
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.
మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్‌వాక్..
ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్‌పోచంపల్లికి మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్‌వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
మిస్‌వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్‌వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్‌ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.
ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు.
విజయ విహార్‌లో విడిది
ప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్‌లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్‌వరల్డ్ పోటీదారులు సాగర్‌లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్‌లోని గదులను ఆధునీకరిస్తున్నారు.
రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు.
ఆధ్యాత్మిక నగరికి..
మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు.
విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment