సమీక్షలో సీఎస్ శాంతికుమారి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులతో గురువారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలా పనిచేశారో.. అదే స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కూడా వివిధ శాఖలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయన్నారు. ఇప్పటివరకు పోలీసు శాఖ రూ.10 కోట్ల నగదు, పలు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను నిల్వ చేసేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు.
మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ కేంద్రాలపై కూడా నిఘా ఉంచామన్నారు. మద్యం అక్రమ రావాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి మద్యం నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె. జైన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment