
సంప్రదాయ చీరకట్టులో వచ్చిన క్రిస్టినా పిష్కోవా
యాదగిరిగుట్ట/ సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని 2024 మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) క్రిస్టినా పిష్కోవా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈవో భాస్కర్‌రావు ఆమెకు స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ ప్రతిష్టాలంకార మూర్తులను పిష్కోవా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన, అస్టోత్తర పూజల్లో పాల్గొన్నారు.
శ్రీస్వామిని దర్శించుకున్న పిష్కోవాకు ఈవో భాస్కర్‌రావు లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకు ముందు ప్రధానాలయానికి ఈశాన్య దిశలో ఉన్న అఖండ జ్యోతి వద్ద, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆమె పూజలు చేశారు. ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా ప్రపంచ సుందరి క్రిస్టినా పిష్కోవా సంప్రదాయ రీతిలో చీరకట్టులో రావడం అందరినీ ఆకర్షించింది.
యాదగిరిగుట్టకు ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం
త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవారం యాదాద్రిని క్రిస్టినా పిష్కోవా సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచంలో ఆమె సందర్శించిన ప్రాంతాలను డాక్యుమెంటరీ చేస్తున్నారు. తద్వారా ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఆమె సందర్శించిన ప్రాంతాల డాక్యుమెంటరీని మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రదర్శిస్తారు. నూతన టూరిజం పాలసీలో భాగంగా గుర్తించిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ జాబితాలో యాదగిరిగుట్ట, భువనగిరి కోట, బస్వాపూర్ రిజర్వాయర్, కొలనుపాక దేవాలయం, మహాదేవపురం ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment