ఫార్ములా ఈ–కార్ల రేసు వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించండి
ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ
గవర్నర్ ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ–కార్ల రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని రాష్ట్ర అవినీతి నిరోధక విభాగాన్ని (ఏసీబీ) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఫార్ములా ఈ–కార్ల రేసు వ్యవహారంలో జరిగిన అవకతవకతల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ నిర్వహించేందుకు అవినీతి నిరోధక చట్టం–2018లోని సెక్షన్ 17(ఏ) కింద రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారని తెలిపారు.
అప్పట్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అర్వింద్‌కుమార్‌తో పాటు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ డీఎల్‌ఎన్ రెడ్డి తదితరులను సైతం కేసులో సహ నిందితులుగా చేర్చి విచారించాలని సీఎస్ ఆదేశించారు. కేటీఆర్, తదితరులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని, సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఫార్ములా ఈ–కారు రేసు నిర్వాహకులకు చెల్లింపులు జరిపినట్టు అర్వింద్‌కుమార్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. కాగా గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖతో పాటు అర్వింద్‌కుమార్ ఇచ్చిన వివరణ పత్రాలను సీఎస్ తన లేఖకు జత చేసినట్లు తెలిసింది.
త్వరలో నోటీసులు!
సీఎస్ లేఖ నేపథ్యంలో ఏసీబీ తక్షణమే కేటీఆర్, ఇతరులపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వారికి త్వరలోనే నోటీసులు జారీ చేయవచ్చని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment