తల్లి భాగ్యలక్ష్మితో నైనా జైస్వాల్
‘‘చదువుకోవడం ఎప్పుడూ బాగుంటుంది... అమ్మతో కలిసి కాలేజ్‌కి వెళ్లడం, పరీక్షలకు ప్రిపేర్ అవడం ఇంకా బాగుంది’’ అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. పీహెచ్‌డీ సహా పలు డిగ్రీలు అందుకుని అటు చదువులో ఇటు క్రీడల్లోనూ పిన్న వయస్కురాలిగా ఎన్నో విజయాలు లిఖించిన నైనా... తాజాగా తన తల్లి భాగ్యలక్ష్మి తో కలిసి ఎల్‌ఎల్‌బీ లో చేరింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో అమ్మకు క్లాస్‌మేట్‌గా తన అనుభవాలను పంచుకున్నారు.
సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని...
‘‘నాన్న (అశ్విన్) న్యాయవాది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన్ను గమనించేదాన్ని. న్యాయ స్థానాల్లో వాదోపవాదాలు ఆసక్తిగా అనిపించేవి. అయితే ‘లా’ ను కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం క్రీడాకారిణిగా బిజీగా ఉన్నాను. ఎల్‌ఎల్‌బీ తర్వాత నా సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను. దానికి లా చదవడం కొంత మేర ఉపకరిస్తుందని భావించాను. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారని, తొలి మార్గదర్శకత్వం తమదే ఉండాలని మా పేరెంట్స్ అభిప్రాయం.
అందుకే వీలైన అన్ని అంశాల్లో వాళ్లు ముందడుగు వేసి ఆ తర్వాత మాకు తగిన గైడెన్స్ ఇస్తుంటారు. పదకొండేళ్ల టీనేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సహకరించడం కోసం నాన్న నా కన్నా ముందే మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా సాధించి, ఆ తర్వాత నాకు సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నేను లా చేద్దామని అనుకున్నప్పుడు మా అమ్మగారు (భాగ్యలక్ష్మి జైస్వాల్) నాకు తోడయ్యారు. మా అమ్మ ఇప్పటికే ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేశారు. క్రీడల్లో బిజీగా ఉండే నాకు సపోర్ట్‌గా ఉండడానికి తాను కూడా లా విద్యార్థినిగా మారారు.
ఫ్రెండ్స్‌లా ఉన్నాం...
నాతోపాటు అమ్మ కూడా లా కోర్సులో జాయిన్ అవడం నాలో కొత్త ఉత్సాహం తెచ్చింది. బాగ్ లింగంపల్లిలోని ‘బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్’ లో మా న్యాయశాస్త్ర విద్యాభ్యాసం సాగింది. మేం ఇద్దరం తల్లీకూతుళ్లుగా క్లాస్‌మేట్స్‌గా ఉండడం చూసి అందరూ షాక్ అయ్యేవారు(నవ్వుతూ). ఇద్దరం కలిసి చదువుకోవడం, కేస్ స్టడీస్ అధ్యయనం చేయడం, పరీక్షలు రాయడం వైవిధ్యభరిత అనుభూతి అనే చెప్పాలి. అమ్మతో కలిసి చదువుతుంటే ఫ్రెండ్స్‌లా, ఇద్దరం ఈక్వల్ అన్నట్టే అనిపించింది.
చదువంటే విజ్ఞానం
అమ్మతో కలిసి మళ్లీ మరో కోర్సు చేసే అవకాశం వస్తే నేనైతే వెంటనే ఓకే అంటాను. నేను భవిష్యత్తులో లాయర్ అవుతానో లేదో చెప్పలేను. మా కుటుంబం దృష్టిలో... చదువు అంటే డిగ్రీలు కాదు... విజ్ఞానం సంపాదించడం, దాన్ని నిత్యజీవితంలో మన ఎదుగుదలకి ఉపయోగపడేలా చేసుకోవడం’’ అన్నారు నైనా జైస్వాల్.
Comments
Please login to add a commentAdd a comment