వ్యవస్థ, పట్టణ రవాణా, పచ్చదనం పెంపు, వరదనీటి కాలువల అభివృద్ధి ప్రధాన అంశాలుగా 2015 జూన్ 25న ‘అమృత్’ పథకం ప్రారంభమైంది.
తొలి దశలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 500 నగరాలను కేంద్రం ఎంపిక చేయగా అందులో రాష్ట్రం నుంచి హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ), వరంగల్ (జీడబ్ల్యూఎంసీ), కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాలతోపాటు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట పట్టణాలను ఎంపిక చేశారు.
ఈ 12 పురపాలికల్లో తాగునీరు, సీవరేజీ, పార్కుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభించింది. కేంద్రం, రాష్ట్రం 50:50 ప్రాతిపదికన చేపట్టే ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 1,663.08 కోట్లు కాగా.. అందులో కేంద్ర సాయం రూ. 832.6 కోట్లు.
66 ప్రాజెక్టులు... తాగునీటికి అధిక మొత్తం...
అమృత్ పథకం కింద 12 పురపాలికల్లో 66 ప్రా జెక్టులు ప్రారంభమయ్యాయి. రూ. 1,663.08 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పనులకు కేంద్రం తన వాటాగా రూ. 832.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో రూ. 831.52 కోట్లను కేంద్రం విడుదల చేయగా రాష్ట్రం తన వాటాతోపాటు కేంద్రం వాటా లో రూ.806.21 కోట్లు వినియోగించుకుంది. తాగు నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ పట్టణాల్లో 27 నీటి సరఫరాల ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఇందుకోసం 4,336.54 కిలోమీటర్ల పొడవైన నీటి సరఫరా పైప్‌లైన్‌లను నిర్మించారు. వాటి విలువ రూ. 1,424.09 కోట్లు. అందులో అత్యధికంగా వరంగల్‌కు రూ. 341.3 కోట్లు వెచ్చించడం విశేషం. ఈ పథకం కింద నిజామాబాద్, సిద్దిపేటల్లో రూ. 203.3 కోట్ల విలువగల నాలుగు మురుగునీటి శుద్ధి, సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు లను చేపట్టారు. ఈ రెండు పురపాలికల్లో 278.53 కి.మీ. పొడవైన మురికినీటి పారుదల పైప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. 5.54 లక్షల నల్లా నీటి కనెక్షన్లు, 0.87 లక్షల మురుగునీటి పారుదల కనెక్షన్లను అ మృత్, కన్వర్జెన్సెస్‌లో భాగంగా సమకూర్చారు.
రాష్ట్రంలోని 12 పురపాలికల్లో రూ. 35.69 కోట్లతో 35 హరిత స్థలాలు, పార్కులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్రంలో 18.25 ఎంఎల్‌డీ సామర్థ్యంగల సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్‌టీపీ)ను, 442.45 ఎకరాల విస్తీర్ణంలో హరిత క్షేత్రాలను ‘అమృత్’ కింద అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమృత్ 2.0 కింద కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి.
సీఎస్‌ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని కోరిన సీఎం రేవంత్
2021లో మొదలైన అమృత్–2.0 (పథకం రెండో దశ)లో భాగంగా హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ప్రతిపాదించిన సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ (సీఎస్‌ఎంపీ)ని చేర్చాలని కోరారు. అమృత్ తొలి విడత ప్రాజెక్టులో జీహెచ్‌ఎంసీలో పచ్చదనం కోసం కేవలం రూ. 3.3 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో సీఎస్‌ఎంపీని అమృత్‌లోకి తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌తోపాటు సమీప పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కి.మీ. మేర రూ. 17,212.69 కోట్లతో సీఎస్‌ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్‌కు సీఎం తెలిపారు. సీఎస్‌ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment