తెలంగాణ అన్నవరం.. యాదగిరిగుట్ట | devotees satyanarayana swamy vratham in Yadagirigutta | Sakshi
Sakshi News home page

తెలంగాణ అన్నవరం.. యాదగిరిగుట్ట

Published Tue, Nov 26 2024 8:34 AM | Last Updated on Tue, Nov 26 2024 8:34 AM

devotees satyanarayana swamy vratham in Yadagirigutta

కార్తీకమాసంలో సత్యదేవుని వ్రతాలకు ప్రసిద్ధి

ఇతర రాష్ట్రాలనుంచి భారీగా భక్తులు  

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థానం

సత్యనారాయణస్వామి వ్రతాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం.. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం క్షేత్రం తర్వాత.. ఆ స్థాయిలో యాదగిరిగుట్టలోనే వ్రతాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏటా లక్షకు పైనే వ్రతాలు నిర్వహిస్తుండటం విశేషం. కార్తీకమాసం, శ్రావణమాసంలో వ్రతాలు ఆచరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వ్రత పూజల కోసం కొండ దిగువన అధునాతన మండపం నిర్మించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఏటేటా వ్రతాల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ మంచే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల భక్తులు వచ్చి వ్రత పూజలు చేస్తున్నారు.     – సాక్షి, యాదాద్రి

రోజూ అయిదు బ్యాచ్‌లుగా వ్రతాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు  నిర్వహించుకునేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన వ్రత మండపంలో శ్రీస్వామి ఫొటోతో కూడిన పీటలు ఏర్పాటు చేశారు. టికెట్‌పై భక్తులకు పూజా సామగ్రిని దేవస్థానం అందజేస్తుంది. రోజూ ఐదు బ్యాచ్‌ల్లో వ్రతాలు జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో 700 జంటలు వ్రతాలు ఆచరించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వ్రత సమయాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. వ్రతాలు జరుగుతున్న సమ యంలో భక్తుల కుటుంబసభ్యులు.. మండపం బయట నీడలో కూర్చునేందుకు ప్రత్యేకంగా జర్మనీ టెంట్‌ ఏర్పాటు చేశారు. వ్రతాల అనంతరం కొండపై ప్రసాదాల కొనుగోలుకు ఇబ్బంది కలగకుండా.. వ్రత మండపం పక్కనే ప్రత్యేక ప్రసాదం కౌంటర్‌ ఏర్పాటు చేశారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్రతాలు పూర్తికాగానే వ్రత మండపం హాళ్లను పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. భక్తుల వాహనాలకు హెలిపాడ్‌ స్థలంలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు.

ప్రత్యేక ప్రసాదాల కౌంటర్‌
కార్తీకమాసంలో యాదగిరిగుట్ట క్షేత్రంలో పెద్ద సంఖ్యలో వ్రతాలు జరుగుతాయి. భక్తు లకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. ఈసారి కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి ఆదివారం వరకు 16 వేల వ్రతాలు జరిగాయి. కార్తీక మాసం చివరి వరకు భక్తులు వస్తూ వ్రతాలు ఆచరిస్తుంటారు. భక్తులు ఇబ్బంది పడకుండా వ్రత మండపం వద్ద ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్‌ ఏర్పాటు చేశాం.    
– భాస్కర్‌రావు, ఈవో, 

యాదగిరిగుట్ట దేవస్థానం సకల శుభాలు కలుగుతాయి
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు వ్రతాలు చేస్తున్నారు. కార్తీకమాసంలో వ్రతాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడ శివకేశవులు కొలువై ఉన్నారు. కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది.     
– నర్సింహమూర్తి, దేవస్థానం అర్చకుడు

వ్రతం చేయిస్తే పుణ్యం 
నా తల్లిదండ్రులతో కలి సి వ్రత పూజకు వస్తాను. ప్రతి కార్తీక మాసంలో, వీలైనప్పుడు యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆ లయంలో వ్రతం చేయించి మొక్కులు తీర్చుకుంటాం. ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వ్రతం చేశాం. 
– స్వర్ణలత, బాలానగర్‌

పదేళ్లుగా వ్రతం చేస్తున్నాం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అలయంలో వ్రత పూజ చేస్తే మంచి జరుగుతుందని భావించి ప్రతి కార్తీక మాసంలో ఆలయానికి వస్తాం. కార్తీక మాసంలోనే మా వివాహ వార్షికోత్సవం కావడంతో కలిసి వస్తోంది. వ్రత పూజ చేసిన తరువాత శివుడిని, లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుంటాం. 
– వందనపు కరుణశ్రీ, సంస్థాన్‌ నారాయణపురం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement