Table tennis player
-
Tania Zeng: జెంగ్ సైరన్
‘కొన్ని విజయాలు కూడా పరాజయాలే. కొన్ని పరాజయాలు కూడా విజయాలే’ నిజమే! ఆటలోని పరాజితులు లోకం దృష్టిగా పెద్దగా రారు. అయితే టానియా జెంగ్ పరిస్థితి వేరు. ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణీ ప్రిలిమినరీ రౌండ్లోనే వైదొలగినా... ఆమె విజేతగానే వెలిగి΄ోయింది. దీనికి కారణం ఆమె వయసు. 58 సంవత్సరాల వయసులో తన ఒలింపిక్ కలను నిజం చేసుకున్న చైనీస్ – చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి టానియా జెంగ్ సంచలనం సృష్టించింది....తల్లి టేబుల్ టెన్నిస్ కోచ్ కావడంతో చిన్నప్పటి నుంచే ఆ ఆటపై జెంగ్‌కు ఆసక్తి ఏర్పడింది. బడిలో కంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కనిపించిందే ఎక్కువ. అక్కడ ఎంతోమందిప్రొఫెషనల్ ప్లేయర్స్‌తో మాట్లాడే అవకాశం దొరికింది.వారితో మాట్లాడడం అంటే... ఆటల పాఠాలు నేర్చుకోవడమే!తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి టేబుల్ టెన్నిస్‌లో జెంగ్‌కు తల్లి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. 11 ఏళ్ల వయసులో ఎలిట్ స్పోర్ట్స్ అకాడమీలో చేరింది జెంగ్. పన్నెండేళ్ల వయసులోప్రొఫెషనల్ ప్లేయర్ అయింది. నేషనల్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. పదహారు సంవత్సరాలకు చైనీస్ టేబుల్ టెన్నిస్ టీమ్‌లో చోటు సంపాదించింది. ప్రామిసింగ్ ప్లేయర్’గా పేరు తెచ్చుకుంది.‘అంతా ఓకే’ అనుకొని ఉంటే జెంగ్ ప్రయాణం మరోలా ఉండేది. అయితే ఆ సమయంలో టేబుల్ టెన్నిస్‌కు సంబంధించి నిబంధనలు ఏవో మార్చడం జెంగ్‌కు చిరాకు తెప్పించింది. ఆ చిరాకు కోపంగా మారి తనకు ్రపాణసమానమైన టేబుల్ టెన్నిస్‌కు దూరం అయింది.కొంత కాలం తరువాత...తనకు అందిన ఆహ్వానం మేరకు చిలీలో స్కూల్ పిల్లల టేబుల్ టెన్నిస్ కోచ్‌గా కొత్త ప్రయాణం ్రపారంభించింది. జియాంగ్ జెంగ్ పేరు కాస్తా టానియా జెంగ్గా మారింది. ‘జెంగ్’ తాను పుట్టిపెరిగిన చైనా అస్తిత్వం. ‘టానియ’ తనకు ఎంతో ఇష్టమైన, కొత్త జీవితాన్ని ఇచ్చిన చిలీ అస్తిత్వం.తన కుమారుడికి టేబుల్ టెన్నిస్‌లో కోచింగ్ ఇస్తున్న సమయంలో పోటీలలో పాల్గొనాలనే ఉత్సాహం జెంగ్లో మొదలైంది. 2004, 2005 నేషనల్ లెవల్ టోర్నమెంట్స్‌ను గెలుచుకుంది.టేబుల్ టెన్నిస్‌లో చూపించే అద్భుత ప్రతిభాపాటవాలతో చిలీ మీడియా ఎట్రాక్షన్‌గా మారింది జెంగ్. ఆమె ఆట ఆడే తీరు చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్‌కు ఎంతో ఇష్టం.ఎప్పటి నుంచో నేస్తంగా ఉన్న ‘విజయం’ ఒలింపిక్స్‌లో ముఖం చాటేసినా... జెంగ్ ముఖంలోని వెలుగు తగ్గలేదు. అదేపోరాట స్ఫూర్తి! కుమార్తెను ఒలింపిక్స్‌లో చూడాలనేది 92 సంవత్సరాల తండ్రి కల. ఆ కలను నిజం చేసి తండ్రి కళ్లలో వెలుగు నింపింది జెంగ్.‘గో ఎట్ ఇట్, గో విత్ ఎవ్రీ థింగ్’ అంబరాన్ని అంటే సంతోషంతో అంటున్నాడు ఆ పెద్దాయన.‘ఒలింపిక్ గ్రాండ్ మదర్’‘కమ్ బ్యాక్ క్వీన్’... ఇలా రకరకాల కాప్షన్లతో జెంగ్ గురించి సోషల్ మీడియాలో గొప్పగాపోస్టులు పెడుతున్నారు నెటిజనులు.‘ఒలింపిక్స్ అనేది నా జీవితకాల కల. క్వాలిఫై అవుతానని ఊహించలేదు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. విరివిగా ఆటలు ఆడాలనే ఉత్సాహం పెరిగింది’ అంటుంది టానియ జెంగ్.వివిధ ్రపాంతాలకు కుమారుడు ఒంటరిగాపోటీలకు వెళ్లే సమయానికి జెంగ్ టెన్నిస్ రాకెట్‌కు దూరం అయింది. సుదీర్ఘ విరామం తరువాత రీజినల్ టోర్నమెంట్స్ కోసం మళ్లీ రాకెట్ పట్టింది. మళ్లీ విజయపరంపర మొదలైంది. 2023 పాన్ అమెరికన్ గేమ్స్‌లో కాంస్యం గెలుచుకోవడంతో చిలీలో జెంగ్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. ఒలిపింక్స్ 2024కు క్వాలిఫై కావడంతో జెంగ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. -
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
-
TT: 24 ఏళ్లపుడు.. మళ్లీ 40 ఏళ్ల వయసులో! రెండు స్వర్ణాలు.. రాజమండ్రి నుంచి
2006 మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు.. 24 ఏళ్ల యువ ఆటగాడు టేబుల్ టెన్నిస్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు.. 40 ఏళ్ల వెటరన్ ఆటగాడు టేబుల్ టెన్నిస్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఈ రెండు పతకాల మధ్య 16 ఏళ్ల అంతరం ఉంది. అయితే అప్పటి యువ ఆటగాడు, ఇప్పటి వెటరన్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. అదే దూకుడు, అదే పట్టుదల, అదే విజయకాంక్ష, అందుకోసం తీవ్రంగా శ్రమించే తత్వం! అతనే ఆచంట శరత్‌కమల్.. ఈ 16 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల ప్రస్థానంలో ఏకంగా 13 పతకాలు, వాటిలో 7 స్వర్ణాలు సాధించిన శరత్ కమల్ 41 ఏళ్ల వయసులోనూ ఆటే ప్రాణంగా దూసుకుపోతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మదరాసులో పుట్టి పెరిగిన ఈ తెలుగు ప్లేయర్ సుదీర్ఘ కాలంతో తన ఆటతో ప్రత్యేక ముద్ర వేసి భారత టేబుల్ టెన్నిస్‌కు పర్యాయపదంగా నిలిచాడు. ఎనిమిదేళ్ల క్రితం శరత్ కమల్ తుంటికి గాయమైంది. 20 సెంటీ మీటర్ల చీలిక రావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకునే క్రమంలో దాదాపు రెండు నెలల పాటు అతను వీల్‌చెయిర్‌లోనే ఉన్నాడు. ఆపై మరో మూడు వారాల పాటు క్రచెస్తోనే నడక. ఈ సమయంలో ఇంకా కెరీర్ కొనసాగుతుందని ఎవరూ అనుకోరు. శరత్ కూడా అదే భావనతో ఉన్నాడు. అయితే ఆటపై ఉన్న మమకారం అతనిలో పట్టుదలను పెంచింది. కోలుకున్న తర్వాత పూర్తి ఫిట్నెస్ను అందుకోవడంపై దృష్టి పెట్టిన శరత్ మళ్లీ తన ఆటను మొదలుపెట్టాడు. పునరాగమనం ఏదో నామ్‌కే వాస్తేగా జరగలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన శరత్ తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆపై కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజత, కాంస్యాలతో మెరిశాడు. అదే ఏడాది ఆసియా క్రీడల్లోనూ రెండు కాంస్యాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఎదురులేకుండా అతను తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. ఇది అతని మానసిక దృఢత్వాన్ని చూపిస్తోంది. ఆట మొదలుపెట్టిన కొత్తలో ఓటమి ఎదురైనప్పుడు తట్టుకోలేక తీవ్ర అసహనాన్ని ప్రదర్శించే అలవాటు శరత్లో ఉండేది. గెలుపోటములను సమానంగా స్వీకరించలేకపోయాడు. ఈ లక్షణాన్ని తగ్గించేందుకు శరత్ తండ్రి, బాబాయ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదే అనుభవంతో తర్వాతి రోజుల్లో ఎంతో పరిపక్వత ప్రదర్శించిన శరత్ ఇప్పటి వరకు దానిని కొనసాగించడంలో సఫలమయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో.. శరత్ కమల్ తండ్రి శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి. ఆయనతో పాటు ఆయన సోదరుడు మురళీధర్రావుకూ టేబుల్ టెన్నిస్ అంటే బాగా ఇష్టం. అయితే రాజమండ్రిలో శిక్షణకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో టీటీని కెరీర్‌గా మలచుకునే క్రమంలో మద్రాసు చేరారు. అక్కడ సాధన తర్వాత జాతీయ స్థాయి పోటీల వరకు వారు వెళ్లగలిగారే తప్ప పెద్ద స్థాయి కలలు కనలేకపోయారు. తర్వాతి దశలో టేబుల్ టెన్నిస్ కోచ్‌గా శ్రీనివాసరావు కొత్త ప్రయాణం మొదలైంది. సహజంగానే తాము సాధించలేనిదాన్ని తమ శిష్యుల ద్వారా సాధించాలనే కోరిక, తపన కోచ్‌లలో ఉంటుంది. అలా అక్కడ ఆయన కోచింగ్ మొదలైంది. ఆ క్రమంలో శిక్షణ పొందుతూ వచ్చినవారి జాబితాలో కొద్ది రోజులకే ఆయన కొడుకు కూడా చేరాడు. పసివాడిగా ఉన్నప్పుడు తండ్రి వెంట కోచింగ్ కేంద్రానికి వెళుతూ వచ్చిన శరత్కూ టీటీపై ఆసక్తి పెరగడం శ్రీనివాసరావు పనిని సులువు చేసింది. ప్రాథమికంగా ఓనమాలు నేర్పించిన తర్వాత కమల్లో నిజంగానే అరుదైన ప్రతిభ ఉందని గుర్తించిన తండ్రి సరైన శిక్షణతో బాగా ప్రోత్సహించాడు. దాంతో తమిళనాడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అతను పాల్గొనడం మొదలైంది. అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–17లలో రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లో శరత్ హవా సాగింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆటను కొనసాగించాలా లేక ఇంజినీరింగ్ వైపు వెళ్లాలా అని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. మంచి ఫలితాలు సాధిస్తూ కూడా ఆటను వదిలిపెట్టిన చాలామంది గురించి శ్రీనివాసరావుకు బాగా తెలుసు. కానీ తన కుమారుడి విషయంలో మాత్రం ఆయన అలాంటి తప్పు చేయలేదు. టీటీపైనే దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేశాడు. దాని ఫలితాలు ఆ తర్వాత అద్భుతంగా వచ్చాయి. అలా మొదలైంది.. సరిగ్గా 20 ఏళ్ల వయసులో శరత్‌కమల్ 2002లో తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆపై భారత జట్టుకు కామన్వెల్త్ క్రీడల కోసం నిర్వహించిన ప్రత్యేక క్యాంప్‌కీ ఎంపికయ్యాడు. జూనియర్ కావడంతో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అవకాశం రాకపోయినా సీనియర్ల సాహచర్యంలో ఎంతో నేర్చుకునే అవకాశం దక్కింది. తర్వాతి ఏడాదే అతను తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో (2003) విజేతగా నిలవడంతో భారత టీటీలో కొత్త మార్పుకు అంకురార్పణ జరిగింది. 2003లో జరిగిన టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్ శరత్ కెరీర్లో తొలి మెగా టోర్నీ కాగా, తర్వాతి ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో అతను తన కెరీర్లో తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రావడం అతని కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో శరత్ పోరు రెండు రౌండ్లకే పరిమితమైనా అతని ఆట పదును పెరిగింది. కామన్వెల్త్లో హవా.. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ పోటీల్లో రాణించడం అంత సులువు కాదు. చైనాతో పాటు యూరోపియన్ ఆటగాళ్ల హవా అక్కడ కొనసాగుతుంది. అయితే ఇక్కడా శరత్ తన ముద్ర చూపించాడు. కెరీర్లో రెండు ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ సాధించిన అతను భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. శరత్‌కు కామన్వెల్త్ క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. వరుసగా ఐదు సార్లు 2006, 2010, 2014, 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాడు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, టీమ్ విభాగాలు.. ఇలా అన్నింటిలో అతను చెలరేగిపోయాడు. ఫలితంగా అతను ఖాతాలో ఏకంగా 13 కామన్వెల్త్ క్రీడల పతకాలు ఉన్నాయి. ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించిన అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో మరో 3 పతకాలు సాధించడం విశేషం. మరో వైపు విదేశీ లీగ్‌లలో కూడా తన సత్తాను చూపించాడు. ప్రపంచ టీటీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే బుందేస్లిగా (జర్మనీ)లో కూడా ఆడిన అతను 2010–11 సీజన్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు డచ్, స్వీడన్, స్పానిష్ లీగ్‌లలో కూడా అతను ఆడాడు. దురదృష్టవశాత్తు శరత్ మెరుపులు ఒలింపిక్స్‌లో ఫలితాన్ని అందించలేదు. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో పాల్గొన్నా పతకం అతని దరి చేరలేదు. వరుస గాయాలతో బాధపడుతూ 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అయితే ఒలింపిక్స్ పతకం లేకపోయినా శరత్ సాధించిన ఘనతలు అతని స్థాయిని చూపించాయి. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతున్న శరత్ కమల్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు. 10 – భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన రికార్డు శరత్ సొంతం. 2019లో తొమ్మిదో టైటిల్ గెలిచి కమలేశ్ మెహతా (8) రెండు దశాబ్దాల రికార్డు బద్దలు కొట్టిన అతను 2022లో పదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 30వ స్థానానికి చేరిన శరత్ కమల్.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అర్జున, పద్మశ్రీ, ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే -
నేను సంతోషపడిన సందర్భం అదే: నైనా జైశ్వాల్
-
Naina Jaiswal: ఎదురులేని నైనా.. తొలి భారతీయ యువతిగా సరికొత్త చరిత్ర
Naina jaiswal- రాజానగరం: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీని పొందారు. 22 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీని పొందిన భారతీయ తొలి యువతిగా నిలిచిన ఆమెకు ఏపీ గవర్నర్, ‘నన్నయ’ వర్సిటీ చాన్సలర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పీహెచ్డీ పట్టాను అమరావతిలో గురువారం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రో ఫైనాన్స్ పాత్రపై ఆమె చేసిన అధ్యయనానికి ఈ పీహెచ్డీ లభించింది. పూర్వపు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు ఆమెకు గైడ్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశంలో 22 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీని అందుకున్న తొలి భారతీయ యువతిని తాను కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అనుభూతి తనకు 8వ ఏట నుంచే ప్రారంభమైందని, ఆ వయస్సులోనే లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 10వ తరగతి పూర్తి చేసి, ఆసియాలో పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందానన్నారు. 10వ ఏట ఇంటర్మీడియెట్, 13వ ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానన్నారు. ఎంఏ పూర్తి చేసి 22 ఏట పీహెచ్డీ అందుకున్నానని జైస్వాల్ వివరించారు. ఇకపై తన ఏకై క లక్ష్యంగా పెట్టుకున్న సివిల్స్ సాధించడమే తరువాయిగా పేర్కొన్నారు. తన మార్గదర్శకంలో పీహెచ్‌డీని అందుకున్న నైనా జైస్వాల్ భారతీయ తొలి యువతి కావడం సంతోషంగా ఉందని గైడ్‌గా వ్యవహరించిన ‘నన్నయ’ వర్సిటీ పూర్వపు వీసీ ఆచార్య ఎం. ముత్యాలునాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో నైనా జైస్వాల్ తల్లిదండ్రులు అశ్విన్‌కుమార్ జైస్వాల్, భాగ్యలక్ష్మి, తమ్ముడు అగస్త్య కూడా పాల్గొన్నారు. -
Naina Jaiswal: నైనా జైస్వాల్‌కు డాక్టరేట్.. అతి పిన్న వయసులోనే..
Table Tennis Player Naina Jaiswal: దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ 22 ఏళ్ల వయస్సులోనే పీహెచ్‌డీలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతానికి చెందిన నైనా జైస్వాల్.. ఏపీలోని రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్‌ను రిసెర్చ్ గైడ్, యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఎం. ముత్యాల నాయుడు అభినందించారు. కాగా టీటీ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు అందుకున్న నైనా.. చదువులోనూ తనకు తానే సాటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి కంప్లీట్ చేసిన నైనా.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. ఈ క్రమంలో ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. మోటివేషనల్ స్పీకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నైనా.. తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీ చదువుతున్నారు. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ -
ఒలింపిక్ పతకమే మిగిలుంది
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు. 20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్‌గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్‌లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు. తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్‌హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్‌గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు. -
కామన్ వెల్త్ గేమ్స్ టీటీలో స్వర్ణం గెలిచిన ఆకుల శ్రీజ
-
నేనూ అమ్మ... క్లాస్మేట్స్.. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని...
‘‘చదువుకోవడం ఎప్పుడూ బాగుంటుంది... అమ్మతో కలిసి కాలేజ్‌కి వెళ్లడం, పరీక్షలకు ప్రిపేర్ అవడం ఇంకా బాగుంది’’ అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. పీహెచ్డీ సహా పలు డిగ్రీలు అందుకుని అటు చదువులో ఇటు క్రీడల్లోనూ పిన్న వయస్కురాలిగా ఎన్నో విజయాలు లిఖించిన నైనా... తాజాగా తన తల్లి భాగ్యలక్ష్మి తో కలిసి ఎల్ఎల్బీ లో చేరింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో అమ్మకు క్లాస్మేట్గా తన అనుభవాలను పంచుకున్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని... ‘‘నాన్న (అశ్విన్) న్యాయవాది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన్ను గమనించేదాన్ని. న్యాయ స్థానాల్లో వాదోపవాదాలు ఆసక్తిగా అనిపించేవి. అయితే ‘లా’ ను కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం క్రీడాకారిణిగా బిజీగా ఉన్నాను. ఎల్ఎల్బీ తర్వాత నా సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను. దానికి లా చదవడం కొంత మేర ఉపకరిస్తుందని భావించాను. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారని, తొలి మార్గదర్శకత్వం తమదే ఉండాలని మా పేరెంట్స్ అభిప్రాయం. అందుకే వీలైన అన్ని అంశాల్లో వాళ్లు ముందడుగు వేసి ఆ తర్వాత మాకు తగిన గైడెన్స్ ఇస్తుంటారు. పదకొండేళ్ల టీనేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సహకరించడం కోసం నాన్న నా కన్నా ముందే మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా సాధించి, ఆ తర్వాత నాకు సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నేను లా చేద్దామని అనుకున్నప్పుడు మా అమ్మగారు (భాగ్యలక్ష్మి జైస్వాల్) నాకు తోడయ్యారు. మా అమ్మ ఇప్పటికే ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేశారు. క్రీడల్లో బిజీగా ఉండే నాకు సపోర్ట్‌గా ఉండడానికి తాను కూడా లా విద్యార్థినిగా మారారు. ఫ్రెండ్స్‌లా ఉన్నాం... నాతోపాటు అమ్మ కూడా లా కోర్సులో జాయిన్ అవడం నాలో కొత్త ఉత్సాహం తెచ్చింది. బాగ్ లింగంపల్లిలోని ‘బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్’ లో మా న్యాయశాస్త్ర విద్యాభ్యాసం సాగింది. మేం ఇద్దరం తల్లీకూతుళ్లుగా క్లాస్మేట్స్గా ఉండడం చూసి అందరూ షాక్ అయ్యేవారు(నవ్వుతూ). ఇద్దరం కలిసి చదువుకోవడం, కేస్ స్టడీస్ అధ్యయనం చేయడం, పరీక్షలు రాయడం వైవిధ్యభరిత అనుభూతి అనే చెప్పాలి. అమ్మతో కలిసి చదువుతుంటే ఫ్రెండ్స్‌లా, ఇద్దరం ఈక్వల్ అన్నట్టే అనిపించింది. చదువంటే విజ్ఞానం అమ్మతో కలిసి మళ్లీ మరో కోర్సు చేసే అవకాశం వస్తే నేనైతే వెంటనే ఓకే అంటాను. నేను భవిష్యత్తులో లాయర్ అవుతానో లేదో చెప్పలేను. మా కుటుంబం దృష్టిలో... చదువు అంటే డిగ్రీలు కాదు... విజ్ఞానం సంపాదించడం, దాన్ని నిత్యజీవితంలో మన ఎదుగుదలకి ఉపయోగపడేలా చేసుకోవడం’’ అన్నారు నైనా జైస్వాల్. -
Commonwealth Games: కోర్టుకెక్కిన మరో టీటీ ప్లేయర్.. ఏం జరిగింది?
కామన్వెల్త్ క్రీడల కోసం భారత టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపికకు సంబంధించి వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే దియా చిటాలే, మనుష్ షా టీమ్ ఎంపికను ప్రశ్నించారు. తాజాగా స్వస్తిక ఘోష్ కూడా తనకు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఎంపిక ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారం చూస్తే స్వస్తిక నాలుగో స్థానంలో ఉంటుందని, ఆమెను జట్టులోకి ఎంపిక చేయాల్సిందని ఆమె తండ్రి సందీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. కాగా దియా చిటాలేను తర్వాత టీటీ జట్టులో చేర్చగా మానుష్ షాకు మాత్రం నిరాశే ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్ ఎంపిక నిబంధనల ప్రకారం అతడు టాప్-4లో ఉన్నా స్క్వాడ్‌లో చేర్చకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. శుక్రవారం ఇందుకు సంబంధించి విచారణ జరుగనుంది. ఇక జాతీయ స్థాయిలో ప్రదర్శన(50 శాతం), అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన(30 శాతం).. సెలక్టర్ల విచక్షణ అధికారం(20 శాతం) మేరకు ఆయా ప్లేయర్లకు స్క్వాడ్(టాప్-4)లో చోటు దక్కుతుంది. ఈ క్రమంలో పలువురు టీటీ ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది -
రోడ్డు ప్రమాదంలో యువ ప్లేయర్ దుర్మరణం
Tamil Nadu Table Tennis Player Passed Away: తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ (18) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విశ్వ మరో ఐదుగురు కలిసి 83వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు గౌహతి నుండి షిల్లాంగ్‌కు వెళ్తుండగా (టాక్సీలో) ఈ ఘోరం సంభవించింది. ఈ ప్రమాదంలో విశ్వతో పాటు కారు డ్రైవర్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదలగా, మిగతా ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. Saddened to learn that Tamil Nadu paddler, Deenadayalan Vishwa passed away after an accident in Ri Bhoi District while on his way to Shillong to participate in the 83rd Senior National Table Tennis Championship in our State@ianuragthakur @KirenRijiju @mkstalin @CMOTamilnadu pic.twitter.com/sGvAc3eDhe — Conrad Sangma (@SangmaConrad) April 17, 2022 ఈ విషయాన్ని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. విశ్వ అకాల మరణం పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సంతాపం వ్యక్తం చేశారు. షిల్లాంగ్ వేదికగా జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇవాల్టి (ఏప్రిల్ 18) నుంచి ప్రారంభమైంది. కాగా, విశ్వ.. అండర్-19 అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున అనేక పతకాలు సాధించాడు. ఈనెల 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్లో జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో అతను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండింది. చదవండి: VVS Laxman: క్రీడలపై మక్కువతోనే క్రికెటర్‌నయ్యా.. -
వరల్డ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్: నంబర్‌వన్‌గా పాయస్ జైన్
భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువతార పాయస్ జైన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్ అండర్–17 బాలుర సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల పాయస్ జైన్ మూడు అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. మానవ్ ఠక్కర్ (అండర్–21) తర్వాత ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ గా నిలిచిన రెండో భారతీయ ప్లేయర్ పాయస్ జైన్ కావడం విశేషం. వాల్ట్ ఈవెంట్లో అరుణా రెడ్డికి 11వ స్థానం ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి వాల్ట్ ఈవెంట్ ఫైనల్ ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయింది. జపాన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అరుణా రెడ్డి క్వాలిఫయింగ్‌లో 13.353 పాయింట్లు స్కోరు చేసి 11వ స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. అరుణ మూడో రిజర్వ్‌గా ఉంది. టాప్–8 నుంచి ముగ్గురు వైదొలిగితే అరుణా రెడ్డికి ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం.. -
Corona: టీటీ మాజీ ప్లేయర్ చంద్రశేఖర్ మృతి
న్యూఢిల్లీ: భారత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్ చంద్రశేఖర్ (64) కరోనాతో కన్నుమూశారు. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన చంద్రశేఖర్ 1982 కామన్వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్ చేరారు. క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక ఆయన కోచ్‌గా మారారు. ప్రస్తుత యువ ఆటగాడు సత్యన్, జాతీయ మాజీ చాంపియన్ ఎస్.రామన్ ఆయన శిష్యులే. చనిపోయే సమయానికి చంద్రశేఖర్ చెన్నైలోనే ఎస్‌డీఏటీ–మెడిమిక్స్ టీటీ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్
సాక్షి, కాచిగూడ (హైదరాబాద్) : జాతీయస్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడలో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డు సృష్టిస్తున్నాడు కాచిగూడకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆగస్త్య జైస్వాల్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీ కాలేజీలో బీఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివాడు. 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్ పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోనే 14 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన బాలుడిగా ఆగస్త్య జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఆగస్త్య జైస్వాల్ సోదరి నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ 13 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంగళవారం కాచిగూడలో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అశ్విన్‌కుమార్‌లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అగస్త్య జైస్వాల్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగస్త్య జైస్వాల్ మాట్లాడుతూ చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు. స్కూల్‌కు వెళ్లకుండా తల్లిదండ్రులనే తన గురువులుగా చేసుకుని క్రీడా, విద్యా రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపాడు. -
టీటీలో మరమనిషితో మన మనిషి పోరు...
చెన్నై: అప్పట్లో మనం వెండితెరపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్... తనను పోలిన రోబోతో ఇంచుమించు యుద్ధమే చేస్తాడు. ఇదంతా సినిమా‘ట్రిక్’. కానీ నిజజీవితంలో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్... రోబోతో తన ఆట ప్రాక్టీస్ చేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచంతో పాటు భారత్ కూడా లాక్డౌన్లో ఉంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో సత్యన్ తన భాగస్వామిగా మరో మనిషిని కాకుండా మరమనిషిని ఎంచుకున్నాడు. రోబోతోనే తన ప్రాక్టీస్ చురుగ్గా సాగుతోందని చెప్పాడు. ఈ రోబోను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఇది నిమిషానికి 120 బంతుల్ని నెట్‌పై ఆడగలదు. అన్నట్లు బంతుల స్పిన్, వేగ నియంత్రణను చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఈ మరమనిషితోనే రోజు గంటన్నర సేపు ప్రాక్టీస్ చేస్తున్నట్లు 27 ఏళ్ల సత్యన్ తెలిపాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మొత్తం ఈవెంట్లను జూన్ 30 దాకా రద్దు చేసింది. -
క్రీడాకారులకు ఎయిరిండియా క్షమాపణ
న్యూఢిల్లీ : నేషనల్ క్యారియర్ ఎయిరిండియా.. టెన్నిస్ ప్లేయర్లను వదిలేసి గాలిలోకి ఎగిరిపోయింది. టెన్నిస్ ప్లేయర్లను ఇలా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోనే వదిలిపోయిన ఘటనకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, తాము ఆటగాళ్లకు క్షమాపణ చెబుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి అన్నారు. తదుపరి అందుబాటులో ఉన్న విమానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఎయిరిండియా గొప్ప వారసత్వం కలిగి ఉందని, ఆటగాళ్లకు తాము ఎక్కువ గౌరవం కూడా ఇస్తామన్నారు. పలు పీఎన్ఆర్లలో మెల్బోర్న్ విమానాన్ని దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్ బుక్ చేసుకున్నారని, పొరపాటున వీరిలో కొంతమంది ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత విమానాలను ఏర్పాటు చేసేంతవరకు క్రీడాకారులకు ఎయిరిండియా హోటల్ సదుపాయం కూడా కల్పించినట్టు ఈ విమానయాన సంస్థ మరో ట్వీట్లో చెప్పింది. అసలేం జరిగిందంటే... ఎయిరిండియా విమానం నెంబర్. ఏఐ0308లో టిక్కెట్లను దేశీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ల టీమ్ బుక్ చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ మనీకా బాత్రాతో పాటు ఏడుగురు ప్లేయర్లను ఎయిరిండియా విమానంలోకి అనుమతించలేదు. సీట్లన్నీ బుక్ అయి ఉండటం మాత్రమే కాక, వారి పి.ఎన్.ఆర్. (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) నంబర్లు సరిపోలేదని ఎయిర్ ఎండియా విమానం నిరాకరించింది. ఈ విషయంపై మనీకా బాత్రా ట్విటర్ ద్వారా తన బాధను షేర్చేసుకున్నారు. క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాథోర్, ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ ట్వీట్ షేర్ చేశారు. దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్‌కు చెందిన మొత్తం 17 మంది క్రీడాకారులు, అధికారులు ఏఐ 0308 విమానంలో మెల్బోర్న్కు వెళ్లాల్సి ఉంది. మెల్బోర్న్లో మొదలౌతున్న ఐ.టి.టి.ఎఫ్. (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాము ఎయిరిండియా కౌంటర్ వద్దకు వచ్చిన తర్వాత విమానమంతా ఓవర్‌బుక్ అయినట్టు తెలిసింది. కేవలం 10 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుందని కౌంటర్ వద్ద చెప్పారు. మిగతా ఏడుగురు క్రీడాకారులు ప్రయాణించడానికి వీలులేదు అనే సరికి, క్రీడాకారులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం అని చెప్పింది. సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ వెంటనే స్పందించారు. కొన్ని గంటల తర్వాత మరో విమానంలో వారిని మెల్బోర్న్కు పంపించేలా కృషిచేశారు. మిగతా క్రీడాకారులకు కూడా మెల్బోర్న్ వెళ్లేందుకు బోర్డింగ్ పాస్ దొరకడంతో, మనీకా క్రీడా మంత్రికి, పీఎం ఆఫీసుకు, స్పోర్ట్స్ అథారిటీకి, నీలం కపూర్ మేడమ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నట్టు మరో ట్వీట్ చేశారు. -
అర్జునా అవార్డుకు మనికా బత్రా పేరు సిఫార్సు
-
స్నేహిత్ @ 24
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అండర్–18 బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యువ సంచలనం సూరావజ్జుల స్నేహిత్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవలే ఇటలీలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన స్నేహిత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ను అందుకున్నాడు. సింగిల్స్‌లో భారత్ నుంచి రెండో అత్యుత్తమ ర్యాంకర్ స్నేహిత్ కావడం విశేషం. గుజరాత్ ప్లేయర్ మానవ్ ఠక్కర్ రెండో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్నాడు. గత ఆరు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో స్నేహిత్ జోరు కొనసాగిస్తున్నాడు. గతేడాది జోర్డాన్ ఓపెన్‌లో స్వర్ణం, రజతం నెగ్గిన 17 ఏళ్ల స్నేహిత్... స్లొవేనియా, ఇండియా ఓపెన్ టోర్నీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. -
నైనాకు రూ.3 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) సత్కరించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్) ఆమెకు రూ. 3 లక్షల చెక్‌ను అందజేశారు. పాకిస్థాన్‌లో గత నెల జరిగిన ఆసియా జూనియర్, క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో ఆమె ఒక్కో స్వర్ణ, రజతం గెలిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నజరానాను అందజేసింది. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న నైనాను లవ్ అగర్వాల్, రమణాచారిలు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఆటల్లోనే కాదు... చదువుల్లోనూ ముందే..
-
నైనా, సయీదాలకు సన్మానం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీయూఎస్) మహిళా విభాగం ఆధ్వర్యంలో టేబుల్‌టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్, కరాటే క్రీడాకారిణి సయీదా ఫాలక్‌లను సన్మానించారు. మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా నిర్వహించిన సదస్సులో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారిణులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీయూఎస్ మహిళా అధ్యక్షురాలు టి.నిర్మల, కన్వీనర్ కనకతారలతో పాటు పలువురు ఉద్యోగినులు పాల్గొన్నారు. ఆ ఇద్దరు క్రీడాకారిణులతో పాటు కూచిపూడి కళాకారిణి సుహితనూ సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళల భాగస్వామ్యానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని, ఉద్యోగినుల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీయూఎస్ అధ్యక్షుడు సి.విఠల్, కోశాధికారి పి.పవన్ కుమార్ గౌడ్, వి.నిర్మల, సునీత, గీతారాణి, కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.