
మే 7 నుంచి 31 వరకు పోటీలు
ప్రారంభ, ముగింపు, గ్రాండ్ ఫినాలే వేడుకలకు వేదిక
120 దేశాల నుంచి రానున్న సుందరీమణులు..
అధికారికంగా ప్రకటించిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మరో ప్రతిష్టాత్మక పోటీలకు వేదిక కాబోతోంది. ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించే ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు ఈ ఏడాది హైదరాబాద్‌లో జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 31 వరకు నగరంలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జులియా మోర్లే.. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం సంయుక్తంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీలను నిర్వహించనుంది. పోటీల ప్రారంభ, ముగింపు, గ్రాండ్ ఫినాలే వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జులియా మోర్లే వెల్లడించారు. ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో ఈ పోటీలు నిర్వహించనున్నారు.
ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: జులియా
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదుచూస్తున్నట్లు జులియా మోర్లే తెలిపారు. ‘గొప్ప సంస్కృతి, వారసత్వం, అద్భుత ఆతిథ్యం, వేగవంతమైన వృద్ధి ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ అభిమానులకు గొప్ప అనుభూతిని పంచనున్నాయి. ఈ భాగస్వామ్యం మిస్ వరల్డ్ పోటీల కోసం మాత్రమే కాదు.. సమూహాల సాధికారతకు, బ్యూటీ విత్ ఏ పర్సస్ అనే మా ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం’అని పేర్కొన్నారు.
ఇది అద్భుతాల తెలంగాణ: స్మిత
ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక కావటంపై రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంతోషం వ్యక్తంచేశారు. ‘ఇది తెలంగాణ.. ఇక్కడ ప్రతి పండుగలో గొప్ప ఆనందం ఉంటుంది. ప్రతి చేతి నైపుణ్యం ఓ కొత్త కథను, ఆరాధనను తెలిపే నేల ఇది. ఇది తెలంగాణ.. అసలైన అందాలను ప్రతిబింబించే నేల. మిస్ వరల్డ్ వేదిక తెలంగాణలోని చేనేత గొప్పతనాన్ని, అద్భుతమైన ఆతిథ్యాన్ని, జానపద రీతులకు వేదిక కాబోతోంది’అని వెల్లడించారు. 2024 మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో నిర్వహించారు. ఆ పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో విజేతకు ఆమె వజ్రాల కిరీటాన్ని అలంకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment