
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్‌లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.
వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్‌లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్‌లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు.
చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనం
ఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment