
పబ్లిక్ సర్వీస్ చేయాలన్నదే లక్ష్యం అంటున్న సాయి కృష్ణారెడ్డి
ఉద్యోగపరంగా పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలకు సన్నద్ధమై రాశానని, గ్రూపు–2 స్టేట్ 11వ ర్యాంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా (yadadri bhuvanagiri district) మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. మోత్కూరుకు చెందిన గుర్రం మోహన్‌రెడ్డి స్వరాజ్యం దంపతులకు సాయికృష్ణారెడ్డి, సాయి సుప్రియ సంతానం. సామాన్య రైతు కుటుంబం. మోత్కూరులో కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.
మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్‌లో పదవ తరగతి వరకు, హైదరాబాద్ (Hyderabad) కొత్తపేట నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ పూర్తి చేశారు. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్, సీఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 ర్యాంకు సాధించి స్టేట్ లెవల్ 11వ ర్యాంకు పొందారు.
సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పోస్టులు సాధించాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో 4 సంవత్సరాలు హాస్టల్‌లో ఉంటూ స్టడీ హాల్‌కు వెళ్లి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా గ్రూపు పరీక్షలకు సిద్ధమై రాశాను. మా పెద్ద తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ప్రజాసేవ చేసిన గుర్రం యాదగిరిరెడ్డి (Gurram Yadagiri Reddy) స్ఫూర్తితో నేను రాజకీయాలు కాకుండా ఉద్యోగం ద్వారా పబ్లిక్ సేవ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలు రాస్తున్నాను. రూ.4 లక్షల ప్యాకేజీ జీతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చాను. ఇందులో ప్రధానంగా నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని అమ్మానాన్న పట్టుబట్టారు.
చదవండి: అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా
గ్రూప్–4 ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించాను. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్–3 పరీక్ష కూడా రాశాను. త్వరలో ఆ ఫలితాలు కూడా రానున్నాయి. మా చెల్లెలు సాయి సుప్రియ గ్రూపు–4 లో ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment