(సూర్యాపేట) : అసలే ఎడతెరిపి లేని వర్షాలు, ఆపై చెరువును తలపించేలా చుట్టూ నీరు.. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఊరు ఊరంతా చికట్లో మగ్గిపోతోంది. దీనిని చూడలేని ఓ యువకుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి సాహసం చేశాడు. నీటిలో ఈదుకుంటూ వెళ్లి.. విద్యుత్ స్తంభంం ఎక్కి మరమ్మతులు చేసి విద్యుస్ సమస్యను తీర్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన కొప్పుల సంతోష్ గౌడ్ స్థానిక లైన్‌మన్ కింద హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనికి తోడు గ్రామానికి పైభాగంలో ఉన్న అయ్యవారికుంట తండా చెరువు నుంచి శంభుని చెరువుకి వచ్చే కరకట్ట తెగిపోయింది. ఈ వరదంతా పాతర్లపహాడ్‌లోని ముదిరాజ్ కాలనీని ముంచెత్తింది. దీంతో గురువారం రాత్రి నుంచి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని సరిచేయాలని ప్రయత్నించగా చెరువును తలపించేలా చుట్టూ వరద నీరు ఉన్న ఓ స్తంభంపై సమస్య ఉందని గుర్తించారు.
ఈ స్తంభంపై మరమ్మతులు చేస్తేనే గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతుందని, లేదంటే చీకట్లోనే గడపాల్సి ఉందని భావించారు. విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న విద్యుత్ హెల్పర్ సంతోష్ గౌడ్ వరదను లెక్కచేయకుండా దిగాడు. చాలా దూరం ఈదుకుంటూ వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చాడు. సంతోష్ గౌడ్ చేసిన సాహసానికి గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment