
మేలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలతో భాగ్యనగరం బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యాటక పటంలో హైదరాబాద్‌ను సమున్నతంగా నిలిపే అరుదైన అవకాశం.. ప్రపంచం యావత్తు నగరం వైపు దృష్టి సారించే కీలక సన్నివేశం.. ప్రపంచ మీడియా హైదరాబాద్ పేరును ప్రముఖంగా వినిపించి/చూపించే విశిష్ట నేపథ్యం.. అవును.. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. మే ఏడో తేదీ నుంచి 31 వరకు హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు జరగబోతున్నాయి.
ఈ పోటీలను నిర్వహించేందుకు చాలా దేశాలు పోటీపడినా ఈసారి ఆ అవకాశాన్ని హైదరాబాద్ సాధించింది. అందాల పోటీలపై ఆసక్తితో ఆ పోటీలకు వేదికైన హైదరాబాద్ గురించీ ప్రపంచం ఆసక్తిని కనబరుస్తుంది. ఇప్పుడు ఈ ‘ఆసక్తి’ని భావిశక్తిగా మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ప్రపంచ సుందరి పోటీలకు వేదికవడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని పొందే ప్రయత్నం చేస్తోంది. తద్వారా రైజింగ్ తెలంగాణ గుర్తు ప్రపంచం నలుమూలలా చాటడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం ప్రారంభించింది.
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా..
ఈ పోటీలను కవర్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరున్న దాదాపు 3 వేల మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారు. కేవలం పోటీల వివరాలనే కాకుండా, పోటీలకు అతిథ్యమిస్తున్న నగర విశేషాలను కూడా వారు ప్రపంచం ముందుంచనున్నారు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, ఐటీలో హైదరాబాద్ పురోగతి, స్థానికంగా ఉన్న మౌలిక వసతులు.. ఇలా అన్ని వివరాలను ప్రచారం చేస్తారు. దీంతో హైదరాబాద్ అంటే పర్యాటకుల్లో కొత్త ఆసక్తి పెరిగి ఈ నగర పర్యటనకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక పోటీలకు సంబంధించి న్యాయనిర్ణేతలుగా వైద్యులు, క్రీడాకారులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు.. ఇలా వివిధ నేపథ్యాలకు చెందిన 140 మంది కూడా ఇక్కడికి రానున్నారు. వీరు కూడా హైదరాబాద్ ప్రత్యేకతలను విశ్వవ్యాప్తం చేయటంలో ఉపకరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
వెరసి పర్యాటక రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను కూడా ఆకర్షించాలన్న ఆలోచనతో ఉంది. ప్రపంచస్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ రంగంలో పురోగతి, ఘనమైన చరిత్ర, అద్భుత వైద్యసదుపాయాలు.. ఇలాంటి వివరాలను విశ్వవ్యాప్తం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరిగే వేళ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప సహా ఇతర చారిత్రక నిర్మాణాల నేపథ్యాన్ని ఈ సందర్భంగా కళ్లకు కట్టబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment