
గ్రూప్–1పై పిటిషనర్లన్యాయవాదుల వాదనలు
ప్రతివాదుల వాదనల కోసం నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1లో అవకతవకలకు ఆస్కారం ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరీక్షలు నిర్వహించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. అనుకున్నవారు ఎంపికయ్యేలా నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకుందన్నారు. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు మంగళవారం విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్ వాదనలు వినిపిస్తూ.. జనవరి 11 నుంచి జనవరి 25 వరకు మూల్యాంకనం నిమిత్తం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ విద్యాశాఖ అధికారులకు టీజీపీఎస్సీ లేఖ రాసిందన్నారు. అయితే, లేఖ రాయకముందే ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం అందిందన్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియం పేపర్ల మూల్యాంకనం కోసం ప్రొఫెసర్లను నియమించినా.. ఆ భాషలు వచ్చినవారే ఆయా పేపర్లు దిద్దారా అనేది స్పష్టత లేదన్నారు.
మూల్యాంకనం కోసం ప్రొఫెసర్లకు ఇచ్చి న జవాబు పత్రాలపై బండిల్ నంబర్ ఉంటుందని, దీని ఆధారంగా అది ఏ సెంటర్‌కు చెందినదో తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఏ వ్యక్తిదో తెలుసుకునేందుకు ఆస్కారం ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఒకే పేపర్ పలువురు ప్రొఫెసర్లు దిద్దారని చెబుతున్నా.. అందరూ ప్రొఫెసర్లు అన్ని రోజులు పనిచేయలేదన్నారు. అంటే ఎంపిక చేసిన ప్రొఫెసర్లు మాత్రమే ఒకే పేపర్‌ను పలుమార్లు మూల్యాంకనం చేసినట్టు తెలుస్తోందన్నారు.
మరో సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లను జారీ చేయడం ఇదే తొలిసారని, టీజీపీఎస్సీ చరిత్రలో ఇది ఎప్పటికీ మాయనిమచ్చగా మిగిలిపోతుందన్నారు. ఎంపిక చేసిన వారు సెలెక్ట్ అయ్యేలా చూసే చర్యలు ఇక్కడి నుంచే షురూ అయ్యాయన్నారు. అనంతరం ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనల కోసం విచారణ బుధవారానికి వాయిదా పడింది.