గ్రూప్‌–2 టాపర్‌ హరవర్ధన్‌రెడ్డి | Group-2 topper Haravardhan Reddy | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 టాపర్‌ హరవర్ధన్‌రెడ్డి

Published Wed, Mar 12 2025 5:47 AM | Last Updated on Wed, Mar 12 2025 5:47 AM

Group-2 topper Haravardhan Reddy

మంగళవారం గ్రూప్‌–2 ఫలితాలు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం

600 మార్కులకు 447.088 మార్కులు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్‌–2 పరీక్ష ఫలితాల్లో నారు వెంకట హరవర్ధన్‌రెడ్డి నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించాడు. మొత్తం 600 మార్కులకుగాను అతడు 447.008 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. గ్రూప్‌–2 జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. జీఆర్‌ఎల్‌ను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

మంగళవారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్‌ బుర్రా వెంకటేశం అధ్యక్షతన కమిషన్‌ సమావేశం జరిగింది. సభ్యులు అమీర్‌ఉల్లా ఖాన్, ప్రొఫెసర్‌ యాదయ్య, యం.రామ్మోహనరావు, పాల్వాయి రజిని సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్‌–2 జీఆర్‌ఎల్, ఫైనల్‌ కీ విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్‌ స్కాన్డ్‌ కాపీలను కూడా వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు. కాగా, టాప్‌ 31 ర్యాంకుల్లో మహిళలు ఎవరూ లేకపోవటం గమనార్హం. 

13 వేలమంది అనర్హత 
గ్రూప్‌–2 సర్వీసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 29 డిసెంబర్‌ 2022లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు... దాదాపు నెలరోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. 5,51,855 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. 

దాదాపు మూడుసార్లు వాయిదా పడ్డ ఈ పరీక్షలు ఎట్టకేలకు గతేడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో జరిగాయి. 33 జిల్లాల్లోని 1,368 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే మొత్తం నాలుగు పేపర్లు రాశారు. తాజాగా 2,36,649 మంది అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టు, ఫైనల్‌ కీలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. వివిధ కారణాలతో 13,315 మంది అభ్యర్థులు అనర్హతకు గురయ్యారు. 


టాపర్‌ కోదాడ వాసి 
గ్రూప్‌–2 పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన నారు వెంకట హరవర్ధన్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఈయన తండ్రి రవణారెడ్డి కోదాడలోని కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. హరవర్ధన్‌ ఇటీవలే గ్రూప్‌–4లో మంచి ర్యాంకు సాధించి ఇంటర్‌బోర్డులో ఉద్యోగం పొందాడు. వీరిది ఆంధ్రప్రదేశ్‌ కాగా తండ్రి ఉద్యోగ రీత్యా ఖమ్మంలో స్థిరపడ్డారు. గత సంవత్సరమే రవణారెడ్డి కోదాడ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీపై వచ్చారు.  

ఐఏఎస్‌ సాధించి తీరుతా 
సిద్దిపేట జోన్‌: రెండుసార్లు యూపీపీఎస్సీ పరీక్షలు రాసినప్పటికీ అర్హత సాధించలేక పోయా. అయినప్పటికీ ఎప్పటికైనా ఐఏఎస్‌ సాధిస్తా. గ్రూప్‌ – 2 రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు రావటం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు వడ్లకొండ శ్రీనివాస్‌రెడ్డి, సుజాత ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైంది. నా ప్రాథమిక విద్య సిద్దిపేటలోనే పూర్తిచేశా. హైదరాబాద్‌లో ఇంటర్, ఇంజనీరింగ్‌ ఢిల్లీలో పూర్తి చేశాను. రెండేళ్లు ఐటీ ఉద్యోగం చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివి గ్రూప్‌ –2లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించాను. 
– సచిన్‌రెడ్డి, 2వ ర్యాంకర్, సిద్దిపేట

సంతోషంగా ఉంది.. 
కొల్చారం(నర్సాపూర్‌): గ్రూప్‌–2లో మూడో ర్యాంకు రావటం ఆనందంగా ఉంది. ఇటీవల వెలువడిన జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాల్లోనూ ఎకనామిక్స్‌ విభాగంలో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించాను. ప్రస్తుతం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా.      
–బి.మనోహర్‌ రావు, 3వ ర్యాంకర్‌. అంసాన్‌పల్లి, కొల్చారం మండలం, మెదక్‌ జిల్లా

కోచింగ్‌ లేకుండానే సాధించా 
పెన్‌పహాడ్‌: ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే.. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే స్వశక్తితో గ్రూప్‌–2 పరీక్షలకు సన్నద్ధమయ్యాను. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉంది. పెన్‌పహాడ్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. కోదాడ క్రాంతి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, కోదాడ అనురాగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాను. 2014లో వీఆర్వో ఉద్యోగం సాధించాను. 

ప్రస్తుతం అనంతగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. మున్సిపల్‌ కమిషనర్‌గా చేయాలనే ఆలోచనతో ఉత్తమ ర్యాంకు సాధించాను. నా తమ్ముడు శ్రీరామ్‌ నవీన్‌ కూడా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్‌–2లో 326వ ర్యాంకు సాధించాడు.      
– శ్రీరామ్‌ మధు, 4వ ర్యాంకర్, మహ్మదాపురం, పెన్‌పహాడ్‌ మండలం, సూర్యాపేట జిల్లా

రోజుకు 15 గంటలు చదివాను 
తలమడుగు: గ్రూప్‌–2లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రోజుకు 12 గంటల నుంచి 15 గంటలు చదివాను. నా విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఒక లక్ష్యంతో చదివితే కచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు.      చింతలపల్లి ప్రీతమ్‌రెడ్డి, 5వ ర్యాంకర్‌. కజ్జర్ల, తలమడుగు మండలం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా 

నా తల్లిదండ్రులే స్ఫూర్తి 
లక్సెట్టిపేట: మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు గొడ్డటి కిష్టయ్య, దేవక్క ఎంతో కష్టపడి నన్ను చదివించారు. గ్రూప్‌–2లో ఏడో ర్యాంకు సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవల గ్రూప్‌–4లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించి మంచిర్యాల కలెక్టరేట్‌లో పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌–2కు సన్నద్ధమయ్యాను.      
– గొడ్డటి అశోక్, 7వ ర్యాంకర్, మంచిర్యాల జిల్లా, గంపలపల్లి గ్రామం 

ఉన్నత స్థానానికి ఎదగడమే లక్ష్యం 
డోర్నకల్‌: సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఉన్నత స్థానానికి ఎదగడమే లక్ష్యంగా చదివాను. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. వాళ్లు కష్టపడి నన్ను చదివించడం, అన్నయ్య కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. ఇటీవల మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాను. గ్రూప్‌–2 కోసం తీవ్రంగా కృషి చేశా. 
    – మేకల ఉపేందర్, 9వ ర్యాంకర్, ముల్కలపల్లి, డోర్నకల్, మహబూబాబాద్‌. 

ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం 
సాక్షి, హైదరాబాద్‌: ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం. సివిల్స్‌కు సిద్ధ్దమవుతున్నాను. బీహెచ్‌ఎంఎస్‌ పూర్తి కాగానే పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. అమ్మానాన్నల పోత్సాహంతో మూడేళ్లుగా ఇంట్లోనే యూట్యూబ్‌లో పాఠాలు వీక్షిస్తూ గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. సీడీపీఓ పరీక్షల్లో కూడా టాపర్‌గా నిలిచాను. గ్రూప్‌–1లో మంచి మార్కులు సాధించాను. సివిల్స్‌ సాధించి పేదలకు సేవలందించాలన్నదే నా ప్రధాన లక్ష్యం.      
–డాక్టర్‌ వినీషా రెడ్డి, 32వ ర్యాంకర్, హైదరాబాద్‌.

గ్రూప్‌–2కే ప్రాధాన్యం 
పాపన్నపేట(మెదక్‌): గ్రూప్‌–2లో రాష్ట్ర స్థాయిలో 41వ ర్యాంకు సాధించాను. గ్రూప్‌–1 ఫలితాల్లో కూడా 401 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం కొల్చారం గురుకుల పాఠశాలలో పీజీటీ (గణితం)గా పని చేస్తున్నాను. గ్రూప్‌–1లో ఎంపీడీఓ పోస్టు రావచ్చు. అయితే గ్రూప్‌–2కే ప్రాధాన్యత ఇస్తాను.     
 –బాయికాడి సుష్మిత, 41వ ర్యాంకర్, అబ్లాపూర్, పాపన్నపేట మండలం, మెదక్‌ జిల్లా

భర్త ప్రోత్సాహంతోనే.. 
తలమడుగు: నా భర్త నిమ్మల సాత్విక్‌రెడ్డి ప్రోత్సాహంతోనే గ్రూప్‌–2లో మంచి ర్యాంకు సాధించాను. మొదటిసారి పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాను. తర్వాత అటవీ శాఖలో బీట్‌ ఆఫీసర్‌గా, మూడోసారి కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించాను.  
– నిమ్మల తేజశ్రీరెడ్డి, 190వ ర్యాంకర్‌. సుంకిడి, తలమడుగు మండలం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement