తీగ లాగితే...డొంక కదిలింది | VK Sasikala nephew benefitted in Tamil Nadu varsity NRI scam | Sakshi
Sakshi News home page

తీగ లాగితే...డొంక కదిలింది

Published Wed, Mar 28 2018 10:39 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

VK Sasikala nephew benefitted in Tamil Nadu varsity NRI scam - Sakshi

శశికళ , మేనళ్లుడు వివేక్‌

అన్నా వర్సిటీ వీసీగా రాజారాం, అంబేడ్కర్‌ న్యాయ వర్సిటీ వీసీగా వనంగా ముడిగతంలో సాగించిన అవినీతి బండారం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ఇళ్లల్లో సాగిన దాడుల మేరకు లభించిన సమాచారాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేశాయి. ఈ ఇద్దరి అవినీతికి హద్దే లేదన్నట్టుగా ఏసీబీకిఆధారాలు చిక్కి ఉండడం గమనార్హం. అలాగే, ప్రొఫెసర్ల నియామకం, విదేశీ కోటా సీట్ల కేటాయింపుల్లో సాగిన అక్రమాలుబయటపడ్డాయి. ఇందులో ఓ సెలబ్రెటీ సైతం తెరమీదకు వచ్చాడు. అమ్మ జయలలిత నెచ్చెలి, అమ్మ మున్నేట్ర కళగం ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ సోదరుడు
జయరామన్, వదిన ఇలవరసి పుత్రుడువివేక్‌ను ఏసీబీ తమ జాబితాలో చేర్చిఉండడం చర్చకు దారితీసింది. జయ టీవీ సీఈవోగా ఉన్న వివేక్‌ ఎల్‌ఎల్‌బీనిఅక్రమమార్గంలోనే పూర్తిచేసినట్టుగాఏసీబీ గుర్తించింది.

సాక్షి, చెన్నై : ఓ కేసులో తీగ లాగితే.. డొంక కదిలినట్టు చిన్నమ్మ మేనల్లుడు వివేక్‌ ఎల్‌ఎల్‌బీ బండారం బయటపడింది. విదేశీ కోటాలో ఎల్‌ఎల్‌బీని చెన్నైలో ఆయన పూర్తిచేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీబీ ఆయన మీదే కాదు, మరో 75మంది మీద గురిపెట్టింది. అలాగే, ఆరుగురు అన్నా వర్సిటీ ప్రొఫెసర్ల మీద సైతం కేసులు నమోదయ్యాయి.

ఆరుగురు ప్రొఫెసర్లు
అన్నా వర్సిటీలో రాజారాం పర్యవేక్షణలో 21 మంది ప్రొఫెసర్లు, 33 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మరో 54 సహాయ ప్రొఫెసర్ల నియమకాలు గతంలో జరిగి ఉన్నాయి. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ తీవ్ర విచారణలో నిమగ్నం అయింది. ఇందులో మంగళవారం నాటికి ఆరుగురు అనర్హుల్ని అధికారులు గుర్తించారు. వారి మీద కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురు అసిస్టెంట్, ఒక సహాయ, ఒక ప్రొఫెసర్‌ ఉండడం గమనార్హం. వీరంతాఆయా పదవులకు అనర్హులే అయినా, రాజా రాం చేతివాటం రూపంలో అర్హులుగా అవతరించారని తెలిసింది.  రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పుచ్చుకుని వీరికి రాజారాం అర్హత కల్పించినట్టు ఏసీబీ గుర్తించింది. ఆరుగురి మీద కేసు నమోదు చేశారు. వీరిలో బయోమెట్రికల్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జయ శ్రీ, కెమికల్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హెలన్, ఎలక్ట్రానిక్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బాలమురుగన్, మెటీరియల్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మందాకిని, అరివానందన్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ విజయలక్ష్మి ఉన్నారు. కేసు నమోదుతో వీరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, మరో 14 మంది పేర్లు సైతం ఏసీబీ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

వివేక్‌ మెడకు ఎల్‌ఎల్‌బీ ఉచ్చు
అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో సాగిన అక్రమాలపై ఏసీబీ తీవ్ర విచారణ సాగిస్తోంది. వనంగాముడితో పాటుగా అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్న ప్రొఫెసర్‌ శర్వాణి, రిజిస్ట్రార్‌ బాలాజీ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌  అశోక్‌కుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జయశంకర్, పరిపాలనాధికారి రమేష్‌ మీద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎల్‌ఎల్‌బీ ఉచ్చు చిన్నమ్మ మేనళ్లుడు వివేక్‌ మెడకు తగలడం గమనార్హం. అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రతి ఏటా పదిహేను శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాకు కేటాయించేవారు. గతంలో సాగిన కేటాయింపుల్లో 75 మంది విద్యార్థులు అక్రమంగా విదేశీ కోటా సీట్లను చేజిక్కించుకున్నట్టు ఎసీబీ గుర్తించింది.  వీరి జాబితా సిద్ధం చేయగా, అందులో వివేక్‌ పేరు తెర మీదకు వచ్చింది. విదేశీ కోటా సీట్లను అక్రమంగా పొంది వివేక్‌ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినట్టు గుర్తించారు. దీంతో ఆ 75 మంది విద్యార్థులతో పాటు వివేక్‌ పేరును తమ జాబితాల్లోకి ఎక్కించి విచారణకు సిద్ధం అయ్యారు. ఇక, ఒక్కో విద్యార్థి ఎన్‌ఆర్‌ఐ కోటా నిమిత్తం రూ.20 లక్షల వరకు వనంగాముడి అండ్‌ బృందానికి చెల్లించినట్టు విచారణలో వెలుగు చూసి ఉండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement