సుమలతను ఆశీర్వదిస్తున్న మంత్రి కోమటిరెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుల తల్లి సుమలతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీల కూతురు కాట్రోత్ సుమలతకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళ్తోందని బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలీ పనులకు’ శీర్షికతో కథనం ప్రచురించింది.
ఈ కథనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుమలత, ఆమె తండ్రి శివరాంను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. సుమలత చదువుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్య కళాశాలకు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఇతర ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. సుమలత ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదివి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి సుమలత తండ్రి శివరాం కృతజ్ఞతలు తెలిపారు.
సాయం చేస్తే డాక్టర్ అవుతా..
బీహెచ్‌ఎంఎస్ సీటు సాధించిన పేద విద్యార్థి సంతోష్‌కుమార్
ఫీజు కట్టలేని స్థితిలో దాతల చేయూత కోసం ఎదురుచూపు
అనంతగిరి: డాక్టర్ కావాలనుకుంటున్న ఆ విద్యార్థి కలకు పేదరికం అడ్డుపడుతోంది. మనసున్న దాతలు ఎవరైనా ఆర్థికంగా చేయూతనందిస్తే.. భవిష్యత్‌లో సమాజ సేవకు పాటుపడతానని చెబుతున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామానికి చెందిన సంతోష్.. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి, 959 మార్కులు సాధించాడు. నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని రామంతాపూర్ జేఎస్‌పీఎస్ హోమియో మెడికల్ కాలేజీలో బీహెచ్‌ఎంఎస్ (బ్యాచ్‌లర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ) సీటు వచ్చింది.
ఇంతవరకూ బాగానే ఉన్నా ఫీజు, వసతి కోసం నవంబర్ 2న లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. అనారోగ్యం బారిన పడిన తండ్రి అశోక్ 11 నెలల క్రితం మృతిచెందగా.. తల్లి పుష్పమ్మ కూలి పనులు చేస్తోంది. తండ్రి మరణంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఫీజు కట్టే స్తోమత లేదని సంతోష్ వాపోతున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు సెల్ నంబర్ 9963870085లో సంప్రదించాలని కోరాడు.
చదవండి: ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడు
గోండు కళాకారుడికి అవార్డు
జైనూర్ (ఆసిఫాబాద్): ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపేలా దండారీ ఉత్సవాల చిత్రాన్ని గీసిన ఆదివాసీ కళాకారుడు మడావి ఆనంద్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా బుధవారం అవార్డు అందుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనంద్‌రావు చిత్రకళలో రాణిస్తున్నాడు.
ఈ క్రమంలో 13 రోజులుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయ చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ఆనంద్‌రావు గుస్సాడీ నృత్యాలకు సంబంధించిన చిత్రం గీసి అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment