
ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటన
వైటీడీఏ స్థానంలో వైటీడీబీ
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు (వైటీడీబీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. గత నెల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైటీడీబీ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 12వ తేదీలోగా వైటీడీబీని ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్డినెన్స్‌ను ఆరు నెలల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది.
చైర్మన్, పాలకవర్గం నియామకం
యాదగిరిగుట్ట (yadagirigutta) దేవస్థానం బోర్డుకు చైర్మన్‌తోపాటు పాలకవర్గం సభ్యులు 11 మందిని నామినేట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వీరికి తోడు ఆరుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న వంశపారంపర్య ధర్మకర్త దేవస్థానం పాలకవర్గంలో సభ్యుడిగా ఉంటారు. కాగా, సీఎం చైర్మన్‌గా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వైటీడీఏ) మొత్తం నూతనంగా వచ్చే వైటీడీబీ పరిధిలోకి రానుంది. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు, ఉద్యోగుల బదిలీలు, భక్తుల వసతులు, దేవస్థానం అభివృద్ధి పనులను వైటీడీబీ పర్యవేక్షణలోకి తేనున్నారు.
స్వాగత తోరణానికి రంగులు
యాదగిరిగుట్ట దేవస్థానం స్వాగత తోరణానికి రంగులు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొండపైన భక్తులకు స్వాగతం పలికే తోరణాన్ని సిమెంట్‌తో నిర్మించారు. నవంబర్‌లో సీఎం యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో తోరణం నిర్మాణ శైలి వివరాలను తెలుసుకున్నారు. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో స్వాగత తోరణానికి ఆకర్షణీయమైన రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పనులు ప్రారంభించారు.
చదవండి: అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్?
యాగశాల ఏర్పాటుకు మార్కింగ్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సోమవారం ఆలయ ఉత్తర మాడ వీధిలో మార్కింగ్ చేశారు. 32 ఫీట్ల వెడల్పు, 32 ఫీట్ల పొడవుతో యాగశాలను నిర్మాణం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.