మంగళం నారసింహాయా | Mangalam narasinhaya | Sakshi
Sakshi News home page

మంగళం నారసింహాయా

Published Mon, Mar 3 2014 12:26 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM

మంగళం నారసింహాయా - Sakshi

మంగళం నారసింహాయా

  •      నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
  •      పూర్తయిన ఏర్పాట్లు, కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం
  •      స్వామి అలంకారాల కోసం అర్చకులతోపాటు ప్రత్యేకంగా70 మంది రుత్విక్కులు, పారాయణికుల నియామకం
  •  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. సోమవారం స్వస్తివాచనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పదకొండు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో స్వామివారు వివిధ అలంకారాలలో దర్శనమివ్వనున్నారు.
     
    యాదగిరికొండ, న్యూస్‌లైన్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని  ఆలయ తిరువీధులలో కాషాయం, తెలుపు కలిగిన వస్త్రాన్ని ఏర్పాటు చేశారు. సంగీత భవనానికి మరమ్మతులు పూర్తి చేశారు. ఆలయంలో స్వామివారిని అలంకారం చేసేందుకు ఆలయ అర్చకులతోపాటు 70 మంది రుత్విక్కులు, పారాయణికులను నియమించారు. కొండపై మంచినీటి వసతి కల్పించారు. అదనంగా బస్సు సౌకర్యం కల్పించారు. విద్యుద్దీపాలతో ఆలయం వెలుగులీనుతోంది.
     
    క్షేత్ర మహిమ

    పూర్వకాలంలో రుష్యశృంగుడి కుమారుడైన యాదరుషి లక్ష్మీ నరసింహస్వామి కోసం ఘోరమైన తపస్సును ఆరంభిస్తాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ముందుగా ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవాలని సలహా ఇస్తాడు. ఆ మేరకు ఆంజనేయస్వామి కోసం తపస్సు చేశాడు. యాదరుషి చేసిన తపస్సుకు మెచ్చి ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతాడు. ఆయనతో యాదరుషి నేను లక్ష్మీ నరసింహుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు ఆరంభించాను.. అం దుకు నేను చేస్తున్న ఈ గిరికి నీవు  క్షేత్రపాలకుడిగా ఉంటూ రక్షించాలని కోరుతాడు. అందుకు ఆంజనేయస్వామి సరేనని ఆభయమిస్తాడు.

    అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలపాటు లక్ష్మీనర్సింహస్వామి కోసం యాదరుషి తపస్సు చేయగా చివరికి స్వామివారు ప్రత్యక్షమవుతారు. నీకు ఏం వరం కావాలో కోరుకోమనగా అందుకు యాదరుషి ఈ గిరిపై అమ్మవారితో సహా ఇక్కడే ఉండాలని కోరుకుంటాడు. అప్పటి నుం చి స్వామివారు అమ్మవారితో సహా స్వయంభూవుగా వెలిశారని స్కంధ పురాణం చెబుతుంది. అప్పటి నుం చి ఈగిరిపై జ్వాలా నరసిహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, గండ బేరుండ నరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి, యోగానంద నరసింహస్వామిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ గిరిపై నీ వు తపస్సు చేశావు కావున ఇకనుంచి ఈ గిరి యాదగిరి అని పేరు వస్తుందని స్వామి వరం ఇచ్చాడు.    
     
    బ్రహ్మోత్సవాల నిత్య కార్యక్రమాల విశిష్టత


     స్వస్తి వాచనం : 11 రోజుల బ్రహ్మోత్సవాలకు ప్రారంభం గా మొదటి రోజు ఆది పూజ్యుడైన విశ్వక్సేనుడిని ఆరాధించి ఈ కార్యక్రమాలకు ఎ టువంటి అడ్డంకులూ రాకుండా చేయాలని కోరడం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆ లయ తిరువీధులు, గర్భాలయాన్ని  శుద్దమైన గంగాజలంతో సంప్రోక్షణ చేస్తారు.
     
     మృత్స్యంగ్రహణం : మట్టిని తెచ్చి స్వామివారి కల్యాణ మండపాలను నిర్మాణం చేయడం.
     
     అంకురార్పణ : తెచ్చిన మట్టిని 19 మట్టి చిప్పలలో పోసి వాటిలో నవధాన్యాలను వేస్తారు. వాటికి మొలకలు తెస్తారు. దేశం సస్యశ్యామలం కావాలంటే ఈ నవధాన్యాలు ఎంత తొందరగా మొలకెత్తితే దేశం అంత సుభిక్షంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది.
     
     ధ్వజారోహణం : ఈ బ్రహ్మోత్సవాలు సకల దేవతలకు స్వామి వారి గరుడ వాహనం ఆహ్వానం పలకడమే ఈ ధ్వజారోహణం ఉద్దేశం
     
     భేరీపూజ : సకల దేవతలను రాగ, తాళయుక్తంగా ఆహ్వానించడం
     
     దేవతాహ్వానం : బ్రహ్మోత్సవాలలో స్వామి, అమ్మవారి కల్యాణానికి బంధుమిత్ర సపరివార సమేతంగా ముక్కోటి దేవతలను ఆహ్వానించడం. అనంతరం అలంకార సేవలు ప్రారంభించి ఆలయ తిరువీధులలో ఊరేగిస్తారు. 9వ తేదీన ఎదుర్కోలు మహోత్సవం కల్యాణ మహోత్సవానికి ముందుగా అమ్మవారి తరఫున, స్వామి వారి తరఫున నిశ్ఛయ తాంబూలాదులను స్వీకరించి కట్నకానుకల విషయాలను సవివరంగా మాట్లాడుకుని వివాహానికి సన్నద్ధం కావడం.
     
     బంగారు విగ్రహాలకు బ్రహ్మోత్సవ శోభ


     యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇటీవల చినజీయర్ స్వామీజి చేతుల మీదుగా ప్రతిష్టింపజేసిన బంగారు విగ్రహాలకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు బంగారు విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సుమారు రూ.40 లక్షలతో కిలోన్నర బంగారంతో ఈ స్వామి, అమ్మవార్ల విగ్రహాలను తయారు చేయించారు. వందేళ్లుగా బ్రహ్మోత్సవాల సంబరాన్ని అందించిన పాత విగ్రహాల చెంతనే నూతన బంగారు విగ్రహాలకు బ్రహ్మోత్సవాలు నిర్వహించి రత్విక్కులు, పారాయణికులతో వేలాది జపాలు ధారపోయాలని ఆలయ అర్చకులు యోచిస్తున్నారు.
     
     అఖండజ్యోతికి ఘన స్వాగతం


     యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రచారం రథంలోని అఖండజ్యోతికి స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ బర్కత్‌పురాలో ప్రారంభమైన ఈ అఖండ జ్యోతి ఐదు రోజులుగా గ్రామాగ్రామాన తిరుగుతూ ప్రచారం చేస్తూ ఆదివారం రాత్రి యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ  సందర్భంగా దేవస్థానం ఆ ధ్వర్యంలోని ఈ రధానికి శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య మహిళలు మంగళహారతులతో నీరాజనాలు సమర్పిం చారు. స్వామివారికి పూ లమాలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం విష్ణు సహస్రనా మ పారాయణంతో కొం డపైకి వీడ్కోలు తెలి పారు. కార్యక్రమంలో  దేవస్థానం చైర్మన్ బి.నరసింహామూర్తి, ఈఓ కృష్ణవేణి, శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య అధ్యక్షుడు ముడుంబై నరసింహాచార్యులు, పరాశరం రామాచార్యులు, కొడకండ్ల శేషాచార్యులు,  మరింగంటి రామాచార్యులు పాల్గొన్నారు.
     
     లక్ష్మీ నరసింహస్వామి దివ్య శ్లోకాలు
     ఉగ్రం వీరం మహా విష్ణుం నృసింహం భీషణం
     భద్రం మృత్యుమృత్యునమామ్యహం
     
     యేకేన చక్రం అపరేణ  కరేణ శంఖం  
     అన్యేన సింధు తనయాంఅవలంభం తిష్టన్
     వామే కరేణ వరదా భయ హస్త ముద్రాం
     లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంభం
     
     మాతా నృసింహశ్చ పితా నృసింహ
     భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః
     విద్యా నృసింహో ద్రవిణం నృసింహః
     స్వామి నృసింహస్సకలం  నృసింహః   
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement