
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. గ్రామంలోని పిట్ట సుదర్శన్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌లో.. ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెందాయి. దీనిపై సుదర్శన్‌రెడ్డి ఇచి్చన సమాచారం మేరకు పశువైద్యాధికారులు.. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు.
వారు వాటిని మధ్యప్రదేశ్, భోపాల్‌లోని హై సెక్యూరిటీ వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నమూనాలను పరీక్షించగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణయ్యింది. దీంతో శుక్రవారం జిల్లా పశుసంవర్థక, వైద్య, రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు ఆ పౌల్ట్రీఫామ్‌ను సందర్శించారు. అక్కడ పశు వైద్యాధికారులు, సిబ్బంది మొత్తం 32 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లుగా ఏర్పడి.. పీపీఈ కిట్లు ధరించి.. ఫాంలోని 40వేల కోళ్లను చంపి మూటగట్టి సమీపంలో గుంతతీసి పూడ్చిపెట్టారు.
సుమారు 19 వేల గుడ్లను సైతం పూడ్చారు. దీనిపై యాదాద్రి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఫాంలోని 90 టన్నుల ఫీడ్‌తో పాటు కోళ్ల పెంటను సైతం దహనం చేస్తామని తెలిపారు. కోళ్లఫాం నుంచి కిలోమీటర్ పరిధిలో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేస్తామని తెలిపారు. మూడు నెలల వరకు పౌల్ట్రీ ఫామ్‌ను సీజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల తరువాతే తిరిగి పౌల్ట్రీఫామ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దోతిగూడెంలో బర్డ్‌ఫ్లూ వల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment