Anna University
-
1,72,000 క్రితం నాటి నది ఆనవాళ్లు గుర్తింపు
జైపూర్: లక్షా డెభ్బై రెండు వేల(1,72,000) సంవత్సరాల క్రితం రాజస్తాన్‌లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్రవాహంలో కనుమరుగైన “నది”ఆనవాళ్లను పరిశోధకులు తాజాగా ఆధారాలతో సహా కనుగొన్నారు. ఈ ప్రాంతంలో మానవులు నివసించేందుకు.. నాగరికత అభివృద్ధి చెందేందుకు ఈ నది ఒక జీవనరేఖగా ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. పరిశోధన వివరాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. సెంట్రల్ థార్ ఎడారిలోని నల్ క్వారీలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిపిన పరిశోధనలు నది కార్యకలాపాల దశను సూచించాయి. ఇక ఈ అధ్యాయన ప్రకారం రాతియుగం నాటి మానవులు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించినట్లు తెలుస్తోంది. కనుమరుగైన నది సమీప ఆధునిక నదికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా పరిశోధనలో తేలింది. (చదవండి: వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!) ‘లుమినిసెన్స్ డేటింగ్’ ద్వారా ఇక కనుమరుగైన నదీ సమాచారం గురించి నల్ గ్రామానికి సమీపంలోని క్వారీ నుండి వెల్లడైన ఇసుక, కంకరల లోతైన నిక్షేపాన్ని ఈ బృందం అధ్యయనం చేసింది. అదేవిధంగా పరిశోధకులు వివిధ నిక్షేపాలను అధ్యయనం చేయడం ద్వారా వివిధ దశల నది కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయగలిగారు. నది ఇసుకలోని క్వార్ట్జ్ గ్రేయిన్స్ ఎప్పుడు ఖననం అయ్యాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ‘లుమినిసెన్స్ డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి ఫ్లూవియల్ నిక్షేపాల దిగువన చాలా చురుకైన నది వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు అచ్యుతన్ చెప్పారు. సుమారు 172 వేల సంవత్సరాల క్రితం నల్ వద్ద బలమైన నది కార్యకలాపాలు జరిగాయని ఫలితాలు సూచించాయన్నారు. సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించే నది పాలియోలిథిక్ జనాభాకు లైఫ్ లైన్‌గా ఉందని.. వలసలకు ముఖ్యమైన కారిడార్‌గా ఉండేదని వారు తెలిపారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల అధ్యయనం కూడా థార్ ఎడారి గుండా ప్రవహించిన నది మార్గాల నెట్‌వర్క్‌ను చూపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనాలు గతంలో నదులు, ప్రవాహాలు ఎక్కడ ప్రవహించాయో సూచించగలవే కానీ అవి ఎప్పటివి అన్న విషయం మాత్రం చెప్పలేవని అన్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ అన్నారు. (చదవండి: గులాబీ రంగులోకి మంచు.. కారణం!) థార్ ఎడారికి గొప్ప చరిత్ర ఉందని పరిశోధకులు తెలిపారు. రాతియుగ జనాభా ఈ అర్ధ-శుష్క ప్రకృతిలో మనుగడ సాగించడమే కాకుండా ఎలా అభివృద్ధి చెందిందో చూపించే అనేక రకాల సాక్ష్యాలను తాము వెలికితీస్తున్నట్లు ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ శాస్ర్తవేత్త జింబోబ్ బ్లింక్‌హార్న్ తెలిపారు. చరిత్ర పూర్వంలోని కీలక కాలంలో నదీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మనకు చాలా తక్కువ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి హోమో సేపియన్ల ప్రారంభ విస్తరణలతో ఈ నది ముడిపడి ఉన్నట్లుగా తెలిపారు. -
ఇంజనీరింగ్ సిలబస్‌లో భగవద్గీత
సాక్షి, చెన్నై: వర్సిటీ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో భగవద్గీత పాఠాలను బోధించాలని తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తూ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. అయితే వర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాల పథకంలో ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఉన్నతస్థాయి కమిటీ మార్పులు, చేర్పులు, మరింత మెరుగులు దిద్దడం వంటివి చేపడుతుంటుంది. ఏఐసీటీఈ రూపొందించిన పాఠ్యాంశాల పథకాన్ని ఇంజినీరింగ్ కాలేజీలు అమలుచేస్తుంటాయి. అయితే అన్నావర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ పాఠ్యాంశాల పథకాన్ని మాత్రం వర్సిటీనే తయారుచేసుకుంటుంది. ఇదిలాఉండగా ఈ ఏడాది జూన్‌లో ఏఐసీటీఈ విడుదల చేసిన మార్గనిర్దేశం ప్రకారం ఇంజనీరింగ్ విద్యలోని 32 పాఠ్యాంశాల్లో మూడింటిని ఆప్షన్ సబ్జెక్టులుగా ఎన్నుకుని 3,4,5వ సెమిస్టర్లో చదవాలని చెప్పింది. సమాజంలో వృత్తివిద్య, విలువలు, నాణ్యత, ధర్మం, మెరుగైన జీవనవిధానం, ఫొటోగ్రఫీ, వీడియోతీసి సమకూర్చుకోవడం 32 పాఠ్యాంశాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. అన్నావర్సిటీ పరిధిలోని కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్టింగ్ అండ్ ప్లానింగ్, అళగప్ప కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, క్రోంపేటలోని మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ నాలుగు కాలేజీల్లో ఫస్ట్ ఇయర్‌లోని విద్యార్థులు పాఠ్యాంశాలను ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇందులో వేదాంత పాఠ్యాంశంలో సంస్కృతం, భగవద్గీతకు సంబం ధించిన పాఠాలు చోటుచేసుకున్నాయి. వీటిని విద్యార్థులు తప్పనిసరిగా చదవాలని వర్సిటీ సూచించింది. ఈ రెండింటినీ ఇంజనీరింగ్ విద్యలో చేర్చడం చర్చనీయాంశమైంది. దీంతో వర్సిటీ కొన్ని సవరణలు చేసేందుకు సిద్ధమైంది. వేదాంత విభాగంలోని సంస్కృతం, భగవద్గీత పాఠ్యాంశాలపై నిర్బంధాన్ని సడలించి ఆప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు వర్సిటీ వీసీ సూరప్ప తెలిపారు. స్టాలిన్ ఖండన.. అన్నాయూనివర్సిటీ పాఠ్యాంశాల్లో సంస్కృతం, భగవద్గీతలను చేర్చి విద్యార్థులపై బలవంతంగా రద్దుతున్నారని డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. అన్నావర్సిటీ సీఈజీ క్యాంపస్‌లో 2019 సంవత్సర పాఠ్యపుస్తకాల్లో వేదాంతపాఠాలను నిర్బంధంగా చేర్చడం పైగా దానికి ‘భారత్‌లో విదేశీస్థాయి ఆధ్యాత్మిక చదువులు’ అని పేరుపెట్టడాన్ని తన ట్విట్టర్ ద్వారా ఆయన ఖండించారు. -
అన్నా వర్సిటీ ఉన్నతాధికారిణి సస్పెండ్
సాక్షి, చెన్నై: ఫెయిలయిన విద్యార్థుల నుంచి లంచం తీసుకుని పునఃమూల్యాకంనంలో పాస్ చేయించిన చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉమపై సస్పెన్షన్ వేటు పడింది. పరీక్షల విభాగంలో అక్రమాలపై 50 మంది విద్యార్థులను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) శుక్రవారం విచారించింది. రీ వాల్యుయేషన్‌లో లంచం తీసుకుని విద్యార్థుల్ని పాస్ చేసిన ఘటన వెలుగచూడడం తెల్సిందే. దీంతో అన్నా వర్సిటీ ఉన్నతాధికారులు ఉమను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ మాట్లాడుతూ ఈ కేసులో ఏ ఒక్కర్నీ వదిలేదలేదని స్పష్టంచేశారు. -
మనీతో మార్కులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడ్డారు. డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు మార్కులు వేసి పాస్ చేశారు. ఇలా ఏళ్లుగా సాగుతున్న ఈ దందా మెరిట్ విద్యార్థుల ఫిర్యాదుతో బయటపడింది. అధికారులు వసూలు చేసిన మొత్తం రూ.240 కోట్లు ఉంటుందని దర్యాప్తులో తేలింది. ఇంజినీరింగ్, మెడికల్ తదితర ప్రధాన కోర్సులు చదివే విద్యార్థులు సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైనా, ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చినా పునః మూల్యాంకనం (రీవాల్యుయేషన్) కోసం దరఖాస్తు చేస్తారు. గత ఏడాది 12 లక్షల మంది సెమిస్టర్ పరీక్షలు రాశారు. వారిలో 3,02,380 మంది రీవాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశారు. రీవాల్యుయేషన్ చేపట్టిన అధికారులు అదనంగా 73,733 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు 16,630 మందికి అదనపు మార్కులొచ్చాయి. మొత్తంగా 90,369 మంది లబ్ధి పొందారు. ఈ విషయమై పలువురు విద్యార్థులు అవినీతినిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు. ముడుపులు అందుకుని అదనపు మార్కులు వేస్తున్నట్లు కొందరు దళారుల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు రహస్య విచారణ చేపట్టగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తేలింది. ఈ దందా 2011 నుంచి జరుగుతున్నట్లు గుర్తించారు. 2011–16కాలంలో దాదాపు 12 లక్షల మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 5 లక్షలమందికి అదనపు మార్కులొచ్చాయి. ఈ ఐదు లక్షల మందిలో ఎంత మంది విద్యార్థులు లంచాలు ఇచ్చి లబ్ధి పొంది ఉంటారని ఆరాతీస్తున్నారు. ఒక్కో సెమిస్టర్‌కు రూ.45 కోట్ల వరకు విద్యార్థుల నుంచి అధికారులు వసూలు చేసినట్లు తేలింది. మార్కుల పునఃపరిశీలన పేరుతో గత మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకుగాను దాదాపు రూ.240 కోట్లు స్వాహా చేసినట్లు భావిస్తున్నారు. దీంతో అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్ శాఖలో ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులు అన్నా యూనివర్సిటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 2015–18 మధ్యకాలంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా వ్యవహరించిన ఉమ సహా పదిమందిపై కేసులు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్లు, వర్సిటీ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయగా అదనపు మార్కుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, స్థిరాస్తుల పత్రాలు లభించాయి. మరిన్ని ఆధారాలను వర్సిటీ అధికారులు ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. -
ఎవరికి ఎక్కువ హెచ్1బీ వీసాలంటే....
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో హెచ్1 బీ వీసా సాధించిన విద్యార్థుల్లో ఎక్కడ చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని అడిగితే ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా హైదరాబాద్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అన్న సమాధానం తరచుగా వస్తుంది విద్యార్థుల నుంచి స్కాలర్ల నుంచి. ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ కార్యాలయం నుంచి సేకరించిన వివరాలను పరిశీలిస్తే అవాక్కవుతాం. 2017 సంవత్సరానికి అమెరికా మొత్తం 85 వేల హెచ్1 బీ వీసాలను విడుదల చేయగా, అందులో 20 వేల వీసాలు భారతీయ విద్యార్థులకు లభించాయి. వాటిలో ఏకంగా 850 వీసాలు చెన్నైలోని అన్నా యూనివర్శిటీ విద్యార్థులకు రాగా, 747 వీసాలు హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీకి లభించాయి. మనం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 63 వీసాలు రాగా, బిర్లా యూనివర్శిటీకి 61 వీసాలు వచ్చాయి. దీనివల్ల ఎక్కువ వీసాలు వచ్చిన యూనివర్శిటీలే ఐఐటీ, ఐఐఎంలకన్నా విద్యా ప్రమాణాల్లో ముందున్నాయని అనుకుంటే పొరపాటు. ఏడాదికి ఐఐటీ విద్యార్థులు 12వేల మందికన్నా తక్కువ మంది హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే అన్నా యూనివర్శిటీ చెందిన వారు దాదాపు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. లాటరీ ద్వారా వీసాలను ఎంపిక చేస్తారు కనుక, ఎక్కువ విద్యార్థులున్న యూనివర్శిటీకి ఎక్కువ వీసాలు లభించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువ వీసాలు సాధించిన విద్యార్థుల జాబితాలో దేశంలోని ఐఐటీలు మొదటి 25 స్థానాలకు ఆక్రమించడం విశేషమే. -
తీగ లాగితే...డొంక కదిలింది
అన్నా వర్సిటీ వీసీగా రాజారాం, అంబేడ్కర్ న్యాయ వర్సిటీ వీసీగా వనంగా ముడిగతంలో సాగించిన అవినీతి బండారం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ఇళ్లల్లో సాగిన దాడుల మేరకు లభించిన సమాచారాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేశాయి. ఈ ఇద్దరి అవినీతికి హద్దే లేదన్నట్టుగా ఏసీబీకిఆధారాలు చిక్కి ఉండడం గమనార్హం. అలాగే, ప్రొఫెసర్ల నియామకం, విదేశీ కోటా సీట్ల కేటాయింపుల్లో సాగిన అక్రమాలుబయటపడ్డాయి. ఇందులో ఓ సెలబ్రెటీ సైతం తెరమీదకు వచ్చాడు. అమ్మ జయలలిత నెచ్చెలి, అమ్మ మున్నేట్ర కళగం ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ సోదరుడు జయరామన్, వదిన ఇలవరసి పుత్రుడువివేక్ను ఏసీబీ తమ జాబితాలో చేర్చిఉండడం చర్చకు దారితీసింది. జయ టీవీ సీఈవోగా ఉన్న వివేక్ ఎల్ఎల్బీనిఅక్రమమార్గంలోనే పూర్తిచేసినట్టుగాఏసీబీ గుర్తించింది. సాక్షి, చెన్నై : ఓ కేసులో తీగ లాగితే.. డొంక కదిలినట్టు చిన్నమ్మ మేనల్లుడు వివేక్ ఎల్ఎల్బీ బండారం బయటపడింది. విదేశీ కోటాలో ఎల్ఎల్బీని చెన్నైలో ఆయన పూర్తిచేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీబీ ఆయన మీదే కాదు, మరో 75మంది మీద గురిపెట్టింది. అలాగే, ఆరుగురు అన్నా వర్సిటీ ప్రొఫెసర్ల మీద సైతం కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రొఫెసర్లు అన్నా వర్సిటీలో రాజారాం పర్యవేక్షణలో 21 మంది ప్రొఫెసర్లు, 33 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో 54 సహాయ ప్రొఫెసర్ల నియమకాలు గతంలో జరిగి ఉన్నాయి. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ తీవ్ర విచారణలో నిమగ్నం అయింది. ఇందులో మంగళవారం నాటికి ఆరుగురు అనర్హుల్ని అధికారులు గుర్తించారు. వారి మీద కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురు అసిస్టెంట్, ఒక సహాయ, ఒక ప్రొఫెసర్ ఉండడం గమనార్హం. వీరంతాఆయా పదవులకు అనర్హులే అయినా, రాజా రాం చేతివాటం రూపంలో అర్హులుగా అవతరించారని తెలిసింది. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పుచ్చుకుని వీరికి రాజారాం అర్హత కల్పించినట్టు ఏసీబీ గుర్తించింది. ఆరుగురి మీద కేసు నమోదు చేశారు. వీరిలో బయోమెట్రికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జయ శ్రీ, కెమికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెలన్, ఎలక్ట్రానిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలమురుగన్, మెటీరియల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మందాకిని, అరివానందన్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ విజయలక్ష్మి ఉన్నారు. కేసు నమోదుతో వీరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, మరో 14 మంది పేర్లు సైతం ఏసీబీ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివేక్ మెడకు ఎల్ఎల్బీ ఉచ్చు అంబేడ్కర్ న్యాయ కళాశాలలో సాగిన అక్రమాలపై ఏసీబీ తీవ్ర విచారణ సాగిస్తోంది. వనంగాముడితో పాటుగా అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్న ప్రొఫెసర్ శర్వాణి, రిజిస్ట్రార్ బాలాజీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశంకర్, పరిపాలనాధికారి రమేష్ మీద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎల్ఎల్బీ ఉచ్చు చిన్నమ్మ మేనళ్లుడు వివేక్ మెడకు తగలడం గమనార్హం. అంబేడ్కర్ వర్సిటీలో ప్రతి ఏటా పదిహేను శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించేవారు. గతంలో సాగిన కేటాయింపుల్లో 75 మంది విద్యార్థులు అక్రమంగా విదేశీ కోటా సీట్లను చేజిక్కించుకున్నట్టు ఎసీబీ గుర్తించింది. వీరి జాబితా సిద్ధం చేయగా, అందులో వివేక్ పేరు తెర మీదకు వచ్చింది. విదేశీ కోటా సీట్లను అక్రమంగా పొంది వివేక్ ఎల్ఎల్బీ పూర్తి చేసినట్టు గుర్తించారు. దీంతో ఆ 75 మంది విద్యార్థులతో పాటు వివేక్ పేరును తమ జాబితాల్లోకి ఎక్కించి విచారణకు సిద్ధం అయ్యారు. ఇక, ఒక్కో విద్యార్థి ఎన్ఆర్ఐ కోటా నిమిత్తం రూ.20 లక్షల వరకు వనంగాముడి అండ్ బృందానికి చెల్లించినట్టు విచారణలో వెలుగు చూసి ఉండడం గమనార్హం. -
అలా అద్భుతం జరిగిపోయింది!
మానవత్వంపైనా.. ప్రస్తుత సమాజంపైనా కొంతమందిలో అపోహలు అలాగే ఉండిపోయాయి. ఏరోజుకు ఆరోజు మారిపోయే పత్రికల హెడ్డింగులు చూసి దేశం ఎక్కడికి వెళ్లిపోతోందో అని బాధపడిపోయే తలకాయలూ ఉన్నాయి. ఎక్కడా అవినీతే తప్ప.. మంచితనం, మంచి మనుషులు మచ్చుకైనా కనిపించడం లేదని వాపోయే కొంతమందికి ఊరట కలిగించడానికా అన్నట్టు గతేడాది మన దేశంలో ఓ అద్భుతం జరిగిపోయింది. ఇప్పటికి తలచుకున్నా అది అద్భుతంగానే ఉంటుంది! 2015 ఆగస్టు 8.. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరిసరాల్లో దారి తప్పి తిరుగుతున్నారు ఇద్దరు తల్లీకూతుళ్లు. తల్లి పేరు తంగపొన్ను, కుమార్తె పేరు స్వాతి. బీఎస్సీలో చేరేందుకు కౌన్సెలింగ్ కోసం యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక తెలిసింది వారికి.. కౌన్సెలింగ్ చెన్నైలో కాదు కోయంబత్తూర్‌లో అని! అంతే.. వారి గుండెలు బద్దలయ్యాయి. స్వాతి కన్నీటిధారలు ఆగడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ అమ్మాయి. తెల్లవారు జాము ఆరున్నర గంటలు కావస్తోంది. కొంతమంది వ్యాయామం కోసం యూనివర్సిటీ గ్రౌండ్లోకి వచ్చారు. స్వాతిని, తంగపొన్నుని చూశారు. దగ్గరకు చేరి ఏమైందో ఆరా తీశారు. జరిగిందంతా వారికి అర్థమైంది. స్వాతి రికార్డులు పరిశీలించారు. బ్రిలియంట్ స్టూడెంట్! ఆ అమ్మాయి కెరీర్ నాశనం కాకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ వ్యక్తి తన కారులో వారిని విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. తన సొంత డబ్బులతో వారిని కోయంబత్తూర్ ఫ్లైట్ ఎక్కించాడు. వారు మార్గమధ్యంలో ఉండగా మరికొందరు కోయంబత్తూర్‌లోని రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. జరిగినదంతా చెప్పారు. రిజిస్ట్రార్ మనసు కూడా కరిగిపోయింది. కానీ, ముందురోజే కౌన్సెలింగ్ ముగిసిపోయిందని, మరో గంటలో చేరుకోగలిగితే తాను చేయాల్సింది చేయగలనని ఆయన చెప్పాడు. ఉదయం 7.50లోగా రిజిస్ట్రార్ దగ్గరకు చేరుకోవాలి. దీంతో స్వాతి, తంగపొన్ను విమానం దిగగానే వారికోసం కొందరు వాహనాలతో కాపలా కాశారు. అనుకున్న సమయానికే అక్కడకు చేరుకునేలా చేశారు. రిజిస్ట్రార్ కూడా ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచడంతో స్వాతికి అడ్మిషన్ దొరికింది. అంతే.. ఆ నిరుపేద కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. గొర్రెల కాపరిగా జీవితం గడుపుతోన్న తంగపొన్ను తన కుమార్తెకు సీటు లభించడం చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఇది కాదంటారా అద్భుతమంటే..!!