Shanti kumari
-
రిపోర్టు అన్నారు...రిక్తహస్తం చూపారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. 317 జీవో వల్ల ఎదురైన సమస్యలపై తమ వాదనను సీఎస్ ముందు ఉంచారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచి్చనట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం భేటీ కావడం తెలిసిందే. ఆర్థిక అంశాలపై మార్చి వరకు వేచి ఉండాలని సూచించిన ఆయన.. 317 జీవో ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్ సమక్షంలో పరిశీలించాలని ఉద్యోగులకు సూచించారు.ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సీఎస్‌ను కలిశారు. అయితే మంత్రివర్గ ఉససంఘం 317 సమస్యల పరిష్కారానికి సూచించిన సాధ్యాసాధ్యాలను సీఎస్ బహిర్గతపరచలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. నివేదిక చూపిస్తామని పిలిచి సూచనలు ఇవ్వాలంటూ పంపాశారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక 317 జీవో వల్ల పలువురు ఉద్యోగులకు జరిగిన నష్టం, స్పౌజ్ కేసుల పరిష్కారం, అనారోగ్యంతో బాధపడే వారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీలు తదితర అంశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి పలువురు ఉద్యోగ నేతలు సీఎస్‌ను అడగ్గా ఆ ఫైల్ సర్క్యులేషన్లో ఉందని.. బహుశా కేబినేట్ పరిశీలనకు వెళ్లే వీలుందని ఆమె సర్దిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆందోళన బాట పట్టాలనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ ప్రకటిస్తారా లేదా అనే అంశాన్ని పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎస్‌తో భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఏలూరు శ్రీనివాస్‌రావు, చావా రవి, వి. రవీందర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, హనుమంతరావు, కత్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎస్‌పై కేంద్రం సీరియస్
సాక్షి, ఢిల్లీ: కొద్ది రోజులుగా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయి, ఇంట్లోకి నీరు చేరడంతో బాధితులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పంటలకు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరద నష్టం వివరాలు రాష్ట్రం పంపించక పోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.తాజాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సందర్భంగా తెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని హోం శాఖ సూచించింది. రూ.1,345 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, వరదల సందర్భంగా సాయం కోసం ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు లేఖలో పేర్కొంది.ఇక, ఎస్డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించింది. ఇదే సమయంలో జూన్‌లో రూ.208కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది వరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫిటెక్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరింది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపించాలని లేఖలో పేర్కొంది. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవారం కూడా దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం సమీక్షించారు.ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోండి: భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే విషయమై జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు.కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు 24/7 పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్ కుమార్, ఫైర్ సరీ్వసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. -
కూల్చివేతలపై అధికారులతో సీఎస్ శాంతికుమారి కీలక భేటీ
-
దసరా నుంచి స్కిల్స్ వర్సిటీ షురూ
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో 20 కోర్సులను నిర్వహించనున్నామని.. అందులో దసరా నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సు లను ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితరాలపై శనివారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో స్కిల్స్ వర్సిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యేదాకా.. తాత్కాలిక భవనంలో వర్సిటీని నిర్వ హించనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా/ న్యాక్/ నిథమ్ భవనాల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా, కో–చైర్మన్‌గా శ్రీనివాస సి రాజును నియమించినట్టు వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.తొలుత స్కూల్ ఆఫ్ ఈ–కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సరి్టఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభిస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డీస్, టీవీఏజీఏ, అదానీ కంపెనీలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించాయన్నారు. సీఐఐ కూడా ముందుకు వచి్చందని చెప్పారు. యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్ ఉన్నారు. అయితే, వీరిలో కేడర్ కేటాయింపు వివాదం కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌కు మాత్రం డీఓపీటీ నుంచి తెలంగాణ కేడర్‌కు కేటాయించినట్టు నిర్ధారణ అయిన తర్వాతే పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేశారు. డీజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను తిరిగి ప్రస్తుత పోస్టింగ్‌లలోనే డీజీపీ హోదాలో కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ సీపీగా, బి.శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ, అభిలాష బిస్త్‌ను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీపీ ట్రైనింగ్‌గా, డా.సౌమ్యా మిశ్రా జైళ్లశాఖ డీజీగా, శిఖాగోయల్ సీఐడీ డీజీపీగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, టీజీఎఫ్ఎస్ఎల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.కాగా, పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సర్వీస్ వచ్చే ఏడాది ఆగస్టు వరకు, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి సరీ్వస్ 2026 ఏప్రిల్ వరకు, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా సరీ్వస్ 2027 డిసెంబర్ వరకు, శిఖాగోయల్ సర్వీస్ 2029 మార్చి వరకు ఉంది. -
అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ ఉదయం శంషాబాద్ నుంచి ఆయన అమెరికా వెళ్లారు. ఆయన వెంట మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోతో పాటు దక్షిణ కొరియా సియోల్ నగరంలోనూ రేవంత్ బృందం పర్యటించనుంది.తన పర్యటనలో భాగంగా.. తొలుత ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది. 5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.8న శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు. 9న గూగుల్, అమెజాన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు. అటు నుంచే సియోల్‌కు..10న శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శామ్సంగ్తో పాటు .. ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
కేసీఆర్ ఫొటోలపై సీఎస్‌కు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్ల డిజిటల్ విధ్వంసానికి సంబంధించి జోక్యం చేసుకుని చర్యను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ‘ఎక్స్’వేదికగా మరోసారి విజ్ఞప్తి చేశారు.Smt. Santhi Kumari Garu @TelanganaCSThis is a gentle reminder to kindly intervene and expedite action regarding the digital vandalism of Telangana government websites and social media handlesImportant content from former CM Sri KCR’s tenure has been removed from these… https://t.co/NjQe6SjNWf— KTR (@KTRBRS) July 29, 2024 ‘‘సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన కంటెంట్ తొలగించబడింది. ఈ కంటెంట్ ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అవసరం. మీరు చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవల్సి వస్తుంది’’ అని కేటీఆర్ అన్నారు. -
మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 151 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకలి్పంచారని, మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్, థర్డ్‌ఫ్లోర్‌లో మహిళాశక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు. మహిళాశక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా నాణ్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పారు. పల్లెరుచులు, ఇప్పపువ్వు లడ్డూలు, నన్నారి వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. జిల్లా ఆస్పత్రుల్లోనూ.... మహిళా శక్తి క్యాంటీన్లకు సచివాలయంలో మొదటి అడుగు పడిందని, 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళాశక్తి కాంటీన్లు ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. తెలంగాణ మహిళాసంఘాలు దేశానికే ఆదర్శంగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పీఆర్ అండ్ ఆర్ డీ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయ, సీఎం కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు, అధికారులు నర్సింహారెడ్డి, సునీతరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు. -
వారంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల వరకు పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అధికారులతో కొత్త జట్టు కూర్పుపై దృష్టిసారించింది.మరో వారం పది రోజుల్లో బదిలీల కసరత్తు పూర్తి చేసి ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎలాంటి వివాదాలు, ఆరోపణల్లో చిక్కుకోని అధికారులకు బదిలీల్లో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతోపాటు ప్రభుత్వం ముందు ఉన్న ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకొని చురుకుగా పనిచేసే అధికారులను కీలక పోస్టుల్లో నియమించే అవకాశాలున్నాయి. సీఎస్ రేసులో జయేశ్ రంజన్, వికాస్‌రాజ్ మరికొందరు సీఎస్ శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్ పోస్టు రేసులో ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, కె. రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, జయేశ్ రంజన్, సంజయ్‌జాజు, వికాస్‌రాజ్ ఉన్నారు. శశాంక్ గోయల్‌కు రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌కు ఏడాది,జ యేశ్ రంజన్, వికాస్‌రాజ్‌కు మూడేళ్లు, సంజయ్ జాజుకు ఇంకా 4 ఏళ్ల సరీ్వసు మిగిలి ఉంది.వారిలో గోయల్, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను ప్రభుత్వం సీఎస్ పదవికి పరిశీలించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు శాఖ ఇన్చార్జి డీజీపీగా రవిగుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియ మించిన విషయం తెలిసిందే. ఆయన్ను బదిలీ చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది. డీజీపీని మార్చాలని ప్రభుత్వం భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ఇన్చార్జీల స్థానంలో పూర్తిస్థాయి అధికారులువిద్య, వైద్యం, పురపాలన, రెవెన్యూ, ఆర్థిక, పంచాయతీరాజ్, సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం వంటి కీలక శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇన్చార్జీల పాలనలో ఉన్న చాలా శాఖలకు పూర్తిస్థాయి అధికారులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ఇన్చార్జి సీఎండీ ఎస్వీఎం రిజ్వీ బదిలీ కానున్నట్టు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముక్కుసూటిగా, నిక్కచి్చగా వ్యవహరించే అధికారిగా పేరుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర విద్యుత్ సంస్థలను గాడినపెట్టే బాధ్యత అప్పగించింది.కానీ రాజకీయ సిఫారసులను పక్కనపెట్టి పూర్తిగా నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకుంటుండటంతో రిజ్వీని బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల్లో కీలకపాత్ర పోషించే ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను పెద్దగా ప్రాధాన్యంలేని ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ పోస్టు కు బదిలీ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా కొత్త అధికారిని నియమించే అవకాశాలున్నాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు కొత్త సీఎండీని సైతం నియమించనుంది.జిల్లాలకు కొత్త సారథులుజిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలపై ఇప్పటి వర కు ఎన్నికల సంఘం ఆంక్షలు కొనసాగాయి. ఎన్నికలు ముగియడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ స్థా యి అధికారులను వారం రోజుల్లో బదిలీ చేసే అవకాశముంది. కొందరు అధికారులు ముఖ్యమైన జిల్లాల్లో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. -
జిల్లాకో నోడల్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 9న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజినల్ కో ఆర్డినేటర్‌ను కూడా నియమించినట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షల ఏర్పాట్లతో పాటు విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై సీఎస్ గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ని ర్వహించారు. గ్రూప్– 1 పరీక్షల ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో తక్షణమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ అభినందించారు. రానున్న మూడు వారాల పాటు నిఘా కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్యాక్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థా యి గోడౌన్ల వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించి సక్రమంగా అందేలా చూడాలని, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రతి విద్యారి్థకీ కనీసం జత యూనిఫాం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా? లేదా అనే విషయాన్ని నిర్ణిత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీజీపీ రవిగుప్తా, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ దివ్య, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విత్తనాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్: విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఏడీ, వ్యవసాయ శాఖల కార్యదర్శి రఘునందన్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ వానాకాలానికి సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తనాల విషయంలో ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని వివరించారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనికీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనితోపాటు, గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో పతాకావిష్కరణతెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ కోసం అమరులైన వారికి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమ కారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపారు. -
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష
-
ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతిచి్చన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఈ వేడుకల కోసం చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఆమె సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డీజీపీ రవి గుప్తాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, సీనియర్ ఐఏఎస్ అధికారులు బి.వెంకటేశం, జితేందర్, క్రిస్టినా జోంగ్తు, వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి, టీజీపీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.శాంతికుమారి మాట్లాడుతూ ఆవిర్భావ వేడుకల సందర్భంగా వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ట్రా ఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసి పార్కింగ్ స్థలాలను కేటాయించాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రజలకు ఎండ తగలకుండా బారికేడింగ్‌తో పాటు నీడ కోసం షామియానాలను ఏర్పాటు చేసే బాధ్యతలను ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. సభా ప్రాంగణ ప్రాంతాల్లో పారిశు ద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను, నిరంతరాయంగా విద్యు త్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. సీఎం రేవంత్గన్పార్క్ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పంచి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
నవ వసంతంలో అందరికీ మేలు జరగాలి
గన్¸పౌండ్రీ (హైదరాబాద్): క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలలో పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటికి ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన మూడు జలాశయాలైన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌లలో గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సరఫరాను సమీక్షించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ‘వేసవి కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించి జిల్లాలకు తగు నిధులను కూడా విడుదల చేసినట్లు సీఎస్ తెలిపారు. తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు. నిరంతర నీటి సరఫరా కొనసాగింపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని తాగునీటి సమస్యను మన రాష్ట్రానికి కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన వార్తా కథనాలు రాయడం సరికాదన్నారు. ఏప్రిల్ రెండో వారం అనంతరం రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌ను చేపడతామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో కూడా సరిపడా నీటి సరఫరా చేస్తున్నామని, వాణిజ్య అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు వెల్లడించారు. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులతో గురువారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలా పనిచేశారో.. అదే స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కూడా వివిధ శాఖలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయన్నారు. ఇప్పటివరకు పోలీసు శాఖ రూ.10 కోట్ల నగదు, పలు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను నిల్వ చేసేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ కేంద్రాలపై కూడా నిఘా ఉంచామన్నారు. మద్యం అక్రమ రావాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి మద్యం నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె. జైన్ పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ)గా రాష్ట్ర మా జీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులయ్యా రు. అదేవిధంగా కమిషన్‌లో పది మంది సభ్యు ల నియామకానికి అవకాశం ఉండగా.. ప్రభు త్వం చేసిన ప్రతిపాదనల మేరకు ఐదుగురిని సభ్యులుగా నియమించడానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ని యమితులైన చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఆరే ళ్ల పాటు ఉంటుంది. అయితే 62 ఏళ్లు పైబడిన వారు పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించి.. సెర్చ్ కమిటీ వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా చర్యలు వేగవంతం చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో కమిషన్ చైర్మన్‌గా వ్యవ హరించిన బి.జనార్ధన్‌రెడ్డి డిసెంబర్లో రాజీ నామా చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో పీఎస్సీల పనితీరును అధ్యయనం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా యూపీఎస్సీ చైర్మన్‌తో సమావేశమై టీఎస్పీఎస్సీ నిర్వహణకు సలహాలు సూచనలు కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటి పరిశీలనకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తుల వడపోత అనంతరం సెర్చ్ కమిటీ చైర్మన్, సభ్యుల కోసం కొన్ని పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. కాగా ఈ మేరకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1962 డిసెంబర్ 3న ఆయన జన్మించారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు. టీఎస్పీఎస్సీ టీమ్ ఇదే చైర్మన్: ఎం.మహేందర్‌రెడ్డి(రిటైర్డ్ ఐపీఎస్) సభ్యులు: అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమిర్ ఉల్లా ఖాన్, (రిటైర్డ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్), ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబడి రామ్మోహన్రావు, పాల్వాయి రజినీకుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల బయోడేటాలు పేరు: ఎం.మహేందర్ రెడ్డి స్వస్థలం : ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కిష్టాపురం గ్రామం పుట్టిన తేదీ : 1962 డిసెంబర్ 3 సామాజికవర్గం: రెడ్డి (ఓసీ) విద్యార్హతలు: ఆర్ఈసీ వరంగల్ నుంచి బీటెక్ (సివిల్), ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ హోదా: రిటైర్డ్ డీజీపీ (2022 డిసెంబర్) (1986 బ్యాచ్ ఐపీఎస్) పేరు: అనితా రాజేంద్ర స్వస్థలం : రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ పుట్టిన తేదీ : 1963 ఫిబ్రవరి 04, బీసీ–బీ (గౌడ) విద్యార్హతలు: బీకాం, ఎంఏ, ఎల్ఎల్ఎం హోదా: రిటైర్డ్ ఐఏఎస్ పేరు: అమిర్ ఉల్లా ఖాన్ స్వస్థలం : హైదరాబాద్ సామాజికవర్గం : ముస్లిం వయస్సు: 58 ఏళ్లు అనుభవం: యూఎన్‌డీపీలో పనిచేస్తున్నారు. ఉర్దూ వర్సిటీ, నల్సార్, ఐఎస్బీ, ఎంసీఆర్హెచ్ఆర్డీలో విజిటింగ్ ప్రొఫెసర్. హోదా: ఇండియన్ పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా పేరు: పాల్వాయి రజనీకుమారి స్వస్థలం : సూర్యాపేట పుట్టిన తేదీ: 06–05–1972, ఎస్సీ మాదిగ విద్యార్హతలు: ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ హోదా: టీచర్, వీడీఓ, మున్సిపల్ కమిషనర్ పేరు: వై.రామ్మోహన్రావు స్వస్థలం : హైదరాబాద్ పుట్టిన తేదీ : 1963 ఏప్రిల్ 4 సామాజికవర్గం : ఎస్టీ–ఎరుకల విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ హోదా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్కో పేరు: డాక్టర్ నర్రి యాదయ్య స్వస్థలం: మల్లారెడ్డిగూడెం, యాద్రాది భువనగిరి జిల్లా పుట్టిన తేదీ : 1964–4–10 సామాజికవర్గం: బీసీ–బీ(కురుమ) విద్యార్హతలు: ఎంటెక్ , పీహెచ్డీ హోదా: సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్, కూకట్పల్లి -
17 నాటికి డేటా ఎంట్రీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అభయహస్తం దరఖాస్తుల మొత్తం డేటా ఎంట్రీ ఈనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహ ణ, దరఖాస్తుల డేటా ఎంట్రీపై జిల్లా కలెక్టర్లతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సీఎస్ అభినందించారు. ఈనెల 6 వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి 17 నాటికి పూర్తి చేయాలన్నారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. నేడు టీవోటీలకు శిక్షణ డేటా ఎంట్రీకి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రైనీ ఆఫ్ ట్రైనర్ (టీవోటీ)లకు 4వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీవోటీలు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏవిధంగా చేయా లన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని చెప్పారు. డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. 2వ తేదీ నాటికి 57 లక్షల దరఖాస్తులు మంగళవారం నాటికి దాదాపు 57 లక్షల దరఖాస్తులు అందాయని సీఎస్ తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని కూడా సీఎస్ స్పష్టం చేశారు. టెలి కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు. -
జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. కేబినెట్ లోని మంత్రులందరికీ ఉమ్మడి పది జిల్లాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులను తలా ఓ జిల్లాకు ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్లో ప్రాతిని ధ్యం దక్కని హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, ఆదిలా బాద్‌కు సీతక్క, నిజామాబాద్‌కు జూపల్లి కృష్ణా రావు, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను ఇన్చార్జి మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) లను కూడా పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మండళ్ల పునరుద్ధరణ ద్వారా ప్రతి మూడు నెలలకోసారి ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ఇన్చార్జి మంత్రులను ప్రజాపాలన కార్యక్రమాల అమలును సమన్వయం చేసేందుకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. -
తెలంగాణలో 9మంది ఐఏఎస్‌లకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది ఐఏఎస్‌లకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఉత్వర్వుల్లో సంతకం చేశారు. తాజా పోస్టింగ్‌లలో.. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి శ్రీజా, జనగాం అడిషనల్ కలెక్టర్‌గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వట్సల్ టోప్పో, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదివరన్ ఐఏఎస్‌లను నియమించారు. అలాగే.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్‌గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత గంగువార్‌లను నియమిస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. -
విద్యుత్ శాఖలో భారీ మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సర్కారు విద్యుత్ శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. ఆయా విద్యుత్ సంస్థల సారథ్య బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారుల (నాన్ ఐఏఎస్)ను తొలగించి.. ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్‌తోపాటు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఇన్చార్జి డైరెక్టర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని ఇంధనశాఖ కార్యదర్శిగా నియమించారు. అంతేగాక రాష్ట్ర విద్యుత్ శాఖలో కీలకమైన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో, జెన్కోలకు సీఎండీగా దాదాపు పదేళ్లు కొనసాగిన డి.ప్రభాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. దీంతో సర్కారు కొత్త సీఎండీని నియమించింది. ముర్తుజా రిజ్వీ 2013 జూలై 2 నుంచి 2014 జూలై 19 వరకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా వ్యవహరించారు. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు కీలకమైన ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది. గత ఎనిమిదేళ్లుగా ఈ పోస్టులో కొనసాగిన సి.శ్రీనివాసరావుకు ఉద్వాసన పలికింది. డిస్కంలకు యువ అధికారులు: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు అధిపతులుగా యువ ఐఏఎస్ అధికారులను సర్కారు నియమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషార్రఫ్ అలీ ఫారూఖీని.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్‌రెడ్డిని నియమించింది. ఐటీ–ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ ఝాను ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా బదిలీ చేసింది. టీఎస్ఎన్పిడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు తన పదవికి రాజీనామా చేయగా, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఇప్పటివరకు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో రఘుమారెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆయనను తప్పించారు. ఇక కేంద్ర డెప్యుటేషన్ నుంచి తిరిగొచ్చి వెయిటింగ్లో ఉన్న కాటా ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్లో ఉన్న బి.గోపికి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొత్త డైరెక్టర్లు కూడా..! రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కొత్త సీఎండీలను నియమించిన ప్రభుత్వం.. త్వరలో కొత్త డైరెక్టర్లను సై తం నియమించనున్నట్టు చర్చ జరుగుతోంది. ప్ర స్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఆరుగు రు, టీఎస్ఎస్పీడీసీఎల్లో ఏడుగురు, టీఎస్ఎన్పి డీసీఎల్‌లో ఆరుగురు డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వారిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి, మరికొందరు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్థల్లో నిర్దేశిత సంఖ్యకు మించి డైరెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న డైరెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిసింది. -
2024లో 27 సాధారణ సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని ఆదివారాలు, అన్ని రెండో శనివారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశించారు. 2024 జనవరి 1న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం (ఫిబ్రవరి 10) రోజును పనిదినంగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 25 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా 5 సెలవులను మాత్రమే వినియోగించాలని కోరారు. తమ ఇష్టాలకు అనుగుణంగా మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకి సంబంధించిన ఐచ్చిక సెలవును ఉద్యోగులు వాడుకోవచ్చని తెలిపారు. అయితే దీనికోసం పైఅధికారికి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు వర్తించవని స్పష్టం చేశారు. సంబంధిత సంస్థలే సెలవులపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయన్నారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పర్వదినాల సెలవులను తర్వాత మారుస్తామని తెలిపారు. -
సలహాదారులకు ఉద్వాసన..
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం నియమించిన సలహాదారుల పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌శర్మ, డీజీపీగా కొనసాగిన అనురాగ్ శర్మలు ఇంతకాలం సలహాదారులుగా కొనసాగుతున్నారు. వారి పదవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పదవులు కోల్పోతున్న వారిలో రాజీవ్‌శర్మ (ప్రభుత్వ ముఖ్య సలహాదారు), అనురాగ్‌శర్మ (శాంతిభద్రతలు, నేర నిరోధక సలహాదారు), ఏకే ఖాన్ (మైనారిటీ సంక్షేమం సలహాదారు), జీఆర్ రెడ్డి (ఆర్థిక సలహాదారు), ఆర్.శోభ (అటవీ వ్యవహారాలు), సోమేశ్‌కుమార్ (ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు), డాక్టర్ చెన్నమనేని రమేశ్ (వ్యవసాయ ముఖ్య సలహాదారు) ఉన్నారు. వీరి పదవీ కాలం శుక్రవారంతోనే ముగిసిందని సీఎస్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
సీఆర్పీఎఫ్ పహారాలో ‘సాగర్’
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పహారాలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే నవంబర్ 30 నాటి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేయగా గత నెల 28కి ముందున్న పరిస్థితిని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏమాత్రం రాజీ లేకుండా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల దాహార్తి తీర్చేలా తాగునీటి అవసరాల కోసం రెండో రోజు శుక్రవారం కూడా 3,300 క్యూసెక్కుల నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్‌వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం స్వాధీనం చేసుకుని కుడి కాలువకు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా శుక్రవారం ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్‌లతో కలిసి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. హక్కులు కాపాడుకోవడానికే.. తాము శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం 500 మంది పోలీసులను పంపి సాగర్‌లో సగం స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిందని తెలంగాణ సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండోసారి అని చెప్పారు. సాగర్ కుడి కాలువకు నీటిని తరలించడం వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. దీనిపై ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో అక్టోబర్ 6న కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయిస్తే అదే రోజు అక్రమంగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తెలంగాణ సర్కారు నీటిని తరలించిందని ప్రస్తావించారు. దీనివల్ల శ్రీశైలంలో తమకు కేటాయించిన నీటిలో 17 టీఎంసీలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసే సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని తెలంగాణ తన అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేయకుండా హక్కులను హరిస్తోందన్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికే సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నామని తేల్చి చెప్పారు. తెలంగాణ సర్కార్ తీరుతో వివాదాలు కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్ సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించగా తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటోందని, ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతోందని ప్రస్తావించారు. తెలంగాణ సర్కార్ చర్యల వల్లే గెజిట్ నోటిఫికేషన్ అమలులో జాప్యం జరుగుతోందని, దీనివల్లే వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని తేల్చి చెప్పారు. తాను శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వెళ్తే తెలంగాణ సర్కార్ తనను ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలోకి అనుమతించలేదని వెల్లడించారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ తెలంగాణ సర్కార్ కృష్ణా జలాలను వాడుకుంటోందని, ఇదే వివాదానికి కారణమవుతోందని ఆనంద్‌మోహన్ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు.. సాగర్ డ్యామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఏపీ జలవనరుల శాఖ, పోలీసు సిబ్బందిని అడ్డుకున్న ఘటనకు సంబంధించి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)పై రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై పల్నాడు జిల్లా విజయపురి సౌత్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చలు రెండు రాష్ట్రాల సీఎస్ల వాదనలు, కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, కృష్ణా బోర్డు ఛైర్మన్ అభిప్రాయాలను విన్న తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ బల్లా దీనిపై స్పందించారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ సాగర్‌పై స్టేటస్ కో కొనసాగుతుందని ప్రకటించారు. ఈలోగా ఈ వివాదంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటిదాకా సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు దిశానిర్దేశం చేశారు. కొనసాగుతున్న నీటి విడుదల రెండో రోజు సాగర్ కుడికాలువ ద్వారా 3,300 క్యూసెక్కులు దిగువకు సాక్షి, నరసరావుపేట, మాచర్ల, విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ భూభాగంలో ఉన్న 13 క్రస్ట్‌గేట్లు, హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనపర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నీటి హక్కులపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కుల నీటి విడుదల రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం 5వ గేటు నుంచి 2,000 క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1,300ల క్యూసెక్కుల విడుదలను కొనసాగిస్తూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. సాగర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 1,300 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తును పరిశీలించారు.