కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్‌ | Tamil Nadu BJP Annamalai flogs himself At Coimbatore home | Sakshi
Sakshi News home page

కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్‌

Published Fri, Dec 27 2024 11:50 AM | Last Updated on Sat, Dec 28 2024 4:56 AM

Tamil Nadu BJP Annamalai flogs himself At Coimbatore home

కోయంబత్తూర్‌/చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్‌ కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో డీఎంకే ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన నివాసం వెలుపల అన్నామలై పచ్చని ధోతీ ధరించి, చొక్కా లేకుండానే కొరడాతో పదే పదే కొట్టుకున్నారు. 

ఆయన చుట్టూ గుమికూడిన బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి బాధితురాలి ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు లీక్‌ చేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై గురువారం అన్నామలై మీడియా సమావేశంలో పాదరక్షలను వదిలేశారు. తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచబోమని కూడా చెప్పారు.

 డీఎంకే ప్రభుత్వం పాల్పడిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 48 రోజులపాటు ఉపవాసంతో ఉండి రాష్ట్రంలోని ఆరు ప్రముఖ మురుగన్‌ ఆలయాలను దర్శించుకుంటానని తెలిపారు. ఉత్తరం–దక్షిణ రాజకీయాలు బూచిగా చూపుతూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డీఎంకే సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే రాజకీయాలు చూసి రోత పుడుతోందని అన్నామలై చెప్పారు.

 అన్నామలై వర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన గుణశేఖరన్‌ పాతనేరస్తుడు. అతడు డీఎంకే వ్యక్తి కాబట్టే, పోలీసులు ఇప్పటిదాకా క్రిమినల్‌ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను లీక్‌ చేయడం బాధితురాలిని అవమానించడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. అయితే, అన్నామలై చర్య నవ్వు తెప్పించేలా ఉందని డీఎంకే వ్యాఖ్యానించింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement