LLB
-
నేనూ అమ్మ... క్లాస్మేట్స్.. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని...
‘‘చదువుకోవడం ఎప్పుడూ బాగుంటుంది... అమ్మతో కలిసి కాలేజ్‌కి వెళ్లడం, పరీక్షలకు ప్రిపేర్ అవడం ఇంకా బాగుంది’’ అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. పీహెచ్డీ సహా పలు డిగ్రీలు అందుకుని అటు చదువులో ఇటు క్రీడల్లోనూ పిన్న వయస్కురాలిగా ఎన్నో విజయాలు లిఖించిన నైనా... తాజాగా తన తల్లి భాగ్యలక్ష్మి తో కలిసి ఎల్ఎల్బీ లో చేరింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో అమ్మకు క్లాస్మేట్గా తన అనుభవాలను పంచుకున్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని... ‘‘నాన్న (అశ్విన్) న్యాయవాది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన్ను గమనించేదాన్ని. న్యాయ స్థానాల్లో వాదోపవాదాలు ఆసక్తిగా అనిపించేవి. అయితే ‘లా’ ను కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం క్రీడాకారిణిగా బిజీగా ఉన్నాను. ఎల్ఎల్బీ తర్వాత నా సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను. దానికి లా చదవడం కొంత మేర ఉపకరిస్తుందని భావించాను. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారని, తొలి మార్గదర్శకత్వం తమదే ఉండాలని మా పేరెంట్స్ అభిప్రాయం. అందుకే వీలైన అన్ని అంశాల్లో వాళ్లు ముందడుగు వేసి ఆ తర్వాత మాకు తగిన గైడెన్స్ ఇస్తుంటారు. పదకొండేళ్ల టీనేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సహకరించడం కోసం నాన్న నా కన్నా ముందే మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా సాధించి, ఆ తర్వాత నాకు సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నేను లా చేద్దామని అనుకున్నప్పుడు మా అమ్మగారు (భాగ్యలక్ష్మి జైస్వాల్) నాకు తోడయ్యారు. మా అమ్మ ఇప్పటికే ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేశారు. క్రీడల్లో బిజీగా ఉండే నాకు సపోర్ట్‌గా ఉండడానికి తాను కూడా లా విద్యార్థినిగా మారారు. ఫ్రెండ్స్‌లా ఉన్నాం... నాతోపాటు అమ్మ కూడా లా కోర్సులో జాయిన్ అవడం నాలో కొత్త ఉత్సాహం తెచ్చింది. బాగ్ లింగంపల్లిలోని ‘బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్’ లో మా న్యాయశాస్త్ర విద్యాభ్యాసం సాగింది. మేం ఇద్దరం తల్లీకూతుళ్లుగా క్లాస్మేట్స్గా ఉండడం చూసి అందరూ షాక్ అయ్యేవారు(నవ్వుతూ). ఇద్దరం కలిసి చదువుకోవడం, కేస్ స్టడీస్ అధ్యయనం చేయడం, పరీక్షలు రాయడం వైవిధ్యభరిత అనుభూతి అనే చెప్పాలి. అమ్మతో కలిసి చదువుతుంటే ఫ్రెండ్స్‌లా, ఇద్దరం ఈక్వల్ అన్నట్టే అనిపించింది. చదువంటే విజ్ఞానం అమ్మతో కలిసి మళ్లీ మరో కోర్సు చేసే అవకాశం వస్తే నేనైతే వెంటనే ఓకే అంటాను. నేను భవిష్యత్తులో లాయర్ అవుతానో లేదో చెప్పలేను. మా కుటుంబం దృష్టిలో... చదువు అంటే డిగ్రీలు కాదు... విజ్ఞానం సంపాదించడం, దాన్ని నిత్యజీవితంలో మన ఎదుగుదలకి ఉపయోగపడేలా చేసుకోవడం’’ అన్నారు నైనా జైస్వాల్. -
ఓవైపు ఎల్ఎల్బీ చదువుకుంటూనే.. పరాటాలమ్మాయ్!!
మగవాళ్లు ఎంతో సులభంగా చేసే పరాటాను డిగ్రీ చదువుతోన్న 23 ఏళ్ల అమ్మాయి అలవోకగా చేసేస్తోంది. హోటల్ నడుపుతోన్న కుటుంబానికి సాయం చేసేందుకు కేరళకు చెందిన అనశ్వర పదేళ్ల వయసు నుంచే పరాటాలు తయారు చేస్తూ, మరోపక్క కాలేజికి వెళ్లి శ్రద్ధగా చదువుకుంటోంది. కేరళలోని ఎరుమెలి గ్రామానికి చెందిన అనశ్వర, ఆల్ అజర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ ఫైనలియర్ చదువుతోంది. తన రోజు వారి సమయంలో సగభాగాన్ని చదువుకు, మరికొంత భాగాన్ని తన కుటుంబం నడుపుతున్న ‘హోటల్ ఆర్యా’’లో పనిచేయడానికి కేటాయిస్తోంది. శబరిమల వెళ్లేదారిలో కురువమూజి జంక్షన్లో ఉన్న ఈ హోటల్‌ను యాభై ఏళ్ల క్రితం అనశ్వర అమ్మమ్మ, తాతయ్యలు నారాయణి కుట్టప్పన్‌లు ప్రారంభించారు. వాళ్ల తరువాత గత ముప్ఫై ఏళ్లుగా అనశ్వర అమ్మ, పిన్ని సత్య కుట్టప్పన్‌లు హోటల్‌ను నిర్వహిస్తున్నారు. వీరికి హోటల్ పనుల్లో అనశ్వర చేదోడు వాదోడుగా ఉంటోంది. చదవండి: నోరూరించే ఫిష్ కట్లెట్ విత్ రైస్, ఆనియన్ చికెన్ రింగ్స్ తయారీ..కొంచెం వెరైటీగా! పదేళ్ల వయసులోనే అనశ్వర... అమ్మ పరాటాలు ఎలా చేస్తుందో ఆసక్తిగా గమనించేది. పిండిని గుండ్రంగా ఉండలు చేసే టెక్నిక్‌ను తన కజిన్ నుంచి నేర్చుకుని పరాటాలు ఫర్ఫెక్ట్గా చేయడం మొదలు పెట్టింది. అప్పటినుంచి దాదాపు 13 ఏళ్లుగా రోజుకు దాదాపు రెండు వందల పరాటాలు చేస్తోంది. వేగంగా చక్కగా పరాటాలు చేయడంతో అనశ్వరని అందరూ ముద్దుగా ‘పరాటా’ అని పిలుస్తున్నారు. ఉదయం ఏడున్నర నుంచి అమ్మకు పరాటాలు చేయడంలో సాయంచేసి, తరువాత కాలేజికి వెళ్తుంది. కాలేజి నుంచి వచ్చాక మళ్లీ అమ్మకు భోజనం తయారీలో సాయం చేస్తుంది. హోటల్లో పనిచేయడానికి పనివాళ్లు ఎవరూ లేకుండా కుటుంబ సభ్యులే చూసుకోవడం విశేషం. అనశ్వర పరాటాల గురించి తెలిసిన స్నేహితులు కూడా వాటిని రుచిచూసేందుకు హోటల్‌కు వస్తుంటారు. పరాటాలు రుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబకి ఆర్డర్లు చేయడం, కస్టమర్ల కోరిక మేరకు డోర్ డెలివరి కూడా చేయడం విశేషం. ‘‘పరాటాలు చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ పని చేయడానికి సిగ్గుపడను. భవిష్యత్‌లో చెఫ్ అయ్యే ఆలోచనలు ప్రస్తుతానికి ఏమిలేవు. తాతయ్యల కాలం నాటి హోటల్‌ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్‌లో ఎల్ఎల్ఎమ్ తర్వాత, పీహెచ్డీ చేస్తాను’’ అని అనశ్వర చెప్పింది. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్ఎల్ బీ, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్–2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు సాధిం చారని తెలిపారు. వర్సిటీ వీసీ డి.జమున, లాసెట్ కన్వీనర్ చంద్రకళ, రెక్టార్ డి.శారద, రిజిస్ట్రార్ మమత పాల్గొన్నారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో హరిప్రియకు మొదటి ర్యాంకు మూడేళ్ల ఎల్ఎల్బీలో మోపూరు హరిప్రియ (విజయవాడ రూరల్) మొదటి ర్యాంకు పొందారు. ఏపీ ట్రాన్స్‌కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మోపూరు హరిప్రియ 53 ఏళ్ల వయసులో ఈ ర్యాంక్ సాధించడం విశేషం ఎల్.రాజా (గుంటూరు) రెండో ర్యాంకు, కె.హరికృష్ణ (అనంతపురం) మూడో ర్యాంకు సాధించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీకి సంబంధించి ఎం.మౌనిక బాయి (బనగానపల్లె, కర్నూలు జిల్లా) మొదటి ర్యాంకు పొందారు. వి.నాగసాయి ప్రశాంతి (రణస్థలం, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, సునీల్ (పూసపాటిరేగ, విజయనగరం జిల్లా) మూడో ర్యాంకు సాధించారు. ఇక రెండేళ్ల ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్షలో వై.గీతిక (విశాఖపట్నం) మొదటి ర్యాంకు పొందారు. కె.కృష్ణమ నాయుడు (ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, టి.రమేష్ బాబు (విజయవాడ) మూడో ర్యాంకు సాధించారు. -
7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలుసా?
షేర్ మార్కెట్లో లేదా ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెడితే డబ్బులే డబ్బులని హుషారుగా పరుగెడతారు కొందరు. కానీ ఒక్కోసారి ఆశించిన స్థాయిలో లాభం ముట్టదు. ఇప్పుడిది పాత పద్ధతంటున్నాడు ఈ రైతు. నిజమండి..!! తాను పెట్టిన పెట్టుబడికి 7 సంవత్సరాల్లో అక్షరాల 4 రెట్ల లాభం అర్జించనున్నాడు. కేవలం వ్యవసాయం ద్వారా అంత మొత్తం ఎలా సంపాదిస్తున్నాడో? అంత వింతగా ఏం పండించాడో? అదెలా సాధ్యమైందో మీరూ తెలుసుకోండి.. ఎల్ఎల్బీ చదివినప్పటికీ.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరికి చెందిన సాకేతు గ్రామంలో నివసిస్తున్న 65 యేళ్ల సురేశ్ చంద్ర వర్మ బీఏ, ఎల్ఎల్బీ చదువుకున్నాడు. ఐతే వ్యవసాయం పట్ల మక్కువ కలిగిన వర్మ తన పూర్వికుల ద్వారా సంక్రమించిన భూమిలో రకరకాల పంటలను పండించడం ప్రారంభించాడు. చెరకు, వరి, గోధుమ వంటి పంటలు పండించడంలో ఆరితేరాడు. అంతేకాకుండా మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ వంటి ఉద్యాన పంటల సాగులోనూ నిష్ణాతుడే. అంతర పంటల ద్వారా కూడా అధిక లాభాలను ఆర్జించాడు. కేవలం రూ. 25 లకే.. నాలుగేళ్ల క్రితం పంత్నగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి 234 వెదురు మొక్కలను కేవలం రూ. 25 ల చొప్పున కొని ఎకరం భూమిలో నాటాడు. ఐతే ఈ నాలుగేళ్లలో ఒక మొక్క 20 నుంచి 25 వెదురు బొంగులను ఉత్పత్తి చేసింది. అంతేకాకుండా మూడేళ్లపాటు సహపంటగా చెరకును కూడా దీనితో పాటుగా పండించాడు. నాలుగో యేట నుంచి మాత్రం కేవలం వెదురును మాత్రమే కొనసాగించాడు. ప్రస్తుతం దున్నే పనుల్లో ఉంది. ఏడు సంవత్సరాలకు రూ. 17 లక్షలు ఇలా.. ఈవిధంగా ప్రతి మొక్కకు 40 నుంచి 50 వరకు వెదురు వచ్చే అవకాశం ఉంది. పల్లెటూరులో ఒక వెదురు బొంగు రూ.150లు పలుకుతుంది. ఈ విధంగా ప్రతి మొక్కకు 50 వెదుర్లు ఉత్పత్తి అయితే 234 మొక్కలకు 11 వేల 7 వందల వెదుర్లు వస్తాయి. ఒక వెదురును రూ.150లకు అమ్మితే మొత్తంగా రూ. 17 లక్షల 55 వేలు లాభం చేతికొస్తుంది. రేటు కొంచెం ఎక్కువ పలికితే లాభం మరింత పెరగొచ్చు. ఇప్పుడర్థమైందా.. ఈ చదువుకున్న రైతు చేసిన అద్భుతం. చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!! -
ఎల్ఎల్బీ ఎందుకు చదవకూడదు?
న్యూఢిల్లీ : మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు చదివేందుకు చేసుకున్న దరఖాస్తును కళాశాల అధికారులు తిరస్కరించారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కు మారి త్యాగి(77) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) పెట్టిన 30 ఏళ్ల వయో పరిమితి నిబంధన తనకు గల రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్ఎల్బీకి గరిష్ట వయోపరిమితి 20, మూడేళ్ల ఎల్ఎల్బీకి 30 ఏళ్ల వయోపరిమితి విధిస్తూ బీసీఐ ఇటీవల నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తమకున్న ఎస్టేట్‌ను కాపాడుకోవడానికి లా చదవాలని అనుకుంటున్నట్లు సాహిబా బాద్‌కు చెందిన రాజ్‌కుమారి త్యాగి పేర్కొన్నారు. బీసీఐ నిబంధనలతో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు, ఏ వృత్తినైనా చేపట్టే హక్కు, జీవించే హక్కులకు భంగం కలుగుతున్నాయని ఆ పిటిషన్లో తెలిపారు. -
ఆశలకు ఆస్ట్రేలియా రెక్కలు
స్రష్టవాణి బెంగళూరులోని రేవా న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చేస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాలోని వొలొంగాంగ్ యూనివర్శిటీలో బిఎల్ డిగ్రీ చదవటానికి అర్హత సంపాదించారు. ‘చేంజ్ ద వరల్డ్’ పేరుతో ఆ విశ్వవిద్యాలయం ప్రకటించిన అరవై లక్షల రూపాయల స్కాలర్ షిప్ అందుకోనున్నారు. ఆ స్కాలర్షిప్కు దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 1.52 లక్షల మందిలో ఆ అరుదైన అవకాశాన్ని స్రష్టవాణి మాత్రమే దక్కించుకున్నారు. ఆ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘భారతీయ చట్టాలు, రాజ్యాంగంతోపాటు విదేశీ చట్టాలు, శిక్షల గురించి కూడా తెలుసుకోవటం మీద నాకు ఆసక్తి ఎక్కువ. బెంగళూరులో న్యాయవిద్యలో చేరిన నాటి నుంచే ఎలాగైనా విదేశాలకు వెళ్లాలని ఉండేది. అక్కడి చదువంటే లక్షలాది రూపాయలతో పని. నాన్న అరవింద్‌కుమార్ జర్నలిస్టు, అమ్మ ఆశ గృహిణి. మాది సాధారణ కుటుంబం. అందువల్ల నా ఆశ నెరవేరుతుందా అనుకునేదాన్ని. నాలుగో సెమిస్టర్ చదువుతున్నప్పుడు ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వొలొంగాంగ్ అందించే ‘ఛేంజ్ ద వరల్డ్’ స్కాలర్షిప్ గురించి తెలిసి, దరఖాస్తు చేసుకున్నాను. ఇందుకోసం లక్షలమంది పోటీ పడతారు. జోక్ అనుకున్నాను నేను ఈ స్కాలర్షిప్కి ఎంపికైనట్లు నాన్న చెప్పగానే మొదట జోక్ చేస్తున్నారనుకున్నాను. యూనివర్సిటీ ప్రతినిధుల నుంచి ఫోన్ వచ్చి, నిజమని తెలిశాక నా ఆనందం ఇంతా అంతా కాదు. అమ్మానాన్నలను గట్టిగా హత్తుకున్నాను. ఈ స్కాలర్షిప్కి న్యాయవిద్య చదువుతున్నవారే అర్హులు. ఇదొక్కటే చాలదు. బాల్యంలోని వ్యక్తిగత విశేషాలు, చదువులో చూపిన మెరుగైన ప్రతిభను కూడా పరిగణనలోకి తీసుకుని, పరీక్షిస్తారు. ‘న్యాయవిద్యతో మీరు ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారో వివరిస్తూ రెండు నిమిషాల వీడియో పంపండి’ అని కోరటంతో, నా అభిప్రాయాలు చెప్పగలిగాను. నాకున్న పుస్తక పరిజ్ఞానం, అనేక సామాజిక అంశాలపై ఉన్న అవగాహన కారణంగా విశ్వవిద్యాలయ అధికారులు అడిగిన ప్రశ్నలకు సులభంగా సమాధానాలు చెప్పగలిగాను. వీటితోపాటు నా అభిరుచులు, నడవడిక, చేతిరాత కూడా ఈ ఎంపికలో ప్రధాన అంశాలుగా నిలిచాయనుకుంటాను. మేఘం.. రైతు.. కవిత చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవటం బాగా అలవాటు. ఆరోతరగతి చదువుతున్నప్పుడు మేఘాలకీ, రైతుకీ ఉండే సంబంధం గురించి హిందీలో రాసిన కవిత స్కూల్ మ్యాగజీన్లో అచ్చయింది. అది చూసుకున్న రోజు చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. అప్పటినుంచి కవితలు రాస్తూనే ఉన్నాను. తాజాగా ‘మూన్లైట్ ఆఫ్ ది నూన్’ పేరుతో ఒక కవితల సంపుటాన్ని తీసుకొచ్చాను. ఇది నాకు మంచిపేరు తెచ్చి పెట్టింది’’ అని తెలిపారు స్రష్టవాణి. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
నిన్న మాతృమూర్తి..నేడు న్యాయమూర్తి!
పట్టుదల, సంకల్పం ముందు కొండంత లక్ష్యం చిన్న బోతుందనేందుకు అతి చిన్నవయస్సులోనే జూనియర్ జడ్జిగా ఎంపికైన భార్గవి ఓ ఉదాహరణ. పెళ్లయిన తర్వాత కూడా చదువును కొనసాగించారీమె. భర్త ఇచ్చిన ప్రోత్సాహం, ప్రేరణతో ఎల్ఎల్బీ పూర్తిచేసి తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. ఈ విజయం కేవలం ప్రణాళిక.. టైం మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యమయ్యాయంటారీమె.. మదనపల్లె/తంబళ్లపల్లె : ‘చిన్నప్పటి నుంచి నాకు చదువంటే చాలా ఆసక్తి. ఉన్నతస్థానంలో ఉండాలనేది సంకల్పం. నాన్న రమణారెడ్డి ఆర్ఎంపీ వైద్యులు. అమ్మ ఏఎన్ఎం. మధ్య తరగతి వ్యవసాయకుటుంబం. తాతలు, తండ్రుల నుంచీ వ్యవసాయంపై ఆధారపడి జీవనం. కష్టాలు ఎదురైనా, ఎందరు విమర్శిం చినా బిడ్డను చదివిం చాలని నన్ను 30కి.మీ. దూరంలోని మదనపల్లెలో ఉంచి చదివించారు. బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో పెళ్లి చేశారు. పెళ్లి వల్ల నా లక్ష్య సాధన దెబ్బతినలేదు. పట్టుదలతో కొనసాగించాను. అమ్మగా మారడం.. బీఫార్మసీ తర్వాత ఏడాదిన్నర చదువులో గ్యాప్ ఏర్పడింది. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లికావడం జరిగింది. పెద్ద పాప రెండో తరగతి, చిన్నమ్మాయి ఎల్.కే.జి. చదువుతున్నారు. పిల్లలతో సమయం గడచిపోతున్నా మనసులో వెలితిగా ఉండేది. భర్త న్యాయవాద వృత్తిలో ఉండటం, కక్షిదారులు, సహచర న్యాయవాదులు, వాతావరణం, న్యాయమూర్తులకిచ్చే గౌరవం చూశాను. న్యాయవాద వృత్తిపై ఆసక్తిని పెంచాయి. మా ఆయన వృత్తిలో చూపే నిబద్ధత, నిజాయితీ, నైతికత ఆకర్షించాయి. న్యాయమూర్తిగానూ ప్రజాసేవ చేయవచ్చన్న భావన బలపడింది. కడపలోని బసవరాజ తారకం మెమోరియల్ లా కాలేజిలో ఎల్ఎల్బీ చేరాను. అక్కడ అధ్యాపకులు జావీద్ సార్ ఇచ్చిన గైడెన్స్, తోటి విద్యార్థుల ప్రోత్సాహంతో కాలేజిలో ఎప్పుడూ నేనే మొదటి స్థానంలో ఉండేదాన్ని. గత సంవత్సరం మార్చిలో ఫలితాలు రావడం, ప్రొవిజనల్ సర్టిఫికెట్ వచ్చిన పది రోజులలోపే జడ్జి పోస్టుల నోటిఫికేషన్ వెలువడటం, దరఖాస్తుకు చివరి రెండు రోజుల సమయం ఉందనగా హడావిడిగా అప్లికేషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. రోజుకు నాలుగు గంటలు.. ఇంటిపనులు చూసుకుంటూనే రోజుకు నాలుగు గంటలు పరీక్షకు సంబంధించిన పుస్తకాలను చదివేదాన్ని. ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకునేదాన్ని. విజయానికి అడ్డదారులు ఉండవని, కష్టపడటం, నిజాయితీనే మనకు గెలుపును తెచ్చి పెడతాయనే మాట నాకు స్ఫూర్తి.. అనుకున్నది సాధించగలిగాను. మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది మహిళలు పెళ్లవడంతో చదువును నిలిపేస్తుంటారు. చదవాలనే కోరిక, ఉన్నతస్థానాలకు చేరుకునే తపన ఉంటే ఎవరైనా విజయాలు సాధించవచ్చు. ముఖ్యంగా సమయపాలన ప్రధాన అంశం. టైమ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యం. పోటీ పరీక్షలకు అభ్యర్థులు నిరంతర సాధనకు అలవాటు పడాలి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకూడదు. విజయం దక్కుతుందనే నమ్మకంతో ముందుకు సాగాలి. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా ఇంగ్లిషులోనే అందుబాటులో ఉంటోంది. ప్రణాళిక, కష్టించే మనస్తత్వం, చదవడంలో నిజాయితీ ఉంటే తప్పక విజయం లభిస్తుంది. -
తీగ లాగితే...డొంక కదిలింది
అన్నా వర్సిటీ వీసీగా రాజారాం, అంబేడ్కర్ న్యాయ వర్సిటీ వీసీగా వనంగా ముడిగతంలో సాగించిన అవినీతి బండారం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ఇళ్లల్లో సాగిన దాడుల మేరకు లభించిన సమాచారాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేశాయి. ఈ ఇద్దరి అవినీతికి హద్దే లేదన్నట్టుగా ఏసీబీకిఆధారాలు చిక్కి ఉండడం గమనార్హం. అలాగే, ప్రొఫెసర్ల నియామకం, విదేశీ కోటా సీట్ల కేటాయింపుల్లో సాగిన అక్రమాలుబయటపడ్డాయి. ఇందులో ఓ సెలబ్రెటీ సైతం తెరమీదకు వచ్చాడు. అమ్మ జయలలిత నెచ్చెలి, అమ్మ మున్నేట్ర కళగం ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ సోదరుడు జయరామన్, వదిన ఇలవరసి పుత్రుడువివేక్ను ఏసీబీ తమ జాబితాలో చేర్చిఉండడం చర్చకు దారితీసింది. జయ టీవీ సీఈవోగా ఉన్న వివేక్ ఎల్ఎల్బీనిఅక్రమమార్గంలోనే పూర్తిచేసినట్టుగాఏసీబీ గుర్తించింది. సాక్షి, చెన్నై : ఓ కేసులో తీగ లాగితే.. డొంక కదిలినట్టు చిన్నమ్మ మేనల్లుడు వివేక్ ఎల్ఎల్బీ బండారం బయటపడింది. విదేశీ కోటాలో ఎల్ఎల్బీని చెన్నైలో ఆయన పూర్తిచేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీబీ ఆయన మీదే కాదు, మరో 75మంది మీద గురిపెట్టింది. అలాగే, ఆరుగురు అన్నా వర్సిటీ ప్రొఫెసర్ల మీద సైతం కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రొఫెసర్లు అన్నా వర్సిటీలో రాజారాం పర్యవేక్షణలో 21 మంది ప్రొఫెసర్లు, 33 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో 54 సహాయ ప్రొఫెసర్ల నియమకాలు గతంలో జరిగి ఉన్నాయి. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ తీవ్ర విచారణలో నిమగ్నం అయింది. ఇందులో మంగళవారం నాటికి ఆరుగురు అనర్హుల్ని అధికారులు గుర్తించారు. వారి మీద కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురు అసిస్టెంట్, ఒక సహాయ, ఒక ప్రొఫెసర్ ఉండడం గమనార్హం. వీరంతాఆయా పదవులకు అనర్హులే అయినా, రాజా రాం చేతివాటం రూపంలో అర్హులుగా అవతరించారని తెలిసింది. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పుచ్చుకుని వీరికి రాజారాం అర్హత కల్పించినట్టు ఏసీబీ గుర్తించింది. ఆరుగురి మీద కేసు నమోదు చేశారు. వీరిలో బయోమెట్రికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జయ శ్రీ, కెమికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెలన్, ఎలక్ట్రానిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలమురుగన్, మెటీరియల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మందాకిని, అరివానందన్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ విజయలక్ష్మి ఉన్నారు. కేసు నమోదుతో వీరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, మరో 14 మంది పేర్లు సైతం ఏసీబీ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివేక్ మెడకు ఎల్ఎల్బీ ఉచ్చు అంబేడ్కర్ న్యాయ కళాశాలలో సాగిన అక్రమాలపై ఏసీబీ తీవ్ర విచారణ సాగిస్తోంది. వనంగాముడితో పాటుగా అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్న ప్రొఫెసర్ శర్వాణి, రిజిస్ట్రార్ బాలాజీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశంకర్, పరిపాలనాధికారి రమేష్ మీద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎల్ఎల్బీ ఉచ్చు చిన్నమ్మ మేనళ్లుడు వివేక్ మెడకు తగలడం గమనార్హం. అంబేడ్కర్ వర్సిటీలో ప్రతి ఏటా పదిహేను శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించేవారు. గతంలో సాగిన కేటాయింపుల్లో 75 మంది విద్యార్థులు అక్రమంగా విదేశీ కోటా సీట్లను చేజిక్కించుకున్నట్టు ఎసీబీ గుర్తించింది. వీరి జాబితా సిద్ధం చేయగా, అందులో వివేక్ పేరు తెర మీదకు వచ్చింది. విదేశీ కోటా సీట్లను అక్రమంగా పొంది వివేక్ ఎల్ఎల్బీ పూర్తి చేసినట్టు గుర్తించారు. దీంతో ఆ 75 మంది విద్యార్థులతో పాటు వివేక్ పేరును తమ జాబితాల్లోకి ఎక్కించి విచారణకు సిద్ధం అయ్యారు. ఇక, ఒక్కో విద్యార్థి ఎన్ఆర్ఐ కోటా నిమిత్తం రూ.20 లక్షల వరకు వనంగాముడి అండ్ బృందానికి చెల్లించినట్టు విచారణలో వెలుగు చూసి ఉండడం గమనార్హం. -
మేయర్ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి
-
‘నాకు నీతులు చెప్పకు’
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్, కమిషనర్ మధ్య జరిగిన మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఇద్దరూ మహిళలు కావడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ మమతా పాండే, కమిషనర్ ప్రతిభా పాల్ పాల్గొన్నారు. ఈ సమయంలో మేయర్ మమతా పాండే ఇతరులతో మాట్లాడుతున్నారు. దీనిపై ఆగ్రహించిన కమిషనర్ ప్రతిభా పాల్.. ‘మేయర్ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి’ అంటూ చురకలు అంటించారు. కమిషనర్ తనను మందలించడంతో కోపం తెచ్చుకున్న మేయర్ మమతా పండే.. అంతే ఘాటుగా బదులిచ్చారు. నేను పోస్ట్ గ్యాడ్యుయేట్‌ని, ఎల్ఎల్బీ చదువుకున్నా.. నాకు నువ్వు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మమతా పాండే స్పష్టం చేశారు. అంతేకాక.. నీ హద్దుల్లో నువ్వు ఉండు.. అంటూ కమిషనర్ ప్రతిభకు చెప్పారు. వారిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల
- మూడేళ్ల కోర్సులో 90.7 శాతం ఉత్తీర్ణత - ఐదేళ్ల కోర్సులో 71 శాతం ఉత్తీర్ణత - ఎల్ఎల్ఎంలో 97.03 శాతం ఉత్తీర్ణత కేయూ క్యాంపస్: తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ 2017 ఫలితాలను టీఎస్ లాసెట్ చైర్మన్, కేయూ వీసీ ఆర్.సాయన్న, లాసెట్ కన్వీనర్ ఎం.వి.రంగారావు శనివారం వరంగల్‌లో విడుదల చేశారు. గత నెల 27న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సుకు 15,408మంది హాజరుకాగా, 13,955మంది అభ్యర్థులు(90.7 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,031మంది హాజరుకాగా, 2,893మంది (71.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఎల్ఎల్ఎం పీజీ కోర్సులో 1,750మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 1,698మంది అభ్యర్థులు(97.03«శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా మూడు కోర్సులకు కలిపి 21,189మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, 18,546 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (87.53శాతం) సా«ధించారు. ఈ సందర్భంగా వీసీ ఆర్.సాయన్న, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.వి.రంగా రావు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి 5వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 2 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. తెలంగాణలో ఎల్ఎల్ఎం కోర్సు 13 కళాశాలల్లో ఉండగా, కన్వీనర్ కోటాలో 524 సీట్లు ఉన్నాయన్నారు. ఎల్ఎల్బీ మూడేళ్ల లా కోర్సులు 21 కళాశాలల్లో ఉండగా కన్వీనర్ కోటాలో 2,590 సీట్లు ఉన్నాయన్నారు. ఐదేళ్ల లా కోర్సుకు సంబంధించి 14 కళాశాలల్లో ఉండగా అందులో 1176 సీట్లు ఉన్నాయని వారు తెలిపారు. లాసెట్ ఫలితాలు హెచ్‌టీటీపీ://లాసెట్.టీఎస్సీహెచ్ఈ. ఏసీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయ న్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని కూడా వెబ్సైట్లో పొందుపర్చామని చెప్పారు. -
ఎట్టకేలకు లాసెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: ఎట్టకేలకు లాసెట్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ విడుదలైంది. ఐదేళ్లు, మూడేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం పీజీ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 8 నుంచి కౌన్సెలింగ్ నిర్విహ ంచనున్నారు. రాష్ట్రంలో ఐదు కౌన్సెలింగ్ సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయగా, జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ నెల 8వ తేదీన 1 నుంచి 3 వేల ర్యాంకు మధ్య మూడేళ్ల ఎల్ఎల్బీ విద్యార్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. పరిశీలన పూర్తయిన విద్యార్థులు 10,11 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 3001 నుంచి చివరి ర్యాంకు వరకు 9న ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. విద్యార్థులు 11, 12 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం పీజీ కోర్సుకు సంబంధించి 10న ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. 12,13వ తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. న్యాయవిద్య కోర్సులో ప్రవేశ ఫీజు ఓసీ, బీసీలకు రూ.900, ఎస్సీ, ఎస్టీలకు రూ.450గా నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీ.... స్పోర్ట్సు, క్యాప్, ఎన్ఎస్ఎస్, ఫిజికల్ చాలెంజ్డ్ విద్యార్థులు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే సహాయ కేంద్రానికి హాజరుకావాల్సి ఉంటుంది. జిల్లాలో లా సీట్లు ఇలా.. జిల్లాలోని బీఆర్ఏయూలో మూడేళ్ల ఎల్ఎల్బీలో 60 సీట్లు, ఎల్ఎల్ఎంలో 20 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎంపీఆర్ లా కళాశాలలో మూడేళ్ల ఎల్ఎల్బీలో 60, ఐదేళ్ల ఎల్ఎల్ఎంలో 60 సీట్లు ఉన్నాయి. జిల్లాలో లాసెట్ రాసిన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 155 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 133 మంది హాజరయ్యారు. ఐదేళ్ల ఎల్ఎల్బీకి 38 మంది దరఖాస్తు చేసుకోగా 31 మంది పరీక్ష రాశారు. ఎల్ఎల్ఎంకు సంబంధించి విశాఖపట్నంలో పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి లా సెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్స్, మూడుసెట్ల జిరాక్సు కాపీలతో విద్యార్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి హాజరుకావాలి. షెడ్యూల్ మేరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన బీఆర్ఏయూలో షెడ్యూల్ మేరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ ఎల్ఎల్ఎం సెట్ రాసిన విద్యార్థులు ర్యాంకు మేరకు ఆయా తేదీల్లో హాజరుకావాలి. ధ్రువీకరణ పత్రాలు పరిశీలన తరువాత షెడ్యూల్ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సీటు ఎలాట్మెంట్ వివరాలు సెల్ నంబర్‌కు మెసెజ్ వస్తుంది. - డాక్టర్ కె.కృష్ణమూర్తి, న్యాయ విభాగం కోర్సు కోఆర్డినేటర్, బీఆర్‌ఏయూ -
మే 30న ‘లాసెట్’ రాత పరీక్ష
అనంతపురం: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల బీఎల్, ఐదేళ్ల ఎల్ఎల్బీ డిగ్రీ, రెండేళ్ల పీజీ ఎల్ఎల్ఎం, ఎంఎల్ ప్రవేశాలకు నిర్వహించే ‘లాసెట్-2015’ రాత పరీక్షలను మే 30న నిర్వహించనున్నట్లు లాసెట్ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య శేషయ్య వెల్లడించారు. ఎస్కేయూలోని ఏపీ లాసెట్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.350 ఫీజుతో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 7 వరకు రూ.500, మే 15 వరకు రూ.1,000, మే 23 వరకు రూ.1,500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. -
అమ్మకే ‘అమ్మ’ అతను..
దేవరకొండ : నిస్వార్థంగా కష్టపడి పెంచిన తల్లిదండ్రులను అనాథ శరణాయాల పాలుచేసే పుత్రరత్నా లు చాలామందే ఉంటారు. చనిపోయాక పున్నామ నరకం నుంచి తప్పిస్తారని ఆశించే తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేసే కొడుకులకు కొదవేలేదు. అలాంటి వారికి భిన్నం ఈ యువకుడు. జబ్బుతో బాధపడుతున్న తల్లికి నిత్యం సేవ చేస్తూ అమ్మ ప్రేమను మరిపిస్తున్నాడు దేవరకొండకు చెందిన యువకుడు పీడీ ఖాన్.పీడీ ఖాన్ ఉన్నతాభ్యాసం చేశాడు. కన్న తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి ఖాజాబి అన్నీ తానే అయింది. కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించింది. ఎంఏ. బీఈడీతో పాటు ఎల్ఎల్బీ కూడా పూర్తి చేసిన ఖాన్ ప్రభుత్వోద్యోగానికి ప్రయత్నించినా దొరకలేదు. దీంతో స్థానికంగానే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం తల్లి ఖాజాబి పెరాలసిస్ (పక్షవాతం) బారిన పడింది. దీంతోపాటు ఆమె వెన్నముక దెబ్బతినడంతో మంచం నుంచి లేవలేదు. కనీసం ఒక వైపునకు కూడా తిరగలేని పరిస్థితి. ఉన్న ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు మరణించడం, మరో కొడుకు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉండడంతో కన్న తల్లి భారం ఖాన్‌పై పడింది. ఖాన్ కూడా తల్లిని భారంగా భావించలేదు. తన బాధ్యతగా భావించాడు. కన్నతల్లికి అన్నీ తానే అయ్యాడు. నిత్యం తన అవసరాల కన్నా ముందుగా తల్లి అవసరాలు చూస్తున్నాడు. యూరిన్ బ్యాగ్ మార్చడంనుంచి తల్లి దుస్తులు ఉతకడం, పండ్లు తోమడం, అన్నం తినిపించడం వంటి అన్ని పనులు తానే చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది. అంతకుముందు తల్లి కారణంగా చాలా సంబంధాలు తప్పిపోయాయి. ఎక్కడ తల్లి బాధ్యత వారిపై పడుతుందోనని అతనికి పిల్లనివ్వడానికే చాలా మంది వెనుకంజ వేశారు. తన తల్లి కోసం ఉన్నత చదువులు చదువుకున్న ఖాన్‌కు వేరే ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినా నిరాకరించాడు. ఒకవైపు తల్లిని చూసుకోవడంతో సమయం గడిచిపోవడం.. పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవాడు. యాజమాన్యంతో కొంత ఇబ్బందులు పడ్డాడు. దీంతో చివరికి తానే 60మంది విద్యార్థులతో ఓ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. కన్న తల్లిని చూసుకోవడం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని, ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నా ఏ ఒక్క రోజు కన్న తల్లిని భారంగా భావించలేదంటున్నాడు ఖాన్. డబ్బు వ్యామోహంలో ఎంతోమంది కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాలు చేస్తున్న సంఘటనలు తనకు బాధ కలిగిస్తాయంటున్నాడు. ఏది ఏమైనా ఖాన్‌కు తల్లిపై ఉన్న ప్రేమ నిజంగా అనిర్వచనీయం. ఖాన్ ఎంతో మందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం. అమ్మకు సేవచేయడం నా భాగ్యం జన్మనిచ్చిన అమ్మకు సేవచేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. నేను ఏనాడూ మా అమ్మను భారంగా భావించలేదు. ఆమె పనులు చేశాకే నా పని మొదలుపెడతా. నా ప్రాణం ఉన్నంత వరకు మా అమ్మను ఇలాగే చూసుకుంటా. - పీడీ ఖాన్ -
కెరీర్‌కు వారధిని నిర్మించుకోండిలా..
న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించాలంటే సంబంధిత లా కోర్సులను ఎంచుకోవాలి. ఇటువంటి కోర్సులు బ్యాచిలర్ స్థాయి నుంచి ప్రారంభమవుతాయి. బ్యాచిలర్ స్థాయిలో కూడా అర్హతలను బట్టి రెండు రకాల కోర్సులు ఉన్నాయి. అవి.. ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్ల వ్యవధి గల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సు. బ్యాచిలర్ తర్వాత ఆసక్తి ఉంటే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా చేయవచ్చు. ఇందుకు సంబంధించి పలు రకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వివరాలు.. సివిల్/క్రిమినల్ లా, కాన్స్టిట్యూషన్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, హ్యూమన్ రైట్స్ లా, ఫ్యామిలీ లా, ట్యాక్సేషన్, కార్పొరేట్ లా, బిజినెస్ లా, ఇంటర్నేషనల్ లా, లేబర్ లా, రియల్ ఎస్టేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా/పేటెంట్ లా. ప్రవేశ పరీక్షలు: లా కోర్సులను అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశం పొందాలంటే ఆయా ఇన్స్టిట్యూట్లు నిర్వహించే రాత పరీక్షలకు హాజరు కావాలి. వివరాలు... లాసెట్: రాష్ట్రంలో న్యాయ విద్యనభ్యసించడానికి వీలు కల్పించే పరీక్ష లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సు, ఐదేళ్ల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సుల్లో లాసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం పొందొచ్చు. అర్హత: ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (10+2 విధానంలో) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి). మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. పరీక్ష విధానం: గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు, పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు, పార్ట్-సిలో లా ఆప్టిట్యూడ్‌పై 60 ప్రశ్నలుంటాయి. క్లాట్: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) ర్యాంక్‌తో హైదరాబాద్‌లోని నల్సార్ సహా 14 ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి లా కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు. అర్హత: ఇంటర్మీడియెట్. నోటిఫికేషన్: ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో వెలువడుతుంది. పరీక్షా విధానం: ఐదు విభాగాల్లో క్లాట్ నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్ (కాంప్రెహెన్షన్‌తో కలిపి-40 మార్కులు), జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ (50 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (20 మార్కులు), లీగల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), లాజికల్ రీజనింగ్ (40 మార్కులు). వీటికి 2 గంటల్లో సమాధానాలను గుర్తించాలి. వెబ్సైట్: www.clat.ac.in ఏఐఎల్ఈటీ: నేషనల్ లా యూనివర్సిటీ- న్యూఢిల్లీ, ఏఐఎల్ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్)ను నిర్వహిస్తుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు-బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్)లో ప్రవేశం పొందొచ్చు. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/తత్సమానం. పరీక్షా విధానం: మొత్తం ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలకు ఏఐఎల్ఈటీ ఉంటుంది. అవి..ఇంగ్లిష్ (35 ప్రశ్నలు); జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ (35 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (10 ప్రశ్నలు); లీగల్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్ (35 ప్రశ్నలు); వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. వెబ్సైట్: http://nludelhi.ac.in/ఎస్ఈటీ: సింబయాసిస్ లా స్కూల్లో బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఎస్ఈటీ (సింబయాసిస్ ఎంట్రన్స్ టెస్ట్). అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 45 శాతం) ఇంటర్మీడియెట్/తత్సమానం. వెబ్సైట్: www.set-test.org ఎల్‌శాట్: లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా(ఎల్‌శాట్) స్కోర్ ఆధారంగా దేశంలోని దాదాపు 40పైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. వీటిలో జిందాల్ గ్లోబల్ లా స్కూల్, అమిటీ లా స్కూల్, జోథ్‌పూర్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ వంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. పరీక్షా విధానం: నాలుగు విభాగాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఎల్‌శాట్ ఉంటుంది. అవి.. అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్-1, లాజికల్ రీజనింగ్-2, రీడింగ్ కాంప్రెహెన్షన్. వెబ్సైట్: www.pearsonvueindia.com ‘లా’.. సంప్రదాయ స్థాయి నుంచి కార్పొరేట్ దిశగా ప్రస్తుతం కెరీర్ పరంగా ‘లా’ సంప్రదాయ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయికి చేరుకుంటోంది. ‘లా’ గ్రాడ్యుయేట్లకు గ్లోబలైజేషన్ చక్కని వరంగా మారింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బహుళజాతి సంస్థలు అంతర్గతంగా లీగల్ డిపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేసి వాటిలో లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం ప్రముఖ న్యాయ కళాశాలల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ సైతం నిర్వహిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు రూ. లక్షల్లో వార్షిక వేతనం పొందుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో చదివితే అవకాశాలకు ఆకాశమే హద్దు. తాజాగా మా యూనివర్సిటీలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో రూ. 5.5 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులు ఎంపికయ్యారు. మరోవైపు జ్యుడీషియరీ విభాగంలోనూ నిరంతరం రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. లా కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు సామాజిక అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ ఉంటే కోర్సులో రాణించేందుకు వీలవుతుంది. కోర్సులో చేరిన తర్వాత విద్యార్థులు ప్రాక్టికల్ దృక్పథంతో అభ్యసనం చేయాలి. కేవలం పుస్తకాలు, పరీక్షలు, మంచి పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత అనే అంశాలకే పరిమితం కాకుండా రియల్ లైఫ్ నాలెడ్జ్ పెంచుకోవాలి. క్లాస్ రూం లెర్నింగ్‌కు పరిమితం కాకుండా స్వీయ పరిజ్ఞానం పెంచుకునే విధంగా వ్యవహరిస్తే సుస్థిర భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. మౌలిక సదుపాయాల లేమి, ఫ్యాకల్టీ కొరత వంటి సమస్యలున్న కళాశాలల్లో సీటు లభించిన విద్యార్థులు తామే స్వయంగా నాలెడ్జ్ అప్డేట్ చేసుకునేందుకు కృషి చేయాలి. రియల్ టైం కేస్ స్టడీస్ విశ్లేషణ, లీగల్ జర్నల్స్ అధ్యయనం వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. ఉన్నత విద్యకు సంబంధించి పీజీలో అన్ని స్పెషలైజేషన్స్‌కు సమ ప్రాధాన్యం ఉంటోంది. అయితే ఎంఎన్‌సీలు, కేపీఓల్లో ఉద్యోగాలు ఆశించే విద్యార్థులకు కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ స్పెషలైజేషన్స్ అదనపు ప్రయోజనం చేకూర్చుతాయి. - ప్రొఫెసర్ ఆర్.జి. బాబు భగవత్ కుమార్, వైస్ చాన్స్‌లర్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ. కావల్సిన లక్షణాలు న్యాయవాదిగా కెరీర్‌ను ఎంపిక చేసుకునే వారికి కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. ఎందుకంటే ఇతర వృత్తులతో పోల్చినప్పుడు తన జ్ఞానాన్ని(నాలెడ్జ్) ప్రభావవంతంగా ప్రదర్శించాలంటే ఆ లక్షణాలు ఉండాల్సిందే. లేకుంటే కెరీర్లో రాణించడం అంత సులభం కాదు. ఈ క్రమంలో మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యాలు.. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి జ్ఞాపక శక్తి, వేగంగా స్పందించే గుణం నాయకత్వం వహించే గుణం తార్కిక వివేచన, ఓర్పు సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అన్ని రకాల సంఘటనలపై అవగాహన ఉండాలి చక్కగా వినే తత్వం, ప్రసంగించే చాతుర్యం అవుటాఫ్ బాక్స్ థింకింగ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ న్యాయవాద వృత్తి చేపట్టాలకునే అభ్యర్థులు.. ఎల్ఎల్బీ డిగ్రీ పొందాక ప్రాక్టీస్‌కు ఉపక్రమించాలంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు ఉన్న పరిజ్ఞానాన్ని, సబ్జెక్ట్ నాలెడ్‌జను పరీక్షించి.. సదరు అభ్యర్థి వృత్తికి సరిపోతాడా? లేదా? నిర్ణయించడమే ఈ పరీక్ష ఉద్దేశం. వివరాలకు: www.barcouncilofindia.org అవకాశాలు: ప్రపంచీకరణ, అవుట్ సోర్సింగ్ నేపథ్యంలో.. లా గ్రాడ్యుయేట్లకు వైట్ కాలర్ జాబ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, బ్యాంకులు, సాఫ్ట్వేర్ సంస్థ ల్లో లీగల్ అడ్వైజర్, డ్రాఫ్ట్ రైటర్‌గా అవకాశాలు లభిస్తున్నా యి. ఇటీవల కాలంలో పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థ లు, కాపీరైట్ సంస్థలు, పబ్లిషింగ్ సంస్థలు, ఎన్జీఓలు కూడా లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. తమ కార్యకలాపాల చట్టపరమైన అంశాల పర్యవేక్షణకు వీరిని నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లు పీజీ,పీహెచ్ డీ కోర్సులు చేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో చేరొచ్చు. ప్రభుత్వ రంగంలో: లా గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ రంగంలోనూ అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఇవి అధికశాతం న్యాయవాద వృత్తికి సంబంధించినవై ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌స, ఏపీపీఓ, మేజిస్ట్రేట్స్, సబ్-మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాలి. ఇలా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టిన వారు..హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థాయికి చేరుకోవచ్చు. ఎల్పీఓ: ‘లా’ గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా సరికొత్త వేదిక లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (ఎల్పీఓ). ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన న్యాయ సేవా సంస్థలు భారీ సంఖ్యలో (దాదాపు 150 నుంచి 200 వరకు) మన దేశంలో శాఖలను ఏర్పాటు చేస్తూ.. న్యాయ నిపుణుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆయా దేశాల చట్టాలపై శిక్షణనిచ్చి శాశ్వత హోదా కల్పిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేల వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్లో అసోసియేట్‌గా అడుగుపెట్టి అనుభవం ఆధారంగా రెండు, మూడేళ్ల వ్యవధిలో సీనియర్ అసోసియేట్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. రానున్న ఐదేళ్లలో ఎల్పీఓ రంగంలో 30 నుంచి 40 వేల మంది అవసరం ఏర్పడుతుందని అంచనా. విదేశాల్లో: విదేశాల్లో లా కోర్సుల విషయానికొస్తే.. బ్రిటన్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే లా కోర్సులు.. మన యూనివర్సిటీలు అందించే లా కోర్సులు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి చాలా మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్‌లో లా చదివేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అంతేకాకుండా కోర్సు పూర్తయిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసే వారికి అకర్షణీయమైన పే ప్యాకేజ్‌లు లభిస్తున్నాయి. హార్వర్డ్ లా స్కూల్, యేల్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలను కూడా భారతీయులు ఎక్కువగా లా కోర్సుల కోసం ఎంపిక చేసుకుంటున్నారు. నేషనల్ లా యూనివర్సిటీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్‌లో విదేశీ సంస్థలు వస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో ఎంపికైన వారిలో కనీసం 20 నుంచి 25 శాతం మంది విదేశీ సంస్థల్లో అడుగుపెడుతున్నారు. వేతనాలు: ప్రభుత్వ రంగంలో స్థిరపడిన వారికి హోదాను బట్టి నెలకు రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు, బహుళ జాతి, తదితర సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఏడాదికి రూ. 4 నుంచి 6 లక్షల వరకు పేప్యాకేజ్‌లు అందుతున్నాయి. సొంతంగా న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.