గ్రూప్–2 మొదటి రోజు పరీక్షలు ప్రశాంతం.. జీఎస్ పేపర్ కఠినంగా వచ్చిందన్న అభ్యర్థులు
దరఖాస్తు చేసినవారిలో 46 శాతం మందే హాజరు
నేడు మరో రెండు పేపర్ల పరీక్ష
సాక్షి, హైదరాబాద్/అనంతగిరి: టీజీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలు ఆదివారం మొదటిరోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో మొదటి, రెండో పేపర్ పరీక్షలు నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీజీపీఎస్సీ ఇప్పటికే జారీచేసిన గ్రూప్స్ నోటిఫికేషన్లలో ఇదే చివరిది. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–3 పరీక్షలు పూర్తికాగా.. గ్రూప్–4 ఉద్యోగాలను భర్తీ కూడా చేశారు. కాగా, ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ కఠినంగా వచ్చిందని అభ్యర్థులు తెలిపారు.
అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని లోతుగా పరిశీలించేలా ్రçపశ్నపత్రం ఉందని మెజార్టీ అభ్యర్థులు చెప్పారు. ఇస్త్రో, జాతీయ అవార్డులు, ఖేలో ఇండియా, కాగ్, విద్యుత్ వాహనాలు, నీతి అయోగ్, వికలాంగులు, సీనియర్ సిటీజన్స్, జాగ్రఫీ, ఐఐటీలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని వెల్లడించారు. దీంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని ఎక్కువ మంది అభ్యర్థులు తెలిపారు.
పేపర్–2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించిన ప్రశ్నల్లో హిస్టరీ కఠినంగా ఉండగా, పాలిటీ కాస్త సులభంగా ఉందని పేర్కొన్నారు. సొసైటీపై ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ప్రధానంగా తెలంగాణ హిస్టరీపై అడిగిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలరని పేర్కొన్నారు.
46.3 శాతమే హాజరు
గ్రూప్–2 పరీక్ష మొదటిరోజు సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. మొత్తం 783 ఉద్యోగాల కోసం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 74.96 శాతం మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. పేపర్–1 పరీక్షకు 2,57,981 మంది (46.75%), పేపర్–2 పరీక్షకు 2,55,490 మంది (46.30%) మాత్రమే హాజరయ్యారు. అయితే పరీక్షల నిర్వహణ పూర్తయ్యి జవాబు పత్రాలు మొత్తం అందిన తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ సెంటర్ (కేంద్రం కోడ్ 4419) లో ఓ అభ్యర్థి వద్ద మొబైల్ ఫోన్ లభించటం కలకలం రేపింది. హాల్‌టికెట్ నంబర్ 2284419441 కలిగిన అభ్యర్థి వద్ద మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వా«దీనం చేసుకు న్నారు. ఆ అభ్యర్థి పరీక్ష రాయకుండా అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అతడిపై మాల్‌ప్రాక్టీస్ చట్టం 25/97 కింద చర్యలు తీసుకొంటామని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలు ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment