
ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వివాదంపై 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో ముందుగానే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని తెలంగాణ సర్కార్ అంటోంది. దీనిని అనుసరించే కౌంటర్ దాఖలు చేసింది.
20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల అక్కడ పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కొనలేదనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ భూములకు ఎలాంటి కంచలేదని, కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశామని, ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని కౌంటర్ లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎల్లుండి(బుధవారం, ఏప్రిల్ 16వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణకు లోపే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండటంతో న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఓ క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
ఈ భూముల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ సర్కారుకు గట్టిగానే మొట్టికాయలు వేసింది. గత విచారణ సందర్భంగా భూముల్ని తదుపరి విచారణ వరకూ కొట్టివేయొద్దని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చెట్లు నరికివేతపై తీవ్రంగా స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాను హడావుడి చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా, దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా అంటూ పలు ప్రశ్నలను సంధించింది.