జగదేక నగరానికి అతిలోక సుందరి | Miss World competition begins in Hyderabad on May 10: Telangana | Sakshi
Sakshi News home page

జగదేక నగరానికి అతిలోక సుందరి

Mar 21 2025 6:10 AM | Updated on Mar 26 2025 5:59 PM

Miss World competition begins in Hyderabad on May 10: Telangana

మే 10న హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభం 

గచ్చిబౌలి స్టేడియంలో తొలిరోజు ప్రోగ్రాం... మే 31న హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే 

రానున్న 140 దేశాల సుందరీమణులు.. చార్మినార్‌లో షాపింగ్‌.. చౌమొహల్లాలో డిన్నర్‌

పోచంపల్లి చీర కట్టి కనువిందు చేయనున్న విదేశీ వనితలు 

రాష్ట్రావతరణ దినోత్సవంలో పాల్గొననున్న మిస్‌ వరల్డ్‌–2025

సాక్షి, హైదరాబాద్‌: అప్పుడెప్పుడో ఓ సినిమాలో అంగుళీయకం కోసం అతిలోక సుందరి దివి నుంచి భువికి దిగొచ్చింది.  ఇప్పుడు.. అంగుళీయకం పోకున్నా.. అతిలోక సుందరీమణులెందరో అందాల పోటీల కోసం భాగ్యనగరానికి తరలిరానున్నారు.  ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక ‘మిస్‌ వరల్డ్‌ 2025’ నిర్వహణకు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది.

మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ–హబ్, శిల్పకళావేదిక.. ఇలా పలు వేదికల్లో సుందరీమణులు వారి ప్రత్యేకతను చాటుకుని జగజ్జేతగా నిలిచేందుకు పోటీ పడనున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పోటీలు కావడంతో భాగ్యనగర పేరు ప్రఖ్యాతులు కూడా మరింత విశ్వవ్యాప్తం కానున్నాయి.

గతంలో రెండుసార్లు.. 
    మన దేశంలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. 1996లో తొలిసారి బెంగళూరు ఇందుకు వేదికైంది. ఆ తర్వాత గతేడాదే 71వ ఎడిషన్‌ పోటీలకు ముంబై ఆతిథ్యమిచ్చింది. ఇక వరుసగా రెండోసారి.. 72వ ఎడిషన్‌కు కూడా మన దేశమే వేదిక కానుంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు ఘనంగా ఉన్నా, భారీ జనసందోహంలో కార్యక్రమాలు జరిగేవి కాదు. అయితే గతేడాది ముంబైలో జరిగినప్పుడు, ఈ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారు.

దీంతో మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులకు ఇది క్రేజీగా కనిపించింది. దీంతో మరోసారి భారత్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. నిర్వాహకులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు అప్పగించింది. ఆమె నిర్వాహకులను ఒప్పించడంలో సఫలీకృతం కావడంతో హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడే ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది.

అప్పటి నుంచే ఆయన నిర్వాహకులతో సంప్రదింపులకు సన్నాహాలు ప్రారంభించారు. కాగా ఈసారి 140 దేశాల  సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఆయా కార్యక్రమాలను కవర్‌ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 3,300 మంది మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు.  

బికినీలకు నో..  
    ప్రపంచ సుందరి పోటీల్లో పలు అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. వాటిల్లో కొన్నింటిలో బికినీల్లాంటి వ్రస్తాలు ధరించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో శరీరాన్ని ప్రదర్శించే విధంగా వస్త్రధారణ ఉండొద్దని ప్రభుత్వం నిర్వాహకులకు ముందుగానే షరతు విధించింది. ఆయా దేశాల సంప్రదాయ, కాస్త ఆధునిక వ్రస్తాలు ధరించొచ్చని, ఒక పోటీలో పూర్తిగా భారతీయ సంప్రదాయ వ్రస్తాలే ధరించాలని సూచించింది. దీనికి నిర్వాహకులు అంగీకరించారు.   

గచ్చిబౌలి స్టేడియం టూ హైటెక్స్‌.. 
    అందాల పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే 6, 7 తేదీల్లో నగరానికి చేరుకుంటారు. 10న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక ఘనంగా జరుగుతుంది. తెలంగాణ జానపద, గిరిజన నృత్యాభినయ ఇతివృత్తంతో ఇది ఉంటుంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం, టీ–హబ్, శిల్పకళావేదిక, ఐఎస్బీ క్యాంపస్, హైటెక్స్‌ వేదికల్లో వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయి. వాటిని మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులే ఎంచుకున్నారు.  

రాష్ట్రంలో పర్యటనలు ఇలా.. 
    పోటీలు జరిగే సమయంలో సుందరీమణులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ సందర్భంలో వారందరితో పోచంపల్లి చీరలు కట్టించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వారిని తీసుకెళుతుంది. 40 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందాన్ని ఒక్కోచోటకు తీసుకెళ్తారు. 

బుద్ధవనం: 12న ఓ బృందం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం సందర్శిస్తుంది. బౌద్ధం ఇతివృత్తంగా ఇది సాగుతుంది.  
చార్మినార్‌: 13న సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఓ బృందం చార్మినార్, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తుంది. అక్కడ షాపింగ్‌ చేస్తారు.  
చౌమొహల్లాలో డిన్నర్‌: 13న చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రత్యక్ష సంగీత విభావరి నడుమ పోటీదారులు విందులో పాల్గొంటారు.  
కాళోజీ కళాక్షేత్రం: 14న అమెరికా–కరేబియన్‌ ప్రాంతాల పోటీదారులు వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 నుంచి 2 వరకు అక్కడ స్థానికులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు.  

రామప్ప: సాయంత్రం 5 నుంచి 7 వరకు యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పేరిణి నృత్యరీతులతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు.  
యాదగిరిగుట్ట: యూరప్‌నకు చెందిన పోటీదారుల బృందం 15న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యాదగిరిగుట్ట దేవాలయాన్ని సందర్శిస్తుంది.  
పోచంపల్లి: యూరప్‌నకు చెందిన రెండో బృందం 15న సాయంత్రం యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ గుర్తించిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు.  

మెడికల్‌ టూరిజం: 16న ఆఫ్రికా, మధ్య ప్రాచ్య (మిడిలీస్ట్‌) దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్‌ టూర్‌లలో భాగంగా నగరంలోని అపోలో, ఏఐజీ, యశోదా ఆసుపత్రులను సందర్శిస్తారు.  
స్పోర్ట్స్‌ ఫైనల్‌: స్పోర్ట్స్‌ ఫైనల్‌ కార్యక్రమం 17న ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు గచి్చబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుంది.  
కల్చరల్, మ్యూజిక్, డాన్స్, ఫుడ్‌ ఆర్ట్‌ : 17న సాయంత్రం నగర శివారులోని ఎకో టూరిజం పార్కులో జరిగే కల్చరల్, ఫుడ్, ఆర్ట్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.  

సేఫ్టీ టూరిజం: నగరంలో పోలీసింగ్‌ తీరును పరిశీలించేందుకు 19న పోటీదారులు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శిస్తారు.  
సచివాలయం: 19న హుస్సేన్‌సాగర్‌ తీరం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం ప్రాంతాలను సందర్శిస్తారు.  

టీహబ్‌: 20, 21 తేదీల్లో టీహబ్‌లో మిస్‌ వరల్డ్‌ కరేబియన్, మిస్‌ వరల్డ్‌ ఆఫ్రికా, మిస్‌ వరల్డ్‌ ఏషియా, ఓషియానియాల మధ్య కాంటినెంటల్‌ ఫినాలే ఉంటుంది.  
శిల్పారామం: 21న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు శిల్పారామంలో ఆర్ట్స్‌ క్రాఫ్టŠస్‌ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు.  
శిల్పకళావేదిక: 22న శిల్పకళావేదికలో టాలెంట్‌ ఫినాలే జరుగుతుంది.  

ఐఎస్బీ: గచ్చిబౌలిలోని ఐఎస్బీలో 23న హెడ్‌ టూ హెడ్‌ ఛాలెంజ్‌ ఫినాలే జరుగుతుంది.  
హైటెక్స్‌: 24న హైటెక్స్‌లో మోడల్‌ అండ్‌ ఫ్యాషన్‌ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్‌లోనే 25న నగలు వజ్రాభరణాల ఫ్యాషన్‌ షో జరుగుతుంది.  

బ్రిటిష్‌ రెసిడెన్సీ: 26న బ్రిటిష్‌ రెసిడెన్సీ, తాజ్‌ ఫలక్‌నుమాలలో పర్పస్‌ ఈవెంట్‌ గలా డిన్నర్‌ ఉంటుంది. ప్రముఖ కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఉంటుంది.  
హైటెక్స్‌: మే 31న పోటీల తుది పోరు (గ్రాండ్‌ ఫినాలె). సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది.  

రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి 
    ఈసారి పరేడ్‌ మైదానంలో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి సందడి చేయనుంది. మే 31న జరిగే తుదిపోరులో ఏ దేశానికి చెందిన సుందరి విజేతగా నిలుస్తుందో ఆమె.. జూన్‌ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు అంగీకరించారు.

మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకున్న సుందరితో పాటు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మొదటి, రెండో రన్నరప్‌లు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. పరేడ్‌ మైదానంలో జరిగే ముఖ్య కార్యక్రమాలతో పాటు ఆరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి కూడా వారు హజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ గవర్నర్‌ ఏర్పాటు చేసే హై టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement