
22 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీ అందుకున్న తొలి భారతీయ యువతి
Naina jaiswal- రాజానగరం: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీని పొందారు. 22 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీని పొందిన భారతీయ తొలి యువతిగా నిలిచిన ఆమెకు ఏపీ గవర్నర్, ‘నన్నయ’ వర్సిటీ చాన్సలర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పీహెచ్‌డీ పట్టాను అమరావతిలో గురువారం అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రో ఫైనాన్స్ పాత్రపై ఆమె చేసిన అధ్యయనానికి ఈ పీహెచ్‌డీ లభించింది. పూర్వపు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు ఆమెకు గైడ్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశంలో 22 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీని అందుకున్న తొలి భారతీయ యువతిని తాను కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ అనుభూతి తనకు 8వ ఏట నుంచే ప్రారంభమైందని, ఆ వయస్సులోనే లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 10వ తరగతి పూర్తి చేసి, ఆసియాలో పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందానన్నారు. 10వ ఏట ఇంటర్మీడియెట్, 13వ ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానన్నారు. ఎంఏ పూర్తి చేసి 22 ఏట పీహెచ్‌డీ అందుకున్నానని జైస్వాల్ వివరించారు.
ఇకపై తన ఏకై క లక్ష్యంగా పెట్టుకున్న సివిల్స్ సాధించడమే తరువాయిగా పేర్కొన్నారు. తన మార్గదర్శకంలో పీహెచ్‌డీని అందుకున్న నైనా జైస్వాల్ భారతీయ తొలి యువతి కావడం సంతోషంగా ఉందని గైడ్‌గా వ్యవహరించిన ‘నన్నయ’ వర్సిటీ పూర్వపు వీసీ ఆచార్య ఎం. ముత్యాలునాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో నైనా జైస్వాల్ తల్లిదండ్రులు అశ్విన్‌కుమార్ జైస్వాల్, భాగ్యలక్ష్మి, తమ్ముడు అగస్త్య కూడా పాల్గొన్నారు.